ఎన్నికలు రావాలంటే…బాబు చేతుల్లోనే ఉంది!

వైసిపి ఎంపిలు రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌ ఆమోదిస్తే…ఆ స్థానాల్లో ఎన్నికలను ఎదుర్కోడానికి టిడిపి సిద్ధంగా ఉందని, ఎన్నికలకు వచ్చే ధైర్యం వైసిపికి ఉందా…అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్‌ విసిరారు. ఎన్నికలు వస్తే ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేలిపోతుందని, 2019 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో కూడా అర్థమైపోతుందని అంటున్నారు. చంద్రబాబు చెప్పింది కరెక్టే. వైసిపి ఎంపిలు రాజీనామా చేసిన స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే ప్రజాభిప్రాయం ఎలావుందో తెలిసిపోతుంది. అయితే స్పీకరేమో వైసిపి ఎంపిల రాజీనామాలను ఆమోదించడం లేదు. మరోవైపు వైసిపి అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందిస్తూ….’మీ ఎంపిలు కూడా రాజీనామా చేసివుంటే రాష్ట్రంలో నుంచి లోక్‌సభలో ప్రాతినిథ్యమే ఉండేది కాదు…అప్పుడు కచ్చితంగా రాజీనామాలు ఆమోదించివుండేవారు. ఎన్నికలొచ్చేవి. ఆ పని చేయకుండా మమ్మల్ని విమర్శిస్తారా’ అని ఎదురుదాడి చేస్తున్నారు.

లోక్‌సభ స్థానాల్లో ఉప ఎన్నికలు రావడం రాకపోవడం స్పీకర్‌ చేతుల్లోవుందిగానీ…. నిజంగా ప్రజాభిప్రాయం ఎవరికి అనుకూలంగా ఉందో తెలుసుకోవాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చేతుల్లోనే ఉంది. పంచాయతీరాజ్‌ ఎన్నికలకు సమయం ఆసన్నమయింది. ఆగస్టు 1 తేదీతో సర్పంచుల పదవీకాలం ముగుస్తుంది. అదేవిధంగా జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పదవుల కాలమూ మరో నెల రెండు నెలల్లో ముగుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తలచుకుంటే ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సిద్ధమయింది. రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వమేమో ఈ ఎన్నికల ఊసే ఎత్తడం లేదు. లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికలపై విసురుతున్న సవాలు పంచాయతీరాజ్‌ ఎన్నికలపై విసరడం లేదు. మరోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పంచాయతీరాజ్‌ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఈ ఎన్నికలపై చంద్రబాబు నాయుడు స్పందిస్తారా…ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేదీ చెబుతారా? ఏమో చూద్దాం!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*