ఇరిగేషన్ మంత్రి గారు… చిత్తూరు జిల్లా అవసరాలూ చూడండి సార్..!

  • ఎంఎల్ఏలూ స్పందించండి

ఎట్టకేలకు ఈ 10వ తేదీ సోమశిల నుండి కండలేరుకు కృష్ణ జలాలు వదలిపెట్టారు. ఇది చిత్తూరు జిల్లా రైతులకు ప్రధానం. తాగునీటికి అంగలార్చే తిరుపతి వాసులకు శుభవార్త. అయినా లోతుపాతులకు వెళ్లి పరిశీలిస్తే మనకు సరైన న్యాయం జరగ లేదు.

12వ తేదీ గణాంకాల ప్రకారం సోమశిలకు 19 వేల క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుంటే కండలేరుకు కేవలం 3,914 క్యూసెక్కులు నీరు మాత్రమే విడుదల చేశారు. ఈపాటికే సోమశిలలో 12వ తేదీ లెక్కల ప్రకారం 33.23 టియంసిల నీరు వుంది. కండలేరుకు వదిలే నీటిలో చెన్నయ్ కి తాగునీరు సరఫరా చేయ వలసి వుంది. తిరుపతి తాగునీటి అవసరాలే కాకుండా నెల్లూరు జిల్లా రాపూరు, వెంకటగిరి, చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంత రైతుల అవసరాలు తీర్చ వలసివుంది. రెండేళ్లుగా పొలాలు బీళ్లు పెట్టుకొని వేయి కళ్లతో సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది అయినా అనవసరమైన మేరకు నీళ్లు ఇవ్వకుండా కేవలం 3,914 క్యూసెక్కులే కండలేరుకు వదలడం న్యాయమా? ఇంత తక్కువ మోతాదులో వరద రోజుల్లోనే నీరు వస్తే మున్ముందు పరిస్థితి మరీ అధ్వానంగా వుంటుందేమో.

ఈ జలాశయం కింద నెల్లూరు చిత్తూరు జిల్లాలో అధికారయుతంగా మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది.
తుదకు నెల్లూరు జిల్లా అవసరాలు తీరిన తర్వాతనే చిత్తూరు జిల్లాకు కృష్ణ జలాలు వస్తాయి. ఒక వేపు 19 వేల క్యూసెక్కులు సోమశిలకు వస్తుంటే కండలేరుకు అంత తక్కువ వదిలితే కండలేరుకు కనీస నీటి మట్టానికి (ప్రస్తుతం 5.08 టియంసిల నీరు వుంది) నీరు చేరాలంటే పది నుండి పదిహేను రోజుల పడుతుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు ఎప్పుడు నీళ్లు వస్తాయి? గమనార్హమైన అంశం ఏమంటే సోమశిల నుండి 7,713 క్యూసెక్కులు వదులు తుంటే కండలేరుకు 3,914 క్యూసెక్కులు చేరుతున్నాయి. మిగిలిన 3,799 క్యూసెక్కులు ఆయకట్టుకు విడుదల చేస్తున్నట్లు వుంది. సోమశిల ఆయకట్టుకు విడుదల చేసే స్థాయిలో కూడా కండలేరుకు విడుదల కావడంలేదు.

ఈ పరిస్థితుల్లో చిత్తూరు జిల్లా శాసనసభ్యుల స్పందన ఏలా వుంటుందో చూడాలి. గత ఏడాది అయితే ఇంత కన్నా అన్యాయం జరిగింది. సోమశిలకు 50 టియంసిల నీరు చేరినా అటు చెన్నయ్ కి గానీ చిత్తూరు జిల్లా రైతులకు గానీ నీళ్లు వదలలేదు. తుదకు చిత్తూరు జిల్లా రైతులు రోడెక్కిన తర్వాత పెట్టిన పంటలు సగం ఎండి పోయిన తర్వాత కొద్ది పాటి నీరు వదలి నారు.

గత సంవత్సరం అనుభవం కళ్ల ముందు వుంది కాబట్టి ఈ ఏడు ఈ ప్రాంతం శాసనసభ్యులు జాగ్రత్త పడి వరద రోజుల్లోనే సాధ్యమైనంత ఎక్కువ నీరు కండలేరుకు చేరునట్లు చూడాలి. అంతేకాదు…ఈ ఏడు కనీసం నాలుగైదు టియంసిలు విధిగా చెన్నయ్ ఇవ్వవలసి వుంది. ముఖ్యమంత్రి ఈ పాటికే ఆదేశాలు జారీచేశారు. పైగా చెన్నయ్ ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు.

ఈ పూర్వరంగంలో కండలేరులో అరకొర నీరు వుండి స్థానికంగా రైతులకు ఇవ్వ కుండా చెన్నయ్ కి తరలించితే చిత్తూరు జిల్లా రైతుల నుండి శాసనసభ్యులు వత్తిడి ఎదుర్కోవాల్సి వుంటుంది. ఈ పరిస్థితి దృష్టిలో పెట్టుకుని చిత్తూరు జిల్లా శాసనసభ్యులు ముందుగా జాగ్రత్తపడి సోమశిల నుండి ఎక్కువ నీరు విడుదల చేయించు కోవలసి వుంది.

రామేశ్వరం పోయినా శనేశ్వరం వదల లేదన్నట్లు కృష్ణకు భారీ వరద వచ్చినా రాయలసీమ వాసులకు నిరాశ మిగిలింది.
ఈ ఏడాది మన రాష్ట్రంలో వర్షపాతం తక్కువైనా ఎగువ రాష్ట్రాల్లో పడుతున్న అధిక వర్షాలకు గత పది ఏళ్లలో లేని విధంగా కృష్ణ నదికి వరద రోజులు ఎక్కువగా వున్నాయి. రెండవ దఫా శ్రీశైలంకు వరద వచ్చింది. కాని ఆచరణలో గొంతెండిపోతున్న రాయలసీమకు ఒరిగిందేమీ లేదు. సెప్టెంబర్ 12 వతేదీకి కూడా శ్రీ శైలం జలాశయం నుండి 3, 05, 625 క్యూసెక్కులు నీరు కిందకు వదలి పడుతుంటే రాయలసీమకు కేవలం 30, 526 క్యూసెక్కులు అంటే మూడు టిఎంసిల నీరు కూడా తరలించడం లేదు.

పోతురెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి 28,500 క్యూసెక్కులు తరలించుతుంటే సోమశిల ప్రాజెక్టుకు 19,000 క్యూసెక్కులు గండికోటకు 10 వేల క్యూసెక్కులు పంపుతున్నారు. మల్యాల నుండి హంద్రీనీవాకు చచ్చీచెడి కేవలం 2,026 క్యూసెక్కులు మాత్రమే ఎత్తిపోతలు సాగిస్తున్నారు. ముచ్చుమర్రీ నుండి ఇప్పటి వరకు చుక్కనీరు పంపలేదు. ఒక విధంగా అధికారులకు కూడా వెసులు బాటు లభించింది. రాయలసీమకు 400 టియంసిల నికర జలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండిన యువత సీమ పరిరక్షణ ఉద్యమకారులు ప్రస్తుతం రాజధాని గొడవలోపడ్డారు.అటు మంత్రులకు ఇటు అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

వి.శంకరయ్య, విశ్రాంత పాత్రికేయులు,
9866806274

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*