ఈవార్త చూశాక…జర్నలిజం పాఠాలే మార్చాలేమో..!

ఈనాడు దినపత్రికకు సొంతంగా జర్నలిజం పాఠశాల ఉంది. ఎంతోమంది జర్నలిస్టులు అందులోనే తర్ఫాదయ్యారు. ఈనాడు జర్నలిజం స్కూల్‌కు చాలా ప్రతిష్టవుంది. అయితే…ప్రస్తుతం ఈనాడు పత్రికలో వస్తున్న వార్తా కథనాలను గమనిస్తే…జర్నలిజం స్కూల్‌లో చెప్పిన పాఠాలు తప్పేమో అనిపిస్తుంది. ఆ పాఠాలను మార్చాలనిపిస్తోంది. వార్తల్లో అతిశయోక్తులకు తావుండకూడదు. పాఠకులను తప్పుదారి పట్టించేలా కథనాలు ఉండకూడదు. ఇవి ఈనాడు జర్నలిజం స్కూల్‌లో మాత్రమే కాదు…ఏ పాత్రికేయ పాఠశాలలోనైనా చెప్పే ప్రాథమిక అంశాలు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్‌ పర్యటనకు సంబంధించిన వార్త ఈనాడు మొదటి పేజీలో ప్రచురించారు. ప్రాధాన్యత రీత్యా ఆ వార్తకు మొదటి పేజీలో స్థానం కల్పించడంలో తప్పలేదు. అయితే…వార్తకు పెట్టిన శీర్షికే అతిశయోక్తిగా ఉంది. అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటూ పలువురు పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలతో ముఖ్యమంత్రి సింగపూర్‌లో చర్చించారు. కొందరు చూస్తామన్నారు… కొందరు పెట్టుబడులు పెడతామన్నారు. సాధారణంగా ఇలాంటి సమావేశాలు గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా విశాఖలో పెట్టుబడుదాల సదస్సు కూడా నిర్వహించారు. హామీలైతే వేల కోట్లకు వస్తున్నాయి. అయితే…ఎన్ని ఆచరణలోకి వచ్చాయనేదే విజయానికి గీటురాయి. ఇప్పుడు సింగపూర్‌లో సిఎంతో మాట్లాడిన వాళ్లు ఎవరు పెట్టుబడులు పెడతారో, ఎవరు పెట్టరో చెప్పలేం. ఇలాంటి అంశానికి ‘రాజధాని రాజసం’ అంటూ పెద్ద శీర్షిక పెట్టి వార్తను ఇచ్చారు. ముఖ్యమంత్రి అక్కడ ఏమి మాట్లాడారో అదే అంశాన్ని శీర్షికగా ఇచ్చివుండొచ్చు. లేదా ఆ సమావేశం సారాంశాన్ని ఇచ్చివుండొచ్చు. అక్కడ జరిగిన సమావేశంతో రాజధానికి అద్భుతం జరిగిపోయిందనేందగా రాశారు.

రాజధాని విషయంలో మొదటి నుంచి పత్రికలు అతిశయోక్తులు ప్రచారం చేస్తున్నాయి. అక్కడేదో అద్భుతాలు జరిగిపోతున్నట్లు కథనాలు ఇస్తున్నాయి. ఆకృతులుంటారు, అద్భుత నగరాలంటారు, వాణిజ్య సముదాయాలంటారు, వినోద కేంద్రాలంటారు…ఏవేవో అంటున్నారు. ఆఖరికి నాలుగు భవనాలు తప్ప అక్కడ ఏమీ లేవనే సంగతి నేరుగా రాజధానిని చూసిన వారికి తెలిసిపోతుంది. ఇప్పటికైనా రాజధాని గురించి వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీడియాపై ఉంది. వృత్తి నైపుణ్యతలో ఆ పత్రికతో సాటి ఎవరూ లేరని జనం నమ్మతున్న పత్రికగా ఈనాడు మరింత బాధ్యతాయుతంగా, పాత్రికేయ విలువలతో కూడిన కథనాలు ఇవ్వాలి. అప్పుడే ఆ పత్రిక అన్నివర్గాల ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలుగుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*