ఎన్నికల కమిషనర్ తొలగింపు కాదు.. పదవి ముగింపు..!

వివాదాస్పదంగా మారిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ప్రభుత్వం తెలివిగా వేటు వేసింది. ఆయనను పదవి నుంచి తొలగించ కుండానే… పదవీ కాలం ముగిసే లాగా చేసింది. ఇందుకు పంచాయతీరాజ్ చట్టాన్ని ఉపయోగించుకున్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను…పంచాయతీ రాజ్ చట్టం ప్రకారమే నియమిస్తారు. ఆయన పదవీకాలం, ఏ స్థాయి వ్యక్తి ఆ పదవిలో ఉండాలి…అనే అంశాలను కూడా పంచాయతీ రాజ్ చట్టం నిర్దేశిస్తుంది. ఇప్పటిదాకా ఉన్న చట్టప్రకారం కమిషనర్ గా నియమితులైన వ్యక్తి ఐదేళ్లు పదవిలో కొనసాగవచ్చు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రెటరీ హోదాకు తక్కువ కాని వారినే కమిషనర్ గా నియమించాలి. ఒకసారి కమిషనరుగా నియమించబడిన వ్యక్తిని పదవి నుంచి తొలగించాలంటే…దానికి పెద్ద తతంగమే ఉంది. అసెంబ్లీలో అభిశంసన తీర్మానం పెట్టడం, దాన్ని కేంద్రానికి పంపడం, అక్కడ ఉభయ సభలు ఆమోదించడం… ఇవన్నీ ఉన్నాయి. అందుకే ప్రభుత్వం తొలగింపు అనే అంశం జోలికి వెళ్ళలేదు. కమిషనర్ అర్హతలను, పదవీ కాలాన్ని నిర్దేశించే పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ ను సవరించడం ద్వారా తన లక్ష్యం పూర్తి చేసుకుంది.

ఈ సవరణ ప్రకారం కమిషనర్ గా నియమించబ డాలంటే… హైకోర్టు న్యాయమూర్తి హోదాకు తగ్గని వ్యక్తిగా ఉండాలి. అదేవిధంగా పదవీ కాలాన్ని మూడేళ్లకు పరిమితం చేసింది. ఒకరు‌ ఆరేళ్లకు మించి ఉండకుండా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ఆర్డినెన్సును సిద్ధం చేసి గవర్నర్‌కు పంపింది. దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో పంచాయతీరాజ్ చట్టానికి సవరణ పూర్తి అయినట్లు అయింది. అది అమల్లోకి వచ్చింది. తాజాపరచిన చట్టం ప్రకారం చూస్తే… ఇప్పటికే మూడు ఏళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న రమేష్ కుమార్ ఆ పదవిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఎంతో వ్యూహాత్మకంగా ప్రభుత్వం తన పని పూర్తి చేసుకుంది.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. కరోనా పేరుతో ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎన్నికలు వాయిదా వేయడం, ఎన్నికల నిబంధనావళి నిరవధికంగా కొనసాగుతుందని ప్రకటించడం, దీనిపైన ప్రభుత్వం స్పందించడం తెలిసిన విషయాలే. తెలుగు దేశం పెద్దల ప్రమేయంతోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరించారని ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పైన సుప్రీం కోర్టులో కేసు వేశారు. కరోనా తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ఎన్నికలు వాయిదాను సమర్థించిన కోర్టు …నియమావళి కొనసాగింపును మాత్రం ఆమోదించలేదు. వెంటనే నియమావళిని తొలగించాలని ఆదేశించింది.

ఇదిలావుండగా..ఎన్నికలు వాయిదా పడిన తరువాత…నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్లు చెబుతున్న ఒక లేఖ పెద్ద దుమారం లేపింది. తనకు రాష్ట్రంలో భద్రత లేదని, నామినేషన్ల సందర్భంగా అధికార పార్టీ అక్రమాలకు పాల్పడలేదని కేంద్ర హోం శాఖకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసినట్టు చెబుతూ ఒక లేఖను మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే ఆయన మాత్రం తాను ఆ లేఖ రాసిందీ లేనిదీ ఇప్పటికీ చెప్పలేదు. ప్రభుత్వంపై జరుగుతున్న ప్రచారాన్ని చూస్తూ ఉండిపోయారు.

ఇంతలోనే మరో వివాదం వచ్చింది. కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ప్రతి రేషన్ కార్డుదారునికీ రూ.1000 ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. వాలంటీర్ల ద్వారా ఈ మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసింది. అయితే ఇందులో కొందరు స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులు పాల్గొన్నారంటూ కొందరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీనిపైన ఆగమేఘాలపై స్పందించిన రమేష్ కుమార్ వెంటనే నివేదిక పంపా లంటూ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కరోనా సాయం విషయంలోనూ రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలను పరిగణనలోకి‌ తీసుకుని‌ కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బాధితులకు సాయం అందించడానికి అడ్డుకోవడానికి ప్రయత్నించిన రమేష్ కుమార్ ను ఇక ఏ మాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ ఉపయోగించుకుని ఆయనపై వేటు వేసింది.

దీనిపై‌ ఆయన కోర్టుకు వెళతారా, కోర్టు ఏమి చెబుతుంది‌ అనే‌ అంశాలు ఎలావున్నా దీనిపైన రాజకీయ దుమారం మాత్రం అప్పుడే మొదలయింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని టిడిపి అంటోంది. ఇక ఏం జరుగుతుందో వేచి చూడాలి.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*