ఎన్నికలకు ‘ఎన్‌టిఆర్‌’ సిద్ధం!

తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామరావు జీవిత చరిత్ర ఆధారంగా తీయనున్న సినిమాకు సంబంధించి ఒక్కో విషయంలో స్పష్టత వస్తోంది. ముందుగా ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తారని ప్రకటించారు. ముహూర్తం షాట్లు కూడా తీశారు. ఇంతలోనే ఏమయిందోగానీ…ఈ సినిమాకు తాను దర్శకత్వం వహించలేనని తేజ తప్పుకున్నారు. బాలకృష్ణనే నటిస్తూ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తారని ఊగాహానాలు వినిపించాయి. ఇంతలోనే ‘మహానటి’ సినిమా విడుదలయింది. ఎన్‌టిఆర్‌ బయో పిక్‌ గురించి ముందుగా ఏమనుకున్నారోగానీ…మహానటి విడుదలైన తరువాత, ఎన్‌టిఆర్‌ బయో పిక్‌ కూడా ఆ స్థాయిలో ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. దర్శకుని కోసం అన్వేషించారు. ఎట్టకేలకు బాలకృష్ణ వందో చిత్రం శాతకర్ణి దర్శకుడు క్రిష్‌ దొరికారు. తనస, వాచ, కర్మణ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తానని క్రిష్‌ చెప్పిన మాటను కచ్చితంగా నిలుపుకుంటారు. ఆయనలో అంతటి ప్రవీణ్యత ఉందనడంలో సందేహం లేదు.

ఎన్‌టిఆర్‌ బయోపిక్‌ను ఈ దసరాకు విడుదల చేయాలని ముందుగా అనుకున్నారు. దర్శకుడు తప్పుకోవడం వల్ల షూటింగ్‌ జరగలేదు. అయితే…2019 సంక్రాంతి సందర్భంగా సినిమాను విడుదల చేస్తామని బాలకృష్ణ ఎన్‌టిఆర్‌ జయంతి సందర్భంగా ప్రకటించారు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌టియో బయో పిక్‌ తీయడం లేదని బాలకృష్ణ చెప్పినప్పటికీ….వచ్చే ఎన్నికల సమయానికి ఈ చిత్రం థియాటర్లలో ఉంటుందనేది స్పష్టమవుతోంది. 2019 మార్చి-ఏప్రిల్‌ నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అంటే రెండు నెలలు ముందుగా చిత్రం విడుదలవుతుందన్నమాట. ఎన్నికల వాతావరణం వాడిగా వేడిగా ఉన్న సమయంలోనే సినిమా బయటకు వస్తుంది. మొత్తంమ్మీద ఎన్నికలకు ఎన్‌టిఆర్‌ సిద్ధమన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*