ఈడీకీ రాజకీయ రంగు : సుజనా సుఖీభవం

తెలుగుదేశం పార్టీ ఎంపి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు అయిన సుజనా చౌదరికి చెందిన వ్యాపార సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) దాడులు చేయడం, కేసులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 126 డొల్ల కంపెనీలు సృష్టించి, బ్యాంకుల నుంచి రూ.5,700 కోట్లు అప్పులు తీసుకుని, ఎగ్గొట్టారన్నది సుజనా చౌదరిపై ఈడి చేస్తున్న అభియోగం.

దీనిపై తెలుగుదేశం నేతల స్పందన అందరూ ఊహించినట్లే ఉంది. రాజకీయ రంగు పులిమి, ఈ అంశాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. రాజకీయ కక్షతో కేంద్రం దాడులకు పూనుకుందని టిడిపి నేతలు ఆరోపించారు. అప్పులు ఇచ్చేందుకే కదా బ్యాంకులు ఉండేది అని ఒకాయన అంటే…బ్యాంకుల్లో అప్పులు తీసుకోవడం నేరమా అని ఇంకో ఆయన అతి తెలివిగా ప్రశ్నిస్తున్నారు. సుజనా చౌదరి కూడా ఇదే మాటలు అంటున్నారు. తనకు ఏ కంపెనీతోనూ సంబంధాలు లేవని చెబుతున్నారు. కొన్ని కంపెనీల పేర్లు చెప్పి…వాటి పేర్లే ఎన్నడూ వినలేదన్నట్లు మాట్లాడుతున్నారు. సుజనా సంస్థలపై దాడులకు సంబంధించి ప్రెస్‌నోట్‌ విడుదల చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.

తెలుగుదేశం నాయకులు చెప్పినట్లు….బ్యాంకులు ఉన్నది అప్పులు ఇవ్వడానికే. వ్యాపార అభివృద్ధి కోసం బ్యాంకుల్లో రుణం తీసుకోవడం తప్పుకాదు. అయితే…తీసుకున్న అప్పులు ఎగ్గొట్టడం తప్పు. ఎగ్గొట్టే దురాలోచనతో రుణాలు తీసుకోవడం తప్పు. సుజనాపై ఈడి చేస్తున్న అభియోగాలు ఇవే. ఆయన 126 డొల్ల కంపెనీలు సృష్టించి, అందులో వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు రికార్డులు సృష్టించి, వాటిని ఆధారంగా బ్యాంకుల నుంచి రూ.5700 కోట్లు రుణంగా తీసుకున్నారని ఈడి చెబుతోంది. తనకు ఏ కంపెనీతోనూ సంబంధం లేదని సుజనా చెప్పుకోవచ్చు. తన పేరు లేకుండా…ఉద్యోగుల పేర్లు, ఇంట్లో పనిచేసేవాళ్ల పేర్లు డైరెక్టర్లుగా చూపించి, కంపెనీలు సృష్టించి, డబ్బులు నొక్కేయడమే ఈ డొల్ల కంపెనీల ద్వారా చేసే మోసం. డొల్ల కంపెనీల్లో తన పేరు లేదుకాబట్టి…తనకు సంబంధం లేదని సుజనా చెబితే…చెల్లుతుందా? ఈ కంపెనీలతో సుజనాకు ఎలా సంబంధం ఉందో నిరూపించడమే ఈడి చేసే పని.

రాజకీయ కక్ష సాధింపుతో ఈడి దాడులు చేస్తోందని తెలుగుదేశం నాయకులు చెబుతున్నారుగానీ…కొన్నేళ్ల క్రితమే సుజనా వ్యవహారాలపై ఆంధ్రజ్యోతి పత్రికలు బ్యానర్‌ కథనాలు వచ్చాయి. దీనిపైన మాత్రం టిడిపి నాయకులు ఎవరూ మాట్లాడరు!

ఇక ఈడి తమ దాడులకు సంబంధించి ప్రెస్‌నోట్‌ విడుదల చేయడాన్ని కూడా సుజనా చౌదరి తప్పుబట్టారు. ఒక ప్రజాప్రతినిధికి చెందిన కంపెనీలపైన దాడులు చేసినపుడు…దాన్ని రహస్యంగా ఉంచడం సరైనది అవుతుందా? ఒకవేళ రహస్యంగా ఉంచితే….దాడుల వివరాలు మీడియాకు ఎందుకు చెప్పలేదని ఇదే నాయకులు ప్రశ్నిస్తారు. ఆ మాటకొస్తే…రాష్ట్రంలోని ఏసిబి చాలామందిపై దాడులు చేస్తోంది. చివర్లో ఏయే పత్రాలు స్వాధీనం చేసుకున్నారో మీడియాను పిలిచి వివరిస్తారు. ఇదంతా రొటీన్‌గా జరిగిపోయేవి. సిబిఐ అధికారుల మధ్య తలెత్తిన గొడవలను ఆధారంగా చేసుకుని…అది కుళ్లిపోయిందని, అందుకే దాన్ని రాష్ట్రంలోకి రానివ్వబోమని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఈడిపైనా అలాంటి ముద్రే వేస్తారా?

ఇక ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి వ్యవహార తీరుపైన విమర్శలొస్తున్నాయి. సొంతపార్టీ వాళ్లయినా….తమకు సన్నిహితంగాఉండేవారి పట్ల ఒక రకంగా, మరొకరైతే ఇంకో రకంగా వ్యవహరిస్తారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే రకమైన ఆరోపణలు ఎదుర్కొన్న వాకాటి నారాయణరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే సుజనా చౌదరిపైన మాత్రం చర్య తీసుకోడానికి బదులు…ఆయన్ను వెనకేసుకొచ్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రశ్న వస్తోంది. దీనికి సమాధానం చెప్పేవారు లేరు.

అన్నింటికీ మించి…ఈ వ్యవహారంలో తెలుగు మీడియా వ్యవహరిస్తున్న తీరు అశ్చర్యం కలిగిస్తోంది. ఇది ఒక వార్తే కాదన్నట్లు టివి ఛానళ్లు, పత్రికలు ప్రవర్తిన్నాయి. ఒక పత్రిక విధిలేక మొదటి రోజు బ్యానర్‌ వార్త వేసినా…రెండో రోజూ ఖండిస్తూ అంతే వార్తను…అదే మొదటి పేజీలో వేసింది. ఈడి అధికారులు చెప్పిన విషయాలు మినహా పత్రిక పరిశోధించిన అంశాలు ఏవీ లేవు. అసలు సుజనా డొల్ల కంపెనీల వ్యవహారం గురించి ఒక్క మాటైనా లేదు. ప్రతి చిన్న అంశానికీ గంటల తరబడి చర్చ నిర్వహించే టివి ఛానళ్లు…ఈ అంశం జోలికి మాత్రం పోలేదు. అసలు వార్తకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాయోగానీ…సుజనా ఇచ్చిన వివరణను, టిడిపి నేతల ఖండనలను మాత్రం బాగానే ప్రసారం చేశాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*