ఇప్పుడు 30 ఆలయాలకు ‘అంబ’…భ్రమరాంబ!

శ్రీకాళహస్తి ఆలయ ఈవోగా ఉంటూ…అక్రమార్కులకు కళ్లెంవేసి, అభివృద్ధిలో తనదైన ముద్రవేసి…భక్తుల అభిమానాన్ని చూరగొన్న భ్రమరాంబపై కక్షగట్టి, ఆ ఆలయం నుంచి బదిలీ చేయించినా…ఇప్పుడు ఏకంగా 30 ఆలయాలకు ‘అంబ’గా మారి తిరుపతికి వచ్చారు. దేవాదాయ శాఖ తిరుపతి రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌గా భ్రమరాంబ సోమవారం (23.07.2018)న బాధ్యతలు స్వీకరించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న శ్రీకాళహస్తి ఆలయ మాస్టర్‌ ప్లాన్‌ పనులను తనదైన పనితీరుతో పట్టాలెక్కించి, ఆ పనిలో బిజీగా ఉన్న సమయంలో…గత నెల 15న ఆమెను ఆకస్మికంగా బదిలీ చేశారు. ఆ స్థానంలోకి వచ్చిన అధికారి భ్రమరాంబ లేని సమయంలో బాధ్యతలు స్వీకరించడం, అక్కడి ఉద్యోగులు ఆమెపై కోపంతో నేమ్‌బోర్డు పగలగొట్టడం వివాదాస్పదమయింంది.
నిజాయితీతో ముక్కుసూటిగా పనిచేసే అధికారిగా భ్రమరాంకు పేరుంది.

అప్పుడు మౌనంగా అమరావతికి వెళ్లిపోయిన భ్రమరాంబ మొన్నటి దాకా ఏ పోస్టూ లేకుండా ఖాళీగా ఉన్నారు. రెండు రోజుల క్రితం తిరుపతి ఆర్‌జెసిగా నియమిస్తూ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆమెకు ఉత్తర్వులు ఇచ్చారు. తిరుపతి ఆర్‌జెసి పరిధిలో రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 30 ఆలయాలు ఉంటాయి. చిత్తూరు జిల్లాలోని బోయకొండ, తలకోన; నెల్లూరు జిల్లాలోని పెంచలకోన, కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం, అనంతపురం జిల్లాలోని కదిరి లక్షీనరిసింహ స్వామి ఆలయం…ఇలా ప్రముఖ ఆలయాలు ఆర్‌జెసి పర్యవేక్షణలో ఉంటాయి.

శ్రీకాళహస్తి ఈవోగా ఉన్నప్పుడే ఆమె…ఆర్‌జెసి ఇన్‌ఛార్జిగానూ పని చేశారు. అయితే…శ్రీకాళహస్తి ఈవోగానే పని సరిపోవడంతో ఆర్‌జెసి బాధ్యతలపై అంతగా దృష్టి పెట్టలేకపోయారు. ఇవి చిన్న ఆలయాలే అయినప్పటికీ…. అక్కడ జరిగే అక్రమాలకు కొదవే లేదు. అధికారులు, పాలకమండళ్ల ఇష్టారాజ్యంగా ఉంటోంది. పూర్థిస్థాయి ఆర్‌జెసిగా బాధ్యతలు చేపట్టిన భ్రమరాంబకు చేతినిండా పని వుంటుందన్నమాట. ఇదే మాటను ఆమెతో అంటే….’గతంలో శ్రీకాళహస్తిలో పని ఒత్తిడి వల్ల మిగతా ఆలయాలపై పెద్దగా దృష్టి పెట్టలేకపోయాను. ఇప్పుడు పూర్తికాలం ఇదే పనిలో ఉంటాను కాబట్టి….అన్నింటినీ నా శక్తికొద్దీ అభివృద్ధి చేస్తాను’ అని ధర్మచక్రంతో తెప్పారు.

ఇదిలావుండగా భ్రమరాంబ దేవాదాయ శాఖలోని ఎస్టేట్‌ అధికారి పోస్టులోకి వెళ్లాలనుకున్నారు. అమరావతి కేంద్రంగా పని చేయాల్సిన ఈ పోస్టులో పెద్దగా పని ఉండదు. అయితే…ఉన్నతాధికారులు ఆమె పనితీరును గుర్తించి….తిరుపతి ఆర్‌జెసిగా నియమించారు. భ్రమరాంబ ఉన్నతాధికారుల నమ్మకాని వమ్ము చేయబోరని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*