ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ… జగన్ ప్రభుత్వానికి క్షమాపణ చెబుతారా..!

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గంటలు గంటలు మాట్లాడడం, వాటిని పత్రికల్లో పేజీలకు పేజీలు ప్రచురించడం, గత కొన్ని నెలలుగా ఆనవాయితీగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేసినా దాన్ని మొదటి పేజీలో ప్రచురిస్తున్నారు. చంద్రబాబునాయుడు చేస్తున్న ఆరోపణలు మొదటి పేజీలో ప్రచురించే పత్రికలు… ప్రభుత్వం ఇచ్చే వివరాలు మాత్రం పట్టించుకోవడం లేదు. పట్టించుకున్నా… కనిపించకుండా ఎక్కడో లోపల పేజీల్లో ఒక మూలన పడేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మీడియా పైనా కొరడా ఝుళిపిస్తోంది. చంద్రబాబు నాయుడు చెప్పే అసత్యాలన్నీ ప్రచారం చేస్తే చర్యలు తప్పవు అని హెచ్చరిస్తున్నట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు లీగల్ నోటీసులు జారీ చేసింది.

సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ సంస్థకు మంజూరు చేసిన మైనింగ్ లీజ్ లో అవకతవకలు జరిగాయని చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. ఈ వార్తలను ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించాయి. ఈ అంశంపైనే ప్రభుత్వం‌ ఆ పత్రికలకు నోటీసులు ఇచ్చింది. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ మైనింగ్ లీజులో ఎలాంటి‌‌ అక్రమాలూ జరగలేదని, ఆ విషయాన్ని తెలియజేసినా ఆ పత్రికలు సరిగా ప్రచురించలేదని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆమోద పబ్లికేషన్స్ ఆంద్రజ్యోతి, ఉషోదయ పబ్లికేషన్స్ ఈనాడు పత్రికలు దీనిపై ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేశాయని ఆయన అన్నారు. ఈ తప్పుడు కథనాలపై తాము చర్య తీసుకుంటున్నట్లు చెప్పారు. చంద్రబాబుకు, ఈనాడు, ఆంద్రజ్యోతి పత్రికలకు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరినట్లు ఆయన తెలిపారు. తాము పంపిన లీగల్ నోటీసులకు సరైన సమాధానం రాకుంటే… తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుం టామని ద్వివేది స్పష్టం చేశారు.

వాస్తవంగా పత్రికలు సొంతంగా కథనాలు రాసినపుడే ఇటువంటి నోటీసులు ఇచ్చేవారు. కానీ రాష్ట్రంలో పత్రికలకు, రాజకీయ పార్టీలకు తేడా లేకుండా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమూ ఒకింత అసహజ నిర్ణయం తీసుకుంటోంది. అసత్య కథనాలు రాస్తే చట్డపరమైన చర్యలు తీసుకోవాడని వీలుగా ఒక జీఓనూ ప్రభుత్వం తెచ్చింది. దాన్ని హైకోర్టు కూడా సమర్ధించింది. ఈ నేపథ్యంలోనే సరస్వతి ఇండస్ట్రీస్ అంశంపై నోటీసులు ఇచ్చింది. రాజకీయ పార్టీల నేతలు ఇచ్చే ప్రకటనలైనా…ప్రజా ప్రయోజనాలు ఉంటే ప్రచురించవచ్చు. అంతేగానీ ఒకర్ని అప్రతిష్టపాలు చేయాలన్న దురుద్దేశంతో‌ ఆరోపణలు చేస్తే…ఆ ఆరోపణ చేసిన వారికి‌ ఎంత బాధ్యత ఉంటుందో ప్రచురించిన వారికీ అంతే బాధ్యత ఉంటుందని జర్నలిస్టు ప్రాథమిక పాఠాల్లోనే చెబుతారు. అయితే…రాజకీయ ఊబిలో చిక్కుకున్న మీడియా ఆ పాత్రికేయ పాఠాలను, విలువలను ఎప్పుడో వదిలేసింది. దీంతో ప్రభుత్వం చేసింది తప్పని ప్రజాస్వామ్యవాదులుఇ చెప్పలేని పరిస్థితి దాపురించింది.

మళ్లీ ఇప్పుడు అసలు విషయానికొస్తే… ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల సంపాదకులకే కాదు…పత్రికల యజమానులుగా ఉన్న రాధాకృష్ణకు, రామోజీరావుకూ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక‌ వార్త విషయంలో ఇప్పటికీ టివి 5 యాంకర్ మూర్తిపైన, ఆ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడుపైన కేసులు నమోదు చేశారు. వారిని విచారిస్తున్నారు కూడా. ఈ పరిస్థితుల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి క్షమాపణలు చెబుతాయా…లేక విచారణ ఎదుర్కొంటాయా అనేది చర్చనీయాంశంగా మారింది. రెండో దానికి‌ సిద్ధపడితే రామోజీరావు కూడా పోలీసుల ముందుకు రావాల్సివుంటుంది.

1 Comment

  1. గట్టి చర్యలు చేపట్టాలి

Leave a Reply

Your email address will not be published.


*