ఉండవల్లిని‌ జగన్ అభిమానులు ఏ కోణంలో చూస్తున్నారు…! ఆయ‌న ఎం చేస్తున్నారు.. !!

మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారంటే… ఒక ముఖ్యమంత్రి సమావేశానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఇస్తుంది మీడియా. అన్ని ఛానళ్లూ లైవ్ ఇస్తాయి. ఆయన మాట్లాడినంతసేపూ చూపిస్తాయి.‌

ఉండవల్లి మాటలను వినడానికి ప్రజలూ ఆసక్తి చూపుతారు. ఆయన మాటలు కొన్ని రోజుల పాటు చర్చనీయాంశంగానూ ఉంటాయి. కొన్ని‌ ఆధారాలు, లోతయిన‌ విశ్లేషణ, అవగాహనతో మాట్లాడే ఉండవల్లి… చెప్పేదాంట్లో హేతబద్ధత కనిపిస్తుంది. అందుకే ఆయన మాటలకు ప్రజల్లో విలువ ఏర్పడింది.

తాజాగా బుధవారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా జగన్ ప్రభుత్వం గురించే మాట్లాడారు. గతంలోనూ ఆయన జగన్ గురించి మాట్లాడారు. గతంలో మాట్లాడిన దానికీ, ఇప్పుడు‌ మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా ఉందనిపిస్తుంది.

తాను ఎంతో ఇష్టపడే వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా జగన్ ను అభిమానిస్తానని, ఆయన బాగుండాలని కోరుకుంటానని అనేక పర్యాయాలు చెప్పారు. జగన్ వంటి నాయకుడు సమకాలీన రాజకీయాల్లో లేరని చెప్పారు. ప్రజాభిమానం‌ సంపాదించడంలో తండ్రినే మించిపోయాడని‌ అన్నారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ సాధించిన విజయం అపూర్వమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇంతటి‌ విజయం ఇప్పటి దాకా ఎవరికీ దక్కలేదన్నారు.

ఇదంతా చూసిన జగన్ అభిమానులు… ఉండవల్లిని జగన్ కు శ్రేయోభిలాషి అనుకున్నారు. ఆయన పక్కన ఉంటే జగన్ పాలన ఇంకా బాగుంటుందని భావించారు. ఉండవల్లిని సలహాదారునిగా నియమించుకోవాలని సోషల్ మీడియా వేదికగా సలహాలు కూడా ఇచ్చారు.

ఇదిలావుండగా…కొన్ని నెలల్లోనే ఉండవల్లి స్వరం పూర్తిగా మారింది. జగన్ మీద తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జగన్ కక్ష సాధింపు రాజకీయాలకు పూనుకుంటున్నారని విమర్శించారు. కోర్టులతో అనవసరంగా గొడవలు తెచ్చుకుంటున్నారని‌ అన్నారు. ఇసుక విధానం సరిగా లేదన్నారు. ఇళ్ల స్థలాల కోసం సేకరిస్తున్న భూములకు ఎక్కవ ధర చెల్లిస్తున్నారని ఆక్షేపించారు. మద్యం బ్రాండ్లు మంచివి కావన్నారు. చంద్రబాబు నాయుడు దపదఫాలుగా చేసిన విమర్శలను…ఉండవల్లి ఒకసారిగా చేసినట్లు‌ అనిపించింది.

జగన్ మేలు కోరి చెప్పినట్లే అనిపించినా… ఆయన్ను డేమేజ్ చేయడమే లక్ష్యంగా అనిపిస్తుంది. ఉండవల్లి విమర్శలను, అందులో‌ ఏమాత్రం ఔచిత్యం ఉందో ఒకసారి పరిశీలిద్దాం…

ఇసుక విధానం బాగోలేదంటున్నారు. చంద్రబాబు పాలనలో ఉచితం పేరుతో, ఇసుకను విచ్చలవిడిగా వదిలేయడం వల్ల.. తెలుగుదేశం నేతలు కోట్ల రూపాయలు దండుకున్నారు. అదే పద్ధతిని జగన్‌ అనుసరించివుంటే…వైసిపి నేతలకూ జేజులు నిండేవి. అయితే అటువంటి అవకాశం లేకుండా చేసారు జగన్. ఇసుక ద్వారానూ ప్రభుత్వానికి‌ ఆదాయం సమకూరాలని భావిస్తున్నారు. ఇందులో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అంతమాత్రాన ఇసుక విధానం బాగోలేదని ఎప్పడం ఉండవల్లి వంటి మేధావులకు భావ్యమా…!

మద్యం అంశమూ ఇటువంటిదే. మద్యపానాన్ని నిరుత్సాహపరిచే దిశగా చర్యలు తీసుకున్నారు. మద్యం ధరలను ఎవరూ ఊహించనంతగా పెంచారు. షాపుల సంఖ్య తగ్గించారు. అమ్మకాల సమయం కుదించారు. దీంతో మద్యం వినియోగం తగ్గతోంది. షాపులను ప్రభుత్వమే నిర్వహించడం వల్ల అధికార పార్టీ నాయకులకు‌ కమీషన్లకు అవకాశం లేకుండాపోయింది. ఇన్ని‌ మంచి‌ అంశాలున్న మద్యం విధానంపై మాట్లాడుతూ…మద్యం బ్రాండ్లు మంచివి కావని…చంద్రబాబు చేసిన విమర్శనే ఉండవల్లి చేయడం ఆశ్చర్యం.

ఇక పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కొనుగోలు చేస్తున్న భూములకు ఎక్కువ ధర చెల్లించారని మరో విమర్శనూ ఉండవల్లి చేశారు. ప్రభుత్వం దీనిమీద ఇప్పటికే వివరణ ఇచ్చింది. తమకు కావాల్సిన భూములకు ధర ప్రకటించి, ఆ ధరకు ఇచ్చేవాళ్లు ఉంటే కొంటామని చెప్పింది. ఎవరూ ముందుకు రాలేదు. భూసేకరణ చట్టానికి లోబడి ధరలు నిర్ణయించి భూములు కొనుగోలు చేసారు. ఇందులో ఒకటి రెండు చోట్ల ఎక్కువ ధర చెల్లించివుండొచ్చు. కాదనలేదు. అయితే ఈ భూములు కొన్నది లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం. ఇకేసారి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి టిడిపి అడ్డు తగులుతుంటే… ఉండవల్లి కూడా అదే తరహాలో మాట్లాడటం సమంజసమా..!

అన్నింటికన్నా కీలకం…జగన్ కోర్టులతో గొడవ పెట్టుకుంటున్నారని చెప్పడం. ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగుకూ కోర్టు కేసులతో అడ్డుపడుతున్నదెవరు..! దేశంలో మరే రాష్ట్రంలోనైనా ప్రభుత్వం మీద ఇన్ని కేసులు వేసిన పరిస్థితి ఉందా..! గత ప్రభుత్వాలపై ఈ విధంగా కోర్టు కేసులు దాఖలు చేసిన ఉదంతాలున్నాయా..! ఇందులో జగన్ కోర్టులతో తగవు పెట్టు కోవడం ఏముంది.. ! జగన్ ను కోర్టులతో చికాకు పెడుతుంటే…ఆయనే కోర్టులతో గొడవ పెట్టుకుంటున్నాని‌ అనడం ఏ ము.

ఉండవల్లి చెబుతున్నది ఏమంటే… చంద్రబాబు చెబుతున్నట్లు పరిపాలించాలి. తెలుగుదేశంతో ఘర్షణ పెట్టుకోకూడదు.‌ కోర్టు కేసులతో చికాకు పెడుతున్నా సర్దుకుపోవాలి. అప్పుడు మాత్రమే జగన్ ప్రజల‌ అభిమానాన్ని చూరగనగలరు.. ! లేదంటే అప్రతిష్టపాలవుతారు. ఇదీ ఉండవల్లి చెబుతున్న సలహా.

ఇంతకీ ఉండవల్లి… జగన్ శ్రేయస్సు కోసం చెప్పారా.. లేక ఇప్పటికే రాళ్లు విసురుతున్న ప్రతిపక్ష టిడిపి చేతికి మరిన్ని‌‌ రాళ్లు అందించారా..! ఇదీ అసలు ప్రశ్న. తనను జగన్ గుర్తించాలన్న తహతహతో మాట్లాడారా…!

కాంగ్రెస్ లో ఉంటూ ఒక వెలుగు వెలిగి, నామమాత్రంగా మిగిలిన కాంగ్రెసులో ఏమీ చేయలేక, బిజెపితోనో…టిడిపితోనో కలవలేక, అలాగని తమ కళ్లముందు పిల్లవాడిగా ఉండి పార్టీ పెట్టి‌, సిఎం పీఠాన్ని అధిష్టించిన జగన్ దరి చేరలేక ఇబ్బంది పడుతున్న సీనియర్లు…జగన్ మీద అక్కసు వెళ్లగక్కుతూ ఉంటారు. ఆ జాజితాలో ఉండవల్లి కూడా చెరారా..అనే అనుమానం కలుగుతోంది. ఏదేమైనా ఇంకొన్ని రోజులు‌ ఆగితే ఉండవల్లి అరుణ్ కుమార్ పూర్తిగా తెర తొలగించే అవకాశం ఉంది. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*