ఎద్దుకు ఉత్తమ మెకానిక్ అవార్డు… గజదొంగ బదులు‌ సర్పంచ్ ఫొటో… జర్నలిస్టు సర్కిల్స్ లో బోలెడంత కామెడీ…!

– సీనియర్ జర్నలిస్టు, కాలమిస్టు, రచయిత జి.రామాంజనేయులు (జిఆర్ మహర్షి) జ్ఞాపకాలు

1988లో మే 15, భగభగమండే ఎండల్లో నేను తిరుపతిలో అడుగుపెట్టాను. ఆంధ్రజ్యోతిలో సబెడిటర్‌గా ఉద్యోగం. ఒక్కసారి తిరుపతిలో అడుగుపెడితే మనకు తెలియకుండానే ఆ నగరపు వాత్సల్యంలో చిక్కుకుపోతాం. తల్లిలా ఆదరిస్తుంది తిరుపతి. కొత్త వ్యక్తులను ఆదిరించే అభిమానించే సంస్కృతి ఆ నగరానికి శతాబ్దాలుగా ఉంది.

అప్పట్లో రేణిగుంటకు బస్‌ సౌకర్యం సరిగా ఉండేది కాదు. ఆర్‌టిసి బస్సులు ఎప్పుడు వస్తాయో ఎవరికీ తెలియదు. భారతీ బస్సు ఉండేదికానీ అదెప్పుడు కదుతుందో డ్రైవర్‌కు కూడా తెలిసేది కాదు. మిగిలిందల్లా పొడుగాటి మూతి వున్న వ్యాన్లు. వాటిలో జనాన్ని ఎక్కిస్తూనే ఉంటారు. ఎవరికీ సీటు ఉండేది కాదు. ఒకరిపై ఒకరు కూర్చునేవారు. డ్రైవర్‌పై కూర్చున్నా ఆయనేమీ అనేవాడు కాదు. ఈ వ్యాన్లులో గేర్‌ రాడ్‌కు కొన్ని సొంత అభిప్రాయాలు ఉండేవి. డ్రైవర్‌తో నిమిత్తం లేకుండా కదిలేది. ఈ ప్రమాదాన్ని నివారించడానికి దానికి మద్దతుగా ఒక కర్రను ఉంచేవాళ్లు. ఈ వ్యాన్ల గొప్పతనమేమిటంటే…దార్లో చక్రం ఊడిపోవచ్చు. డ్రైవర్‌ అదృష్టం బాగుంటే స్టీరింగ్‌ ఊడిరావచ్చు. ఏంజరిగినా సరే జర్నలిస్టును ఆఫీసుకు చేర్చేది.

ప్రయాణమొక సమస్యయితే భోజనం ఇంకా సమస్య. ఆంధ్రజ్యోతి పక్కన రెడ్డి మెస్‌ ఉండేది. ఆయనకు అందరిపట్ల సమభావం ఉండేది. మేనేజర్‌ పట్ల ఇంకొంచెం ఎక్కువ సమభావం ఉండేది. ఆయనకు పంపే కూరలు కొంచెం ఎక్కువ ఘుమఘుమలుగా ఉండేవి. రెడ్డి పట్టిన కోడికి నాలుగు కాళ్లు ఉండేవి. ఆయన ఇచ్చే చికెన్‌లో అవి మాత్రమే కనిపించేవి. ఓసారి సాంబర్‌లో నాకు బొద్దింక ఒడ్డించాడు. కానీ అది వంకాయని వాదించాడు. నలుగురు ప్లిలతో జీవితాన్ని ఎంతో ధైర్యంగా ఎదుర్కొన్న రెడ్డి…జీవితం ఎంతో సజావుగా సాగుతున్నప్పుడు హఠాత్తుగా మరణించాడు.
 
మనుషులు ఫోన్లో కాకుండా నేరుగా మాట్లాడుకునే రోజు. టెక్నాజీ ఎదగలేదు. జర్నలిస్టులు ఎవరికీ కంప్యూటర్‌ పరిజ్ఞానం లేదు. పేజీలను చేత్తో పెట్టేవారు. పేజీ మేకప్‌ ఆర్టిస్టుల్లో కొందరు ఎక్స్‌ఫర్ట్‌లు ఉండేవారు. రెండు మూడు వార్తలు కలిపి ఒక వార్తగా అతికించేవారు. ఈ క్రమంలోనే ఒక ఎద్దుకు ఉత్తమ మెకానిక్‌ అవార్డు ఇచ్చినట్లు వార్త వచ్చింది. ఫొటో పరిస్థితీ ఇదే. గజదొంగకు బదులు ఉత్తమ సర్పంచ్‌ ఫొటో వచ్చింది.

తిరుపతిలో జర్నలిస్టు యూనియన్‌కి పునాది వేసింది స్వర్గీయ పార్థసారథిగారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించి అపార్టుమెంటు తరహాలో ఇళ్లు నిర్మించే ప్రతిపాదన ఆయన చేశారు. పాతికేళ్ల తరువాత కూడా ఆయన కల నెరవేరలేదు. జర్నలిస్టులకు ఏ చిన్న కష్టం వచ్చినా ముందుండి పోరాడిన వ్యక్తి పూర్ణచంద్రరావు గారు. ఆయన నాయకత్వంలో ఎన్నో ధర్నాలు జరిగాయి. ఓ సారి ఎస్‌పి కార్యాయం ముందు చిత్తూరులో ధర్నా చేయాల్సివచ్చింది. దానికి గాను ఓ ప్రైవేట్‌ బస్సులో తిరుపతి నుంచి వెళ్లాం. డీజిల్‌ ఖర్చును యూనియన్‌ భరించింది. అద్దె లేకుండా బస్సు ఇప్పించింది అప్పటి ట్రాఫిక్‌ సిఐ కరుణాకర్‌ గారు. పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా చేయడానికే బస్సు అడిగామని ఆయనకు తెలియదు. ఇప్పటికైనా తెలుసో లేదో నాకు తెలియదు. జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడిన పూర్ణచంద్రరావు గారికి సొంత సమస్యలు పట్టలేదు. ఆయన మరణించిన నాడు ఇంట్లో చిల్లిగవ్వ లేదు. ఈ రోజుకీ జర్నలిస్టు పరిస్థితి ఇదే. ఈ పాతికేళ్లలో తిరుపతిలో సాదాసీదాగా జీవితాన్ని ప్రారంభించి కోటీశ్వరులైన డాక్టర్లు, ఇంజినీర్లు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఎందర్నో చేశాను. కానీ మంచి జీవితాన్ని అనుభవించిన జర్నలిస్టును ఓ పాతిక మందిని కూడా చూడలేదు. ఇదో విషాదం.

ఈ ప్రయాణంలో ఎందరో మహానుభావులు, స్నేహితులు, సహోద్యోగులు అందర్నీ పేరుపేరునా స్మరించుకోలేను. జీవితంపై ఎన్నో ఆశలతో ప్రయాణాన్ని మొదుపెట్టిన ఎందరో ఈ లోకంలో లేరు. రాంప్రసాద్‌ అని మా ఇన్‌ఛార్జి ఉండేవారు. ఆయన చిన్న వయసులోనే పోయారు. మంచి హెడ్డింగ్‌ కోసం గంటల తరబడి ఆలోచించేవారు. అహం, అసూయ… ఈ రెండు మచ్చుకకైనా లేని వ్యక్తి సూర్యనారాయణ రాజుగారు. న్యూస్‌ ఎడిటర్‌గా కొంతకాలమే పని చేసినా చివరి వరకు తిరుపతినే కలవరించిన వ్యక్తి ఆయన.

తిరుపతిలో ఎవరు పని చేసినా ఆ ఊరిని మరచిపోలేరు. వెంకటేశ్వర స్వామి కొలువై ఉండటమొక్కటే కారణం కాదు. అక్కడ ఏదో ఆకర్షణ ఉంది. బోలెడెంత మంది చిన్ననాటి మిత్రులు, బంధువులు కలుస్తూనే ఉంటారు. అయితే వాళ్ల వల్ల దర్శనాలు, లడ్డూ ఇబ్బందులు కూడా ఉంటాయి. తప్పవు.

జర్నలిస్టు సర్కిల్‌లో కూడా బోలెడెంత కామెడీ నడిచేది. అర్ధరాత్రి తరువాత బస్టాండులో సమావేశమై ఒకటే కబుర్లు. కాలం మారిపోయింది. ఇప్పుడంత తీరిక ఎవరికీ లేదు. ఒత్తిడి పెరిగిపోయి పక్క పేపర్లోని జర్నలిస్టుల ముఖ పరిచయం కూడా లేకుండా జీవించేస్తున్నాం. పాత నీళ్లుపోయి కొత్త నీళ్లు వస్తుంటాయి. జర్నలిజం ఒక వృత్తి దశ నుంచి ఉద్యోగమయింది. చివరికి ఊడిగంగా మారిపోతూవుంది. జర్నలిస్టుకు మంచి కాలం ఒకటి వచ్చి తీరుతుందని ఆశిస్తూ…

– జి.రామాంజనేయులు (జిఆర్ మహర్షి)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*