ఇస్రో ప్రగతిని అడ్డుకోడానికి అమెరికా కుట్ర చేసిందా?

ఈరోజు (17.09.2018) పత్రికల్లో వచ్చిన రెండు వార్తల గురించి కచ్చితంగా చర్చించాల్సిన అవసరం కనిపిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి పిఎస్‌ఎల్‌వి-సి42ను విజయవంతంగా రోదసిలోకి పంపింది. బ్రిటన్‌కు చెందిన ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది వాణిజ్యపరమైన ప్రయోగం. అంటే కొంత రుసుము వసూలు చేసి విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపడమన్నమాట. మన దేశ అవసరాలు తీర్చడంతో పాటు ఆదాయ సముపార్జునలో భాగంగా వాణిజ్య ప్రాతిపదికన విదేశీ ఉపగ్రహాలనూ అంతరిక్షంలోకి పంపుతోంది ఇస్రో. మన అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆ స్థాయికి ఎదిగినందుకు భారతీయులంతా గర్వించాలి. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించాలి.

మరోవార్త ఏమంటే…నంబి నారాయణన్‌ అనే ఇస్రో శాస్త్రవేత్తకు సంబంధించినది. విదేశాలతో కలిసి కుట్రలు చేస్తున్నారంటూ ఆయనపై 1994లో కేసు పెట్టారు. ఈ కేసును రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆయనపై తప్పుడు కేసు పెట్టి వేధించినందుకు రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు నేపథ్యంలో తీవ్ర మానసిక వేదనతో ఆయన ‘రెడీ టు ఫైర్‌ : హౌ ఇండియా అండ్‌ ఐ సర్వయివ్‌ ద ఇస్రో స్పై కేస్‌’ అనే పుస్తకం రాశారు. ఇందులో ఆయన వ్యక్తపరిచిన అంశాలు ఆందోళనకలిగించేలా ఉన్నాయి.

ఇస్రో గూఢచర్యం కేసు ఓ కుట్రగా ఆయన పేర్కొన్నారు. భారత దేశానికి క్రయోజనిక్‌ ఇంజిన్‌ పరిజ్ఞానం అందకుండా చేయడానికి విదేశాలు చేసిన కుట్రగా అభివర్ణించారు. రోదశి ప్రయోగాల్లో క్రయోజనిక్‌ ఇంజిన్‌ పరిజ్ఞానం చాలా కీలకమైనది. జిఎస్‌ఎల్‌వి రాకెట్లలో ఉపయోగించే ఈ పరిజ్ఞానం భారత్‌ వద్ద లేదు. ఇటీవల దాకా రష్యా నుంచి క్రయోజనిక్‌ ఇంజిన్లు దిగుమతి చేసుకునేవారు. రెండేళ్ల క్రితమే ఈ పరిజ్ఞానాన్ని భారత్‌ సొంతం చేసుకుంది. వాస్తవంగా 1992లోనే క్రయోజనిక్‌ ఇంజిన్‌ పరిజ్ఞాన బదిలీకి సంబంధించి రష్యా-భారత్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ పరిజ్ఞానాన్ని భారత్‌కు ఇవ్వడం ఇష్టంలేని అమెరికా అప్పట్లోనే….ఆంక్షలు విధించింది. అయినా ఇస్రో శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలు శ్రమించి క్రయో ఇంజిన్‌ తయారు చేయగలిగారు.

Nambi_Narayanan

క్రయోజినిక్‌ ఇంజిన్‌ పరిజ్ఞానాన్ని భారత్‌కు అందకుండా అడ్డుకోవడంలో భాగంగానే ఇస్రో గూఢచర్య కేసు వచ్చిందని నారాయణన్‌ చెబుతున్నారు. ఈ కేసు వల్ల భారత్‌ క్రయో ఇంజిన్‌ తయారు చేయడంలో 15 ఏళ్ల జాప్యం జరిగిందన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఆమెరికా పన్నిన కుట్రలో చిక్కుకున్న మన పోలీసులు…ఇస్రో శాస్త్రవేత్తలపైనే కుట్ర కేసులు బనాయించారు. ఇది కచ్చితంగా శాస్త్రవేత్తల మనోధైర్యాన్ని దెబ్బతీసింది. ఈ కేసు కుట్ర అని తేలడానికి దాదాపు 25 ఏళ్లు పట్టింది. ఈ కుట్ర వెనుక అమెరికా ఉందనే విషయాన్ని నర్మగర్భంగా వెల్లడించారు నారాయణన్‌. ఇస్రో కుట్ర కేసు వల్ల శాస్త్రవేత్తగా నారాయణన్‌ మాత్రమే కాదు…భారత జాతి మొత్తం నష్టపోయింది.

ఇస్రో శాస్త్రవేత్తపై తప్పుడు కేసు బనాయించానికి కారకులెవరనేదానిపై ఇప్పుడు విచారణ జరగనుంది. అప్పట్లోనే అమెరికా నిఘా సంస్థతో అంటగాకారనే అనుమానాలతో భారత ఇంటలిజెన్స్‌ బ్యూరో అధికారి ఒకరికి ఉద్వాసన పలికారు. ఈ కేసును చూస్తే…మనవాళ్ల చేతితోనే మన వాళ్ల కళ్లు పొడిచి, అంధకారంలోకి నెట్టగల కుట్రలను అమెరికా నిఘా సంస్థలు చేయగలవని అర్థమవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*