ఊరూరా టిడిపి అమిత్‌షాలు!

బిజెపి జాతీయ అధ్యక్షులు, పార్లమెంటు సభ్యులు అమిత్‌షాపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా నిప్పులు చెరిగారు. రాజధానికి నిధులకు సంబంధించి అమిత్‌షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ‘ఇచ్చిన నిధులకే ఇప్పటికీ యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వలేదు….రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన నిధులు రూపాయి ఖర్చు చేయలేదు. రాజధాని మ్యాప్‌లు ఇంకా మలేషియాలోనే ఉన్నాయి’ అని అమిత్‌షా అన్నారు. దీంతో యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు అడగడానికి మీరెవరు? కేంద్ర పాలనలో మీ పెత్తనం ఏమిటి? అని చంద్రబాబు నాయుడు గట్టిగానే నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌తో పెట్టుకోవొద్దంటూ హెచ్చరించారు. ప్రధాన మంత్రో లేక ఏ కేంద్ర మంత్రో అడగాల్సిన ప్రశ్నను అమిత్‌షా అడిగినందుకు బాగానే మాట్లాడారు ముఖ్యమంత్రి.

అయితే…ఆంధ్రప్రదేశ్‌లో జన్మభూమి కమిటీల పేరుతో జరుగుతున్నది ఏమిటి? ఈ కమిటీల్లో ఉన్నది ఎవరు? నిర్ణయాలు చేస్తున్నది ఎవరు? జిల్లా కలెక్టర్లుగానీ, ఎంపిడిఓలుగానీ, సర్పంచులుగానీ ఏవైనా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా? ఊరూరా తమ కార్యకర్తలను ఎంపిక చేసి, వారికే జన్మభూమి కమిటీ సభ్యులని హోదా కల్పించి, పెత్తనం వాళ్లకు అప్పగించారు. ప్రజలతో ఎన్నికైన సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్‌పిటిసిలు మామమాత్రంగా మారారు. ఆఖరికి అధికారులకూ ఏ అధికారమూ లేకుండాపోయింది. రేషన్‌ కార్డు ఇవ్వాలన్నా జన్మభూమి కమిటీలకే తప్ప కలెక్టర్‌కూ అధికారం లేదు. ఈ అప్రజాస్వామ్య పద్ధతిపైన తొలి నుంచి నిరసన వ్యక్తమవుతూనే ఉంది. ప్రభుత్వ పథకాల ఎంపికలో జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. తమ పార్టీ కార్యకర్తలనే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నాయి. ఇది తప్పని ఏనాడూ ప్రభుత్వానికి అనిపించలేదు.

జన్మభూమి కమిటీలను రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా చాలామంది అభివర్ణిస్తున్నారు. ఇందులో తప్పేమీలేదు. ఏ విధంగానూ ఈ కమిటీలకు రాజ్యాంగ ఆమోదం లేదు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఎన్నికైన వారు ఉత్సవ విగ్రహాలుగా ఉండగా ఈ కమిటీలు అన్నీ తామై వ్యవహరిస్తున్నాయి. ఒక ఎంపిగా ఉన్న అమిత్‌షా ఒక ప్రశ్న అడిగినందుకే… ప్రభుత్వ పాలనలో మీ పెత్తనం ఏమిటని చంద్రబాబు ప్రశ్నిస్తున్నట్లే…గ్రామాల్లో జన్మభూమి కమిటీల్లోని టిడిపి అమిత్‌షాల పెత్తనం ఏమిటని జనం ప్రశ్నిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*