ఈ దుర్మార్గానికి…దౌర్భాగ్యానికి ముద్దాయి ఎవరు?

ఎపిలో పాపులర్ మీడియాగా చలామణి అవుతున్న ఒక పత్రిక నాలుగైదు రోజుల్లోనే రెండు వార్తలను ప్రచురించింది. తాగునీటికి కటకటలాడుతున్నారని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు లేవని, డాక్టర్లు సకాలంలో రావటం లేదని, తుదకు కుక్కకాటుకు మందులు లేవని… ఇప్పుడే ఈ సమస్యలు రాష్ట్రంలో ఏర్పడినట్లు రెండు కథనాలు వండివార్చింది.

నాలుగు రోజుల క్రితం కడప జిల్లా మైలవరం మండలం వద్దిరాల గ్రామంలో సాగునీరు డేవుడెరుగు…కనీసం తాగునీటి కోసం తోపుడు బండ్లపై బిందెలతో గ్రామస్తులు వరస కట్టి వెళ్లే ఫోటో ఫ్రంట్ పేజీలో ప్రచురించింది. గ్రామస్తులు ఒక్కో బండిని అయిదు వేల రూపాయలు పెట్టి బెంగళూరులో కొనుగోలు చేసినట్లు కూడా ఈ పత్రిక వార్త ప్రచురించింది. గ్రామంలో తాగునీరు లభ్యం కానందున దూర ప్రాంతం నుండి ఈ బండ్లపై నీరు తీసుకు రావాల్సిన దుస్థితి ఈ గ్రామస్తులకు పట్టిందని కథనం ప్రచురించింది. రాయలసీమలో ఇప్పుడే ఈ దుస్థితి ఏర్పడిందా? ఈ పత్రిక ఆత్మావలోకనం చేసుకుంటే మంచిదేమో. ఎన్నికల క్రతువు ముగిసిన తర్వాతనే తాగునీటి సమస్య గుర్తుకురావడం కాకతాళీయం కాదేమో.

ఈ దుర్మార్గానికి, దౌర్భాగ్యానికి ఎవరిది భాధ్యత? నిన్న మొన్నటి వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు సీమను పునీతం చేశాయని పాలకులు చెబుతుంటే తాటి కాయంత అక్షరాలతో బేనర్లు పెట్టిన ఈ పాపులర్ మీడియా ఎన్నికలు ముగియగానే, తుదకు తాగు నీటి కోసం సీమ ప్రజలు పడుతున్న యాతనలు ప్రముఖంగా ప్రచురించి అమ్మకాలు పెంచు కొనేందుకు సిధ్ధ మౌతున్నదని భావించడం తప్పు కాదేమో.

సీమలోనే కాదు. నేడు రాష్ట్రంలో తాగునీటి సమస్య కొత్తగా ఈ రోజు ఆకాశం నుండి ఊడి పడలేదు. అయిదు ఏళ్లు పరిపాలన సాగించిన రాష్ట్ర ప్రభుత్వం వారసత్వంగా ప్రజల నెత్తిన రుద్దింది. నెల రోజుల నుండే కాదు. దీర్ఘకాలంగా ఈ సమస్య వెంటాడుతోంది. కాని ఎన్నికలు ముగిసే వరకు పాలకులను ఆకాశానికి ఎత్తిన ఈ మీడియా ఈలాంటి వార్తలు ఇవ్వక పోగా గొంతెండి పోతున్న రాయలసీమలో ఎక్కడో ఎవరో ఒక రైతు నీటి గుంట త్రవ్వుకుని…కాసిన్ని నీళ్లు నిలుపు కొంటే పాలకులు చేపట్టిన నీటి కుంటల పథకం విజయవంతం అయిందని, రాయలసీమ అంతా పచ్చదనంతో నిండి పోయిందని రంగుల్లో కథనాలు ప్రచురించింది. ఈ మీడియా యేరు దాట గానే తెప్ప తగలెట్టి నట్లు ప్రస్తుతం సర్క్యులేషన్ పెంచుకొనేందుకు తాగునీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎంచక్కా ప్రచురించేందుకు సిధ్ధ మౌతున్నది.

ఇదిలా వుండగా ఇదే మీడియా బుధవారం మరో కథనం ప్రచురించింది. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు సకాలంలో రావడంలేదట. మందులు అసలే లేవట. ఈ కేంద్రాల్లో పరిసరాలు అశుభ్రంగా వున్నాయట. కొన్ని కేంద్రాల్లో పరికరాలు లేవట. కొన్ని కేంద్రాల్లో పరికరాలు వున్నా పని చేయడం లేదట. మరీ కుక్క కాటుక మందులు కూడా లేవట. ఈ కథనం చదువు తుంటే ఎవరికైనా అంతెత్తున లేవాలనిపిస్తుంది.
ఈ దుర్మార్గానికి ఎవరిని నిందించాలి? ముద్దాయిగా ఎవరిని బోనులో నిలబెట్టాలి? ఈ కథనంలో పేర్కొని వుంటే ఈ పత్రిక నిజాయతిని శంకించాల్సిన అవసరం వుండేది కాదు. ఈ సమస్యలు ఇప్పుడే ఏర్పడినట్లు తెలుగు దేశం ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేనట్లు కథనం ప్రచురించడంలోనే ఎవరికైనా పేచీ వుంటుంది.

అయిదు ఏళ్లు అధికారం వెలగ బెట్టిన నేతలు అధికారాంతమున గెలుపుపై మీన మేషాలు లెక్కించు కొంటూ వుంటే…ఇన్నాళ్లు వీరుడు శూరుడు అని పొగిడి తుది దశలో వ్యాపార దృష్టితో ఈ లాంటి కథనాలు ప్రకటించడం ఏ మాత్రం ఔచిత్యం లేక పోయినా పెట్టుబడుదారి వ్యవస్థ లో బూర్జువా మీడియా ఇంతకు మించి వ్యవహరించుతుందని భావించలేం.

పసుపు కుంకుమకు, విమాన యానాలకు, ప్రచార యావకు దుర్వినియోగం చేసిన నిధులు ఆరోగ్య కేంద్రాల్లో మందులు కొనుగోలుకు వ్యయం చేసి వుంటే బాగుండేదని ఈ పత్రిక తన కథనంలో పేర్కొని వుంటే ఇంత తపన పడాల్సి వుండేది కాదు. చేయెత్తి నమస్కరించే వాళ్లం.

– వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*