ఈవోగారూ ఇదేమి ధర్మం…! కాంట్రాక్టు కార్మికులకు ఆకలి ఉండదా…!!

ధర్మచక్రం ప్రతినిధి, తిరుపతి

కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటున్న శ్రీనివాసుడు కొలువైన తిరుమల కొండపైన ఏ ఒక్కరూ ఆకలితో పస్తులు ఉండకూడదన్న మహత్తర లక్ష్యంతో టిటిడి అన్న వితరణ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. నిత్యంలో వేలాది మందికి అన్నప్రసాదాలు అందిస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమానికి దాతలు కూడా విరివిగా విరాళాలు అందిస్తున్నారు.

ఎంతో శ్రద్ధతో భక్తుల ఆకలి తీర్చుతున్న టిటిడి….తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల, కార్మికుల ఆకలిని మాత్రం పట్టించుకోవడం లేదు. తిరుమలలోని ఎంప్లాయిస్‌ క్యాంటీన్‌లోకి కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను అనుమతించడం లేదు. దీంతో ఆ కార్మికులు పస్తులు ఉంటున్నారు.

టిటిడిలో 15 వేల మందికిపైగా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో తిరుమలలో నిత్యం నాలుగైదు వేల మంది పని చేస్తుంటారు. తిరుమలలో ఉద్యోగుల కోసం క్యాంటీన్‌ ఉంది. అయితే…ఇందులోకి రెగ్యులర్‌ ఉద్యోగులను తప్ప అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులను అనుమతించడం లేదు.

ఇదేమిటని అడిగితే….భక్తుల అన్నప్రసాద కేంద్రానికి వెళ్లి భోజనం చేయాలని చెబుతున్నారు. అన్నప్రసాద కేంద్రంలో కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్లు ఏమీ లేవు. భక్తులతో కలిసే వెళ్లాలి. దీనికి ఎక్కువ సమయం పడుతుంది. అన్నప్రసాద కేంద్రానికి వెళితే…సకాంలో విధులకు హాజరుకాలేరు. అందుకే కార్మికులు ఇంటి నుంచి క్యారీ తెచ్చుకుంటున్నారు. లేదంటే డబ్బులిచ్చి హోటళ్లలో తింటున్నారు. డబ్బుల్లేకుంటే పస్తువుంటున్నారు.

సాధారణంగా ప్రైవేట్‌ ఫ్యాక్టరీల్లోనూ వంద మంది కార్మికులు పని చేస్తుంటే అందరికీ క్యాంటీన్‌ సదుపాయం కల్పిస్తారు. సబ్సిడీపై ఆహారం అందజేస్తారు. ఆ లెక్కన టిటిడిలో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులకూ ప్రత్యేకంగా క్యాంటీన్‌ ఏర్పాటు చేయాల్సిన చట్టబద్ధమైన బాధ్యత కూడా టిటిడిపైన ఉంది. అయితే…రెగ్యులర్‌ ఉద్యోగులే ఉద్యోగులకన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు.

టిటిడి ధార్మిక సంస్థ. ఇతర ఏ సంస్థల కన్నా మరింత ధర్మంగా, మానవత్వంతో వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుంది. అయితే…కార్మికులకు భోజనం పెట్టే విషయంలో అధర్మంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నూతన ఈవో జవహర్‌ రెడ్డి…ఈ సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరుతున్నారు. ఎంప్లాయిస్‌ క్యాంటీన్‌కి అనుమతించడంగానీ, ప్రత్యేక క్యాంటీన్‌ ఏర్పాటు చేయడంగానీ, అన్నప్రసాద కేంద్రంలోనే ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడంగానీ….ఏదో ఒకటి చేయాలని అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*