ఈ తరానికి తెలియని కారంచేడు మారణహోమం..! ఒళ్లు గగుర్పొడిచే దారుణం.. !!

నేటికి 35 సంవత్సరాల క్రితం….
1985, జూలై, కారంచేడు… ప్రకాశం జిల్లా.
ఒక రకంగా చూస్తే మన దళితులు అదృష్టవంతులేమో అనిపిస్తోంది నాకు. దళితులు ఎవర్ని అయితే దూషించారో, శత్రువులని ద్వేషించారో వాళ్లే దళిత ఉద్యమానికి పునాది రాళ్లు వేయడం! Is it irony? A Paradox? Or poetic justice?

కమ్మ దురహంకారం కన్నీటి కారంచేడుని ఆవిష్కరిస్తే, మేమేమన్నా తక్కువ తిన్నామా అన్నట్టు నెత్తురోడుతున్న చుండూరుని రెడ్లు తమ వంతు బహుమానంగా యిచ్చారు. ఇంటిపేరులోనే తప్ప చేతుల్లో ఏమీ లేని మాల పద్మారావుకి కత్తినీ, డాలునీ వాళ్లే సమకూర్చారు. పంటలతో, పారే కాల్వలతో అపార ధనరాశులతో తులతూగే కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఇపుడు ఏ రాజకీయ పార్టీ కూడా దళితుల్ని విస్మరించి బతికి బట్టకట్టలేదు.

అగ్రకుల అహంకారం అణగారిన వాళ్లకి అమృతంగా మారిన చారిత్రక సన్నివేశాన్ని నేను కళ్లారా చూశాను.

అక్టోబరు 6న విజయవాడ నడిబొడ్డున లక్ష మందికి పైగా హాజరైన సభలో దళిత మహాసభ కన్వీనర్ కత్తిపద్మారావు తుఫాన్ లా చెలరేగిపోతూ చేసిన ప్రసంగాన్ని జనం సంభ్రమాశ్చర్యంతో విన్నారు. అప్పటికి బలమైన నిర్మాణం వున్న సి.పి.ఐ, సి.పి.ఎంలు మాత్రమే విజయవాడలో అంత పెద్ద సభ ఆర్గనైజ్ చెయ్యగలవు. ఒక్క పద్మారావు, ఒక్క దళిత మహాసభ ఆ పనిని సులువుగా చేయగలిగాయి. ‘జై భీమ్’ నినాదంతో కమ్యూనిస్టు కోట దద్దరిల్లింది.

కారంచేడులో మాదిగ శక్తి….
ప్రజాయుద్ధానికి శ్రీకాకుళం ఎలాగో, దళిత పోరాటాలకు కారంచేడు అలా… ఒక చారిత్రక గుర్తు.

ప్రకాశం జిల్లాలో చీరాలకు ఏడు కిలోమీటర్ల దూరంలో వుంది కారంచేడు. అది 16 వార్డులున్న పెద్ద పంచాయితీ గ్రామం. అందులో ఎనిమిది వార్డుల్లో కమ్మవారే వున్నారు. మిగిలిన 8 వార్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వాళ్లున్నారు. 16వ వార్డులో అంతా దళితులే. అక్కడ రజకులు, యాదవులు, మంగలివాళ్లూ, ఉప్పర్లు, ముస్లింలు, చుండు నాయకులు. ఎరుకల, యానాదులతోపాటు మాల మాదిగలూ వున్నారు. వేల ఎకరాలు భూస్వాముల చేతుల్లో వున్నాయి. వందల ఎకరాలున్న కమ్మవారే పెత్తందార్లు. దగ్గుబాటి, యార్లగడ్డ, చాగంటి, పేర్ని, పూవాటి, మండా వంటి ఇంటి పేర్లతో వాళ్లదే ఆధిపత్యం!

కమ్మవారి దొడ్లతో జీతానికి చాకిరీ చేసే వాళ్లని హీనంగా చూసేవాళ్లు. పనివాళ్లని కొట్టడం, ఎప్పుడైనా చంపడం కూడా అక్కడ అసహజం కాదు. ఎదురు తిరిగిన ఉప్పర్ల (బీసీలు)ని ఒక సారి కొట్టారు. కూలిరేట్ల కోసం జనాన్ని కూడగడుతున్న చుండు నాయకుల్లో ఒకడైన వెంకటేశ్వర్లుని కొట్టారు. అతను పారిపోయి మాదిగ పల్లెలో దాక్కున్నాడు. ‘మాకు వాణ్ణి అప్పజెప్పాలి’ అన్నారు కమ్మ పెద్దలు. ‘మేం రక్షిస్తాం’ అన్నారు మాదిగలు. మాదిగ పల్లెని ఎదిరించలేక వెనుదిరిగారు. మాలపల్లెపై కమ్మవారు దాడి చేసినప్పుడూ మాదిగలు అండగా నిలిచారు. మాదిగపల్లె మీద కక్ష పెంచుకున్నారు. ఒక్క కుటుంబమే నాలుగు వందల కుటుంబాలుగా విస్తరించిన మాదిగ పల్లె అది. తేళ్ల, దుడ్డు ఇంటి పేర్లు గలవాళ్లే ప్రధానంగా వున్నారు. వ్యవసాయ కూలీకి మాత్రం వాళ్లు కమ్మవారి మీదే ఆధారపడి వున్నారు. పొగాకు, పత్తి వంటి వ్యాపార పంటలూ పండిస్తారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకి వియ్యంకుడు దగ్గుబాటి చెంచురామయ్య, పోలీసు రెవెన్యూ వ్యవస్థలు ఆయన కొమ్ము కాసేవి. కమ్మ కుర్రాళ్లు దళిత స్త్రీలని టీజ్ చేయడం చాలా సాధారణం. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల్లో వున్న భూస్వాములు ఎన్టీఆర్ రాకతో తెలుగుదేశంలో చేరిపోయారు. దళితులు మాత్రం కాంగ్రెస్ తోనే వున్నారు. ఎన్నికల్లో దళితులు కాంగ్రెస్ కి వోట్లు వేస్తుండటంతో కమ్మ వాళ్లు గొడవపడ్డారు. దళితులు ఎదురుతిరిగారు. కర్ర తిప్పడంలో నైపుణ్యం గల కండలు తిరిగిన యోధులు మాదిగలకు వున్నారు. వాళ్లలో మాదిగ పెద్ద యోహోషువా ఒకరు. ఆత్మాభిమానం గల మనిషి. ఎన్నికల గొడవల్లో మాదిగ శక్తికి జడిసి, వెనక్కి తగ్గిన కమ్మవాళ్లు దెబ్బతీయాలన్న కసితో వున్నారు.

1985 జూలై 16న పోతిన శీను, రాయినీడు ప్రసాద్ అనే కమ్మ యువకులు మాదిగవాడలోని మంచినీటి చెరువుకి గేదెలను తోలుకెళ్లారు. వాటికి కుడితి పెట్టి, ఆ కుడితినీళ్లు బక్కెట్లని చెరువులో కడిగారు. అలా చెయ్యకండని చెప్పాడు వికలాంగుడైన దళితుడు కత్తి చంద్రయ్య. అతని మీద కమ్మ యువకులు దాడి చేయబోతుండగా, నీళ్ల కోసం వచ్చిన మున్నంగి సువార్త వాళ్లను అడ్డుకుంది. వాళ్లు చర్నాకోల విసిరారు. ఆమె బిందె అడ్డం పెట్టింది. ఒక మాదిగ ఆడది మన మీద బిందె ఎత్తడమా?
కమ్మ కులాధిపత్యం బీటలు వారినట్టే…
ఎదురుదెబ్బ తియ్యాల్సిందే.

ఆ రాత్రే కారంచేడు కమ్మ పెద్దలు సమావేశం అయ్యారు. ఎలా? ఎప్పుడు? ఏ రకంగా? అనే కీలక అంశాలపై చర్చించారు. దళితులు ఇక ఎప్పటికీ మరిచిపోకుండా చావు దెబ్బతియ్యాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. మారణాయుధాల సేకరణ మొదలైంది. మర్నాడు ఉదయం ఆ గ్రామంలో ఏం జరిగింది?

ఉదయం దినపత్రిక ప్రారంభమై అప్పటికి ఆరు నెలల 15 రోజులు అయింది. బందరు రోడ్డులోని విజయవాడ ఎడిషన్‌లో పనిచేస్తున్నాను. ఎడిటర్‌ ఎ.బి.కె ప్రసాద్‌, మా న్యూస్‌ ఎడిటర్‌ కె.రామచంద్రమూర్తి ఆయన తర్వాత బాధ్యుణ్ణి నేను. అప్పటికే ‘ఉదయం’ మంచిపేరు తెచ్చుకుంది. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకు ఆఫీసుకి వెళ్లేవాణ్ణి. రేపు హైద్రాబాద్‌ నుంచి ఎబికె వస్తున్నారు త్వరగా రండి అని చెప్పారు.

1985 జులై 17…
ఉదయం పదిగంటలకి ముందే ఆఫీసులో వున్నా. ఎబికె వున్నారు. మూర్తి గారి గదిలో ఆయన కుర్చీలో కూర్చుని ఎ.బి.కె రిపోర్టర్లు, మరి కొందర్ని పలకరిస్తున్నారు. వెళ్లి ఎడిటర్‌ని పలకరించి, కొద్దిసేపు మాట్లాడనో లేదో, పక్కనున్న ఫోన్‌ రింగవుతోంది. రిసీవర్ తీసాను. చీరాల నుంచి ఫోన్‌. కారంచేడు దారుణం గురించి చెబుతున్నపుడు రిపోర్టర్‌ గొంతు వణుకుతోంది. మొత్తం సమాచారం, ఫోటోలు పట్టుకుని విజయవాడ రా, ఎప్పటికప్పుడు ప్రతి విషయం తెల్సుకోడానికి యింకో ఇద్దరు కుర్ర రిపోర్టర్లని పిలిపించు..అలాంటి జాగ్రత్తలు చెప్పాను. ఏంటి అంతసేపు మాట్లాడుతున్నావ్‌ ? అన్నారు ఎ.బి.కె. మూర్తిగారు అక్కడే వున్నారు. కారంచేడులో దళితుల్ని ఘోరంగా చంపారు అని చెప్పారు. ఎవరు? అని అడిగారు ఎ.బి.కె. మన కమ్మవారే అని చెప్పా. “వాళ్లే చంపారా, సరే వచ్చిన వార్తలు నాకు పంపు. నువ్వెళ్లి పని చూసుకో. నేను ఎడిటోరియల్‌ రాస్తా ” అన్నారు. ఆయన షార్ప్‌ రియాక్షన్‌ కి ఆశ్చర్యపోయాను. అప్పటికే అయిదేళ్లు ఈనాడులో పని చేసివుండటంవల్ల, అలాంటి వార్తలు ఎలా హాండిల్‌ చేయాలో నాకు బాగా తెలుసు.

యువరక్తం ఉరకలెత్తే జర్నలిస్టుల టీం ఉదయాన్ని అప్పటికే నిలబెట్టింది. ఇప్పటి సాక్షి దినపత్రిక ఎడిటర్‌ వర్ధెల్లి మురళి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్‌, కవి ఖాదర్‌ మెహియిద్దీన్‌, మెరుగుమాల నాంచారయ్య ఏ ఐటం అయినా బాగా రాయగల దిట్టలు. అప్పుడే కెరీర్ మొదలుపెట్టిన చిన్నపాటి సబ్ ఎడిటర్లు వాళ్ళు. మూర్తి గారికి చెప్పి రంగంలోకి దిగాను. మేం బేనర్‌ అనే ప్రధాన వార్త కాకుండా, సంఘటనలో విషాదాన్ని human storyగా రాస్తాము. ఆ వివరాలన్నీ కె.శ్రీనివాస్‌కు యిచ్చాను. విజయవాడ రిపోర్టర్లు కొల్లు అంకబాబు, ఇతరులు పోలీసులు, రాజకీయ నాయకులతో మాట్లాడి సమాచారం యిస్తున్నారు.

కారంచేడులో హత్యాకాండ, అయిదుగురు దళితుల నరికివేత లాంటి హెడ్డింగ్‌తో ప్రధాన వార్త యిచ్చాం. తర్వాత రోజుల్లో మరో ఇద్దరు చీరాల ఆస్పత్రిలో చనిపోయారు. నాటి మానవ విషాదాన్ని కె.శ్రీనివాస్‌ ప్రతిభావంతంగా రాసి, దానికి ” పంట పొలాల్లో పులి చంపిన లేడి నెత్తురు ” అని హెడ్డింగ్‌ పెట్టారు. సాయంత్రానికల్లా ఎ.బి.కె ఎడిటోరియల్‌ కారంచేడు కండకావరం అనే శీర్షికతో సిద్ధం చేశారు. అదే హెడ్డింగ్‌తో వరసగా మూడు రోజులు కారంచేడు మీదే ఆయన సంపాదకీయాలతో దాడి చేశారు.

మర్నాడు ప్రకాశం జిల్లాతో పాటు కోస్తా జిల్లాల్లో ‘ఉదయం’ మర ఫిరంగిలా పేలింది. కమ్మవారే హంతుకులని రాయడానికి చేతులు రాని ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆరో పేజీలోనో ఏడో పేజీలోనో అతి చిన్నవార్త వేసి ‘కారంచేడులో దాడి ‘ అనేదో పిచ్చి హెడ్డింగ్‌ పెట్టి యిచ్చాయి. దాంతో ప్రత్యేకించి ఉదయంలోనే FLASH అయిన వార్త సంచలనంగా మారింది. నాటి నుంచి రెండు నెలలకిపైగా కారంచేడు వార్తలు, ఫోటోలు, కేసు వివరాలు, దళిత నాయకుల ఇంటర్వ్యూలతో ఉదయాన్ని హోరెత్తించాము. దాసరి నారాయణ రావు ఇచ్చిన స్వేచ్ఛకి నమస్కరించి ఎ.బి.కె ప్రసాద్‌ గారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఒక ఉద్వేగంతో పనిచేశాం. ఒక చారిత్రక విషాదానికి సాక్షులుగా నిలిచాం.

కత్తిపద్మారావు నాయకత్వాన దళిత మహాసభ ఆగ్రహప్రదర్శనలతో రంగంలోకి దిగింది. పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు బుల్లెట్లలాంటి యువకుల్ని ప్రకాశం జిల్లాలోకి పంపించారు. చెంచురామయ్య దగ్గుబాటి వెంకటేశ్వరరావు తండ్రి అయినందువల్ల, ఎన్టీఆర్‌తో బంధుత్వం వుండటం వల్ల పోలీసులు గడగడలాడుతూ పనిచేశారు. దళితులు బాధితులు. కమ్మవాళ్లు నిందితులు. ఇరుక్కున్నది పోలీసులు ! సాక్షాత్తూ ఎన్టీరామారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వుండగా, ఆయన బంధువుల్ని అరెస్టు చేయాల్సిన సంకటంతోనే పోలీసులు ఖాకీ నాటకాన్ని రక్తికట్టించారు. లక్కీగా ఆ సమయంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా జయప్రకాష్‌నారాయణ్‌ (లోక్‌సత్తా ) వుండటం అటు దళితులకీ, యిటు కమ్మవారికీ మేలు జరిగింది.

కారంచేడులో నెత్తుటి సూర్యోదయం…
జులై 16 రాత్రి కారంచేడు . మాల మాదిగలు ప్రశాంతంగానే నిద్రపోయారు. దాడికి ఆరేడు గ్రామాల బంధుమిత్రుల్నీ, మారణాయుధాల్నీ కూడగట్టడంలో కమ్మపెద్దలు రాత్రంతా రెప్పవాల్చకుండ పనిచేశారు. తెల్లారింది. 7 గంటలు దాటింది. నెత్తుటి ఘడియలు సమీపించాయి. డజన్లు,వందలు కాదు. మూడు వేల మంది అరుపులూ,కేకలూ, బూతుల్తో దాడికి తెగబడ్డారు. చేతుల్లో బరిసెలు, కత్తులు, గునపాలు, గండ్ర గొడ్డళ్లు, పెద్ద కర్రలు, గుంపులు మాదిగపల్లెపై విరుచుకుపడ్డాయి. షాక్‌తో, భయంతో దళితులు ఇళ్లలోంచి బైటపడి పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళవెంటే ఆడవాళ్లు పిల్లలూ..ఎందర్ని అని తప్పించుకోగలరు ! వందలు, వేలమంది తరిమికొడుతున్నారు. బరిసెల్తో పొడుస్తున్నారు. ఆడవాళ్ల చీరలు లాగేస్తున్నారు. మాలమాదిగలంతా ఆలవాటైన పొలాల్లోకి పరిగెత్తారు. నీళ్లలో బురద బురదగా వున్న చేలల్లో నిస్సహాయంగా నిలబడిపోయారు. దాడిచేస్తున్నవాళ్లకి దొరికిపోయారు. పదునైన బరిసెలు దింపి, పేగులు బైటికి వచ్చేలా తిప్పారు. కత్తులతో నరికారు. గండ్రగొడ్డళ్ళతో వేట్లు వేశారు. నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. బురదనీళ్ళలో తేలుతున్న నెత్తురు మధ్య శవాలు! కొందర్ని బురదలోనే తొక్కేశారు. దారుణమైన దెబ్బలు తగిలి,గాయపడిన వాళ్లెందరో లెక్కలేదు.

కర్రసాములోచేయి తిరిగిన మాదిగ వీరుడు తేళ్ళ యెహోషువ చేయెత్తు మనిషి. బరిసెపోట్లకు కూలిపోయిన యెహోషువని చీరాల ఆస్పత్రికి పంపగలిగారు. ఆ సాహాసి ఆస్పత్రిలో చాలాసేపు దారుణం గురించి కత్తి పద్మారావుతో మాట్లాడి చనిపోయారు. నాటి దుర్మార్గానికి ఆరుగురు బలైపోయారు.

  1. దుడ్డు వందనం (35 )
  2. దుడ్డు రమేష్‌ ( 22)
  3. తేళ్ళ యెహోషువ (55)
  4. తేళ్ళ మోషే ( 70 )
  5. తేళ్ళ ముత్తయ్య ( 45 )
  6. దుడ్డు అ్రబహాం ( 41 )

జూలై 31న ఆంధ్రప్రదేశ్‌ బంద్‌కి కాంగ్రెస్‌-ఐ పిలుపు యిచ్చింది. వామపక్షాలు, ప్రజాసంఘాలు, అఖిలపక్ష కమిటీ కలిసి బంద్‌ని జయప్రదం చేశాయి.

కత్తిపద్మారావు గొంతెత్తితే…
స్మశాన నిశ్శబ్దం లాంటి చీకటి
కారంచేడును కమ్ముకుంది.
యుద్ధరంగం చీరాలకు మారింది.
దళితులు తిరుగుబాటుకి సన్నద్ధం అవుతున్నారు.
కమేండర్‌ ఇన్‌ చీఫ్‌ కత్తి పద్మారావు కదం తొక్కుతున్నాడు. మరుగుతోన్న బాధితుల రక్తం.. “..దళితపులులమ్మా…” అంటూ ఉద్యమగీతంగా మారుతోంది.
చీరాల రుధిరక్షేత్రం శత్రువుగుండెల్లో నిద్రపోతానని ప్రకటన చేస్తోంది.

ప్రకాశం జిల్లానిని ఒక అనుమానం వెన్నాడింది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న దళితులు దెబ్బకు దెబ్బ తీస్తారా? కారంచేడు భూస్వాముల గుండెల్లో వణుకు. హత్యకేసు నడుస్తున్నందువల్ల దళిత సాక్షుల్ని భూస్వాములు లేపేస్తారా? బాధితుల కళ్ళలో బెరుకు. రంగంలో చురుగ్గా వున్న పీపుల్స్‌వార్‌ ఎప్పుడేం చేస్తుందో ? ఎక్కడ ఏం పేలిపోతుందో పోలీసుల టెన్షన్‌. భూస్వాముల భయం : పుకార్లు, అనుమానాలు, వదంతులు, భయాందోళనలు, చీరాల సముద్ర కెరటాల్లో ఎగిరిపడుతున్నాయి. భీషణ ప్రతిజ్ఞలు, పత్రికా ప్రకటనలు, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు, మరో పక్క ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, కారంచేడు దుర్మార్గం వార్తల ప్రవాహంగా మారుతోంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు ఏ మూల ఏం జరుగుతుందో.. ‘ఉదయం’ ప్రతిరోజూ పొద్దున్నే ఫోటోలతో సహా..బాధితులు చదివేది. భూస్వాములు కొనేదీ ఉదయమే. కత్తి పద్మారావు నుంచి సామాన్య దళిత కార్యకర్త దాకా ఉదయం పట్టుకు తిరిగేవాళ్ళే. పోలీసులు,లాయర్లు, ఇతర పేపర్ల జర్నలిస్టులు, కారంచేడు పరిణామాల కోసం ‘ఉదయం’ చదివేవాళ్ళు ! ఉదయం ఒక ఉద్యమ పత్రికగా మారిపోయింది.

కత్తి పద్మారావు రెచ్చగొట్టే ప్రసంగాలతో
కమ్మ భూస్వాముల ప్రతి వ్యూహాలతో
అందరికీ బ్లడ్‌ ప్రెషర్‌ పెరుగుతోంది

ప్రత్యక్ష సాక్షి హత్య…
హత్యాకాండ జరిగి నెలరోజులు దాటుతోంది. ఆగస్ట్‌ 15-చీరాలలో నిరసన దినం పాటిస్తున్నారు. విప్లవ కార్యకర్త ఉషాఎస్‌డానీ చీరాల సభలో మాట్లాడారు. ఆ సభా వేదిక మీద దుడ్డు అలీశమ్మ వున్నారు. దాడిలో మరణించిన దుడ్డు రమేష్‌ తల్లి అని నాకు గుర్తు. జూలై 17న నెత్తుటి బరిసెల్ని చూసి చలించిపోయిన తల్లి ఆమె. నాటి రాక్షస దాడికి ప్రత్యక్ష సాక్షి. ఆమె కన్నీటి కథనం హృదయం లేని కోర్టుని కూడా కదిలించే శక్తి గలది. దీన్ని పసిగట్టిన భూస్వాములకు కంటిమీద కునుకు లేదు. ఆగస్ట్‌ 20-25 తేదీల మధ్య భూస్వాముల కిరాయి గూండాలు, చీరాలలోనే అలీశమ్మని కత్తులతో పొడిచి చంపారు ! మనుషుల్ని చంపితే సరిపోదు. సాక్ష్యాన్ని కూడా హతమార్చాల్సింది !

చీరాల భగ్గుమంది. దళితులు దిగ్గున లేచారు. మనవాడు అధికారంలో వుంటే మనం ఎన్ని హత్యలయినా చేసుకోవచ్చు అనేది వాళ్ళ ధీమా ! నిజానికి ఎన్టీరామారావు ప్రభుత్వం డిఫెన్స్‌లో పడింది. ప్రతీకారదాడులు జరుగుతాయని భూస్వాములు కంపించి పోయారు. తక్షణం చేయాల్సిన పని ఫైర్‌బ్రాండ్‌ కత్తి పద్మారావు గొంతు నొక్కాలి. పద్మరావునీ చంపేస్తారన్న వదంతులతో చీరాల, పొన్నూరు గడగడలాడిపోయాయి. చిటికెలో అదృశ్యం అయిపోయిన పద్మారావు సురక్షితమై యింట్లో కొన్నాళ్ళు గడపాల్సి వచ్చింది. ఉద్యమంగా మారిన దళితవీరుల ఆవేశం కట్టలు తెంచుకు ప్రవహిస్తోంది.

ఉగాది పండగరోజునే….
1985 జులైలో ఘోరం జరిగితే 1987 దాకా బంద్‌లూ, ధర్నాలూ, సభలూ, ఉపాన్యాసాలూ తప్ప, బాధ, అశాంతి, వేదన తప్ప దళితులకు ఊరటా లేదు. భూములూ, ఉద్యోగాలూ, డబ్బూ ఇస్తానంటోంది ప్రభుత్వం. యిచ్చింది కూడా. జరిగిన అవమానం, పేరుకుపోయిన కక్ష, నిస్సహాయత వాళ్లని కుంగదీస్తున్నాయి. పీపుల్స్‌వార్‌ యాక్షన్‌ టీం రంగంలోకి దిగింది. అప్పటికే కారంచేడులో రెక్కీ ముగిసింది. 1987 ఏప్రిల్‌ 6వ తేదీ, ఉగాది పండగ. ఆ రోజు సాయంత్రం చీకటిపడ్డాక, అయిదుగురు సభ్యుల యాక్షన్‌ టీం కారంచేడులో అడుగుపెట్టింది. ఏడుగంటలు దాటాక, దగ్గుబాటి చెంచురామయ్య ఇంటికి చేరుకుంది. పసుపు రాసిన గుమ్మాలు మామిడి తోరణాలతో రమ్మంటున్నాయి. పిలిస్తే ఆయన పలికాడు. ఏదో ముఖ్య విషయం మాట్లాడడానికి వచ్చామని చెప్పారు. చెంచురామయ్య కూర్చున్నారు. వీళ్లు కొద్దిసేపు మాట్లాడారోలేదో ఆయనకి అనుమానం వచ్చింది. చటుక్కున లేచి లోపలి గదిలోకెళ్ళి తలుపు గడియపెట్టుకున్నారు. అయిదుగురూ లోపలికెళ్ళారు. ఇద్దరు ఇంటి వెనక్కి వెళ్ళారు. వెనుక తలుపు గడియపెట్టిలేదు. తక్షణం లోనికి చొరబడి చెంచురామయ్యను కత్తులతో నరికేశారు. చనిపోయాడని నిర్ధారించుకున్నాక,బైటికి వచ్చి తాపీగా నడుచుకుంటూ వెళ్ళి చీకటిలో కలిసిపోయారు. మరికొంతసేపట్లో హత్య విషయం తెలిసినా అప్పటికే యాక్షన్‌ టీం అదృశ్యం అయిపోయింది. పీపుల్స్‌వార్ దళ సభ్యులు 1. జె. లక్ష్మణరావు 2. కె. విజయకుమార్‌ ( కమ్మ) 3. ఏసు 4. ముత్యాల రామకృష్ణ, 5. ఇదపని శివశంకర్‌

“నా తండ్రి హత్యాకాండకు బాధ్యుడు కాదు. అయినా పీపుల్స్‌వార్‌ ఆయన్ని హతమార్చింది. నేనువాళ్ళని మన్నిస్తున్నాను. విద్యావంతుడైన విజయకుమార్ని విడుదల చేయాలని కోరుతున్నాను ” అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పత్రికా ప్రకటన చేశారు. లక్ష్మణరావు ఎప్పటికీ దొరకలేదు. ఏసుని పోలీసులు ఒక ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. చాలా ఏళ్ల విచారణ తర్వాత మిగిలిన ముగ్గుర్నీ కోర్టు నిర్దోషులుగా ప్రకటించి విడుదల చేసింది.

-తాడి ప్రకాష్, 97045 41559

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*