ఎదురుదాడి వ్యూహంలో టిడిపి! ఆత్మరక్షణ రాజకీయాల్లో వైసిపి!!

గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసి, నాలుగేళ్లపాటు ప్రభుత్వాల్లో భాగం పంచుకుని, చెట్టాపట్టాలేసుకున్న బిజెపి, టిడిపి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. విభజన తరువాత రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో బిజెపికి ఎంత పాత్రవుందో…టిడిపికీ అంతే పాత్రవుంది. రాష్ట్రానికి తీరని అన్యాయంపై ఆ రెండు పార్టీలూ సమానంగా బోనులో నిలబడి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఒక విధంగా తెలుగుదేశం పార్టీది ఆత్మరక్షణ స్థితి. ఇదే సమయంలో అధికార పార్టీలు చేసిన మోసాలను ఎండగట్టి, ప్రజల్లోకి తీసుకెళ్లి, తన దాడితో ఆ పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేయగల అవకాశం ప్రధాన ప్రతిపక్షమైన వైసిపిది. అయితే…ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే….పూర్తి భిన్నంగా ఉంది. ఆత్మరక్షణలో ఉండాల్సిన అధికార పార్టీ ఎదురుదాడి వ్యూహంతో ముందుకెళుతుంటే…. ఎదురుదాడికి దిగాల్సిన ప్రతిపక్షం ఆత్మరక్షణ రాజకీయాలను నడుపుపుతోంది.

మతతత్వ బిజెపితో పొత్తుపెట్టుకునే అవకాశమే లేదని గతంలో చంద్రబాబు నాయుడు అనేక పర్యాయాలు ప్రకటించారు. గుజరాత్‌లో మారణహోమానికి కారణమైన మోడీ హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్టు చేయిస్తానని ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అలాంటి పార్టీ గత ఎన్నికల్లో ఎలాంటి బెరుకూ బెదురూ లేకుండా బిజెపితో పొత్తు పెట్టుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నట్లు సమర్థించుకుంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వంలో బిజెపి వాళ్లకు చోటు ఇచ్చింది. తానూ కేంద్ర ప్రభుత్వంలో చేరింది. ఎవరైనా మోడీని విమర్శించినా అగ్గిమీద గుగ్గిలం అయ్యారు చంద్రబాబు. ఇలా రెండు పార్టీలూ ఒకటే అనేంతగా కలిసిపోయాయి.

రాజకీయ కారణాలతో నాలుగు నెలల క్రితం బిజెపితో తెగదెంపులు చేసుకున్న తరువాత…మళ్లీ బిజెపి మీద నిప్పులు కురిపిస్తున్నారు బాబు. ఆ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేసిందని చెబుతున్నారు. ఆ పార్టీతో ఎవరు కలిసినా వాళ్లు కూడా రాష్ట్ర ద్రోహులే అనే ప్రచారం మొదలుపెట్టారు. అదేవిధంగా వైసిపి-టిడిపి కలిసిపోతున్నాయని, కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని కూడా చంద్రబాబు ప్రచారం హోరెత్తించారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పడం కంటే…బిజెపిని విమర్శించడం, ఆ పార్టీతో కలిసిపోతోందంటూ వైసిపిని ఎండగట్టడంపైనే టిడిపి ఎక్కువ దృష్టి పెట్టింది. ఇందుకు తన అనుకూల మీడియాను బాగా ఉపయోగించుకుంటోంది. గడచిన నాలుగు నెలల పరిణామాలను గమనిస్తే…చంద్రబాబు నాయుడు ఒక విషయంలో స్పష్టమైన విజయం సాధించినట్లు అర్థమవుతుంది. బిజెపిని ఒంటరి చేయడంతో పాటు ఆ పార్టీతో ఎవరైనా కలవాలంటే భయపడే పరిస్థితులను సృష్టించగలిగారు. ఈ క్రమంలోనే తరచూ వైసిపిని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నారు. తాము బిజెపితో కలవడం లేదని వివరణలు ఇచ్చుకునే పరిస్థితి ఆ పార్టీకి కల్పించారు.

విజయసాయిరెడ్డి ప్రధాన మంత్రి కార్యాలయంలోనే ఎక్కువగా ఉంటున్నారని ప్రచారం చేశారు. అదేవిధంగా వైసిపి, బిజెపి నాయకులు కలిసి కనిపిస్తే దానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చి టిడిపి అనుకూల మీడియా కథనాలు అల్లేస్తోంది. ఇందులో భాగంగానే ఢిల్లీలో ఏపి భవన్‌తో బిజెపి, టిడిపి నేతలు ఆకుల సత్యనారణ, బుగ్గన రాజేంద్రరెడ్డి కలిసి మంతనాలు జరిపినట్లు ఓ వార్తను వైరల్‌ చేశారు. ఏపి భవన్‌లో అన్ని పార్టీల వారూ ఉంటారు. ఆ రోజు టిడిపి విప్‌ రవికుమార్‌ కూడా ఏపి భవన్‌లో ఉన్నారని, రవి కూడా తనను కలిశారని, రవికుమార్‌ తనను ఆలింగనం కూడా చేసుకున్నారని రాజేంద్రరెడ్డి చెప్పారు. రవికుమార్‌ తనను కలిసినందున ఆయన వైసిపిలో చేరిపోతున్నట్లు ప్రచారం చేయవచ్చా అని ప్రశ్నించారు. వైసిపి ఆత్మరక్షణలో పడిందనడానికి ఇలాంటి వివరణలే ఉదాహరణ. ఈ ఉదంతానికి ఆయన వివరణ ఇవ్వడంలో తప్పులేదు. ఇవ్వాలికూడా. అయితే…ఇవన్నీ టిడిపికి తెలుసు. ఒక వ్యూహం ప్రకారమే ఆ పార్టీ వైపిపిపైన దాడి చేస్తోంది. టిడిపి లేవనెత్తే అంశాలకు వివరణలు ఇవ్వడంతోనే వైసిపి పని సరిపోతోంది. ఎదురుదాడి వ్యూహం గురించి ఆలోచించడం లేదు.

ఇదే ధోరణి కొనసాగితే…టిడిపి మరింత పైచేయి సాధించడం ఖాయం. టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లలేకపోతున్నారు. సినీనటుడు పోసాని మురళీకృష్ణ చెబుతున్నంత స్పష్టంగా కూడా వైసిపి నేతలు చెప్పలేకున్నారు. రాజకీయాల్లో ఆత్మరక్షణ వ్యూహం కొంత కత్తికి డాలు అడ్డుపెట్టడం వంటిదే. కత్తి ఝుళిపించకుండా, డాలు అడ్డుపెట్టి శత్రువును అంతం చేయలేరు. కత్తి ఝుళిపించడానికి ఉన్న అవకాశాన్ని వైసిపి శ్రేణులు ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటే….ఆ పార్టీ అంతగా ప్రయోజనం పొందగదు. అంతేగానీ ఇదే పద్ధతిలో రాజకీయాలు చేస్తే చివరికి మిగిలేది ఓటమే. బిజెపి పట్ల తన వైఖరి ఏమిటో విస్పష్టంగా ప్రకటించాలి. మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించగలిగితేనే…టిడిపి ప్రచారాన్ని ఎదుర్కోగలరు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*