ఈనాడూ, ఎవరిది ఎక్కువ కులం…ఎవరిది తక్కువ కులం?!

మిర్యాలగూడలో జరిగిన కులదురహంకార హత్య వార్తను ప్రముఖ దినపత్రిక ఈనాడు ప్రచురించిన తీరులో అభ్యంతరాలు కనిపిస్తున్నాయి. ఆ వార్త రాసిన విలేకరికి, ప్రచురించిన సబ్‌ ఎడిటర్‌కు కుల పట్టింపులు ఉన్నాయేమో అని అనుమానించాల్సి వస్తోంది. హత్యకు గురయింది ఒక దళితుడనే విషయాన్ని కూడా ఆ వార్తలు రాయలేదు. పైగా మొదటి వాక్యంలోనే తక్కువ కులం – ఎక్కువ కులం అనే పదాలు వినియోగించారు. దీన్ని చదివితే ఈనాడుకేె ఎక్కువ తక్కువ కులాల భావన ఉందేమో అనే అభిప్రాయం కలుగుతుంది.

కుమార్తె తక్కువ కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని పగబట్టిన తండ్రి…అల్లుడిని అతి క్రూరంగా అంతమొందించారు….ఇదీ ఆ వార్తలోని మొదటి వాక్యం. ఆ వ్యక్తి తక్కువ కులంవాడని ఈనాడు కూడా భావిస్తోందా….లేక ఆ తండ్రి ఆ విధంగా భావించాడా? ఈనాడుకు కుల పట్టింపులు లేకుంటే….అది పూర్తిగా ఆ తండ్రి అభిప్రాయమైతే…ఈ వాక్యాన్ని ఇలా రాయడం తప్పు అవుతుంది. వృత్తి నైపుణ్యత రీత్యా ఇది ఘోర తప్పిదం అవుతుంది. ఈనాడు వంటి దినపత్రికు ఈ వాక్యంలోని అర్థం తెలియదా? ఏమో ఈనాడు సంపాదకవర్గమే సమాధానం చెప్పాలి.

ఇక ఆర్యవైశ్య కులానికి చెందిన అమృత దళితుడైన ప్రవీణ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీన్ని కుల దురహంకారి అయిన అమృత తండ్రి మారుతీరావు సహించలేకపోయాడు. అల్లుడిని కిరాయి రౌడీలతో అంతం చేశాడు. ఈనాడు పత్రికకు ఈ కులాల గురించి రాయడానికి ఎందుకో మనసు రాలేదు. దళితుల పట్ల అగ్రకుల దురహంకారులు ఇప్పటికీ ఎంతటి చిన్నచూపు చూస్తున్నారో చెప్పడానికి ఈ ఘటనకంటే మరో ఉదంతం అవసరం లేదు. ఇటువంటి వార్తలో బాధితుడి కులం గురించి రాయడానికి ఈనాడుకు ఏ ప్రమాణాలు అడ్డొచ్చాయో తెలియదు. ఇది ఏ పాత్రికేయ నిబద్ధతో ఈనాడు సంపాదకీయం పరిశీలించుకోవాలి.

అసలు ఇటువంటి వార్తలకు పత్రికలు పెడుతున్న శీర్షికలపైనే అభ్యంతరాలున్నాయి. ఇటువంటి ఉదంతాలకు ‘పరువు హత్య’ అని శీర్షిక పెడుతున్నారు. దళితులు అగ్రకులాల వారిని పెళ్లి చేసుకుంటే….పరువుకు భంగం కలిగినట్లు భావించాలా? ఇటువంటి భావనను మీడియా సమర్థిస్తున్నదా? ఇవి కుల దురహంకార హత్యలు తప్ప….పరువు హత్యలు కాదు. కులానికి పరువు ఏమిటి? అలాగైతే అన్ని కులాలకూ పరువు ఉంటుంది. అందుకే ఇటువంటి వార్తలకు కొన్ని వామపక్ష పత్రికలు ‘కుల దురహంకార హత్యలు’ అని పేరు పెట్టాయి. మిగిలిన పత్రికలు, మీడియా కూడా ఇదే పదజాలాన్ని వాడటం సమంజసంగా ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*