ఈ విలేక‌రులు చేసిన త‌ప్పేమిటి? ఏడేళ్ల జైలు శిక్ష ఎందుకు?

మయన్మార్‌ అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఇద్దరు రాయిటర్స్‌ జర్నలిస్టులకు అక్కడి కోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో స్థానికంగా పెద్దయెత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నారని, వారిని వెంటనే విడుదల చేయాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు. అసలేం జరిగిందంటే..

గతేడాది మయన్మార్‌లో రోహింగ్యాలపై జరిగిన హింసాకాండ ఉదంతం తెలిసిందే. మయన్మార్‌ సైన్యం నేతృత్వంలో చేపట్టిన ఆపరేషన్‌ వల్ల లక్షల మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు పారిపోయారు. రోహింగ్యాలను వెళ్లగొట్టే క్రమంలో మయన్మార్‌ భద్రతా బలగాలు వారిపై విపరీత చర్యలకు పాల్పడ్డాయి. వీటిపై అంతర్జాతీయంగా అనేక మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. కాగా.. ఈ వార్తలను ప్రచురించే క్రమంలో దేశ అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించారంటూ వా లోన్‌, కియా సో ఓ అనే ఇద్దరు రాయిటర్స్‌ రిపోర్టర్లపై కేసు నమోదైంది.

వీరు పోలీసుల నుంచి అతి ముఖ్యమైన రహస్య పత్రాలను సేకరించడం ద్వారా ఈ చట్టాన్ని ఉల్లంఘించారని మయన్మార్‌ పోలీసులు పేర్కొన్నారు. దీంతో గతేడాది డిసెంబరులో వీరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి యాంగాన్‌ ఇన్‌సీన్‌ జైలులో కస్టడీలో ఉంచారు. తాజాగా ఈ కేసులో విచారణ చేపట్టిన అక్కడి న్యాయస్థానం చట్టం ఉల్లంఘన కేసులో వీరిని దోషిగా తేల్చింది. వా లోన్‌, కియాలకు ఏడేళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది.

అయితే పోలీసులే కావాలని తమను అరెస్టు చేశారని లోన్‌, కియాలు ఆరోపిస్తున్నారు. ఆ రోజు పోలీసులు తమను డిన్నర్‌కు పిలిచారని.. అక్కడ తమకు కొన్ని పత్రాలు ఇచ్చారని చెప్పారు. రెస్టారెంట్‌ నుంచి బయటకు వచ్చిన కాసేపటి తర్వాత కొందరు పోలీసులు వచ్చి తమను అరెస్టు చేశారని పేర్కొన్నారు. అయితే ఈ పరిణామాలను తాము ధైర్యంగా ఎదుర్కొంటామని, తమకు న్యాయం జరిగేదాకా పోరాడుతామన్నారు. ఘటనపై రాయిటర్స్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ స్టీఫెన్‌ విచారం వ్యక్తం చేశారు. ‘ఇది చాలా విచారకరమైన రోజు.. మీడియాను బెదిరించేందుకు చేసే ప్రయత్నం’ అని వ్యాఖ్యానించారు.ఆ విలేక‌రులు చేసిన త‌ప్పేమిటి? ఏడేళ్ల జైలు శిక్ష ఎందుకు?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*