ఎన్నికల తర్వాత కూడా ఎపికి ప్రత్యేక హోదా హుళక్కే!

ఎపి ఎన్నికలు పూర్తిగా ప్రత్యేక హోదా చుట్టూ తిరగనున్నాయి. విపక్ష నేత జగన్ తో టిఆర్ఎస్ నేత కెటిఆర్ హైద్రాబాద్ లో సమావేశం కావడం ఫెడరల్ ఫ్రంట్ పై చర్చలు జరిగినా మొత్తం ఫోకస్ అంతా ఎపికి ప్రత్యేక హోదా సాధించడంపైననే సమావేశానంతరం ఇరువురు నేతల ప్రసంగాలు కేంద్రీకృతం అయ్యాయి. తమ పార్టీ ఎపికి ప్రత్యేక హోదా సాధనలో రెండవ అభిప్రాయం లేకుండా మద్దతు ఇస్తుందని కెటిఆర్ ప్రకటించారు. కొసమెరుపు ఏమంటే ముఖ్యమంత్రి కెసిఆర్ అమరావతి వచ్చి జగన్ తో మున్ముందు చర్చించడమే. అంటే ఎపి నడిబొడ్డుకు కెసిఆర్ వచ్చి ఎపికి ప్రత్యేక హోదా సాధించడంతో తాము సహకరించుతామని బహిరంగంగా చెప్ప బోతున్నారు. ఇన్నాళ్లు మోదీ కెసిఆర్ జగన్ ఒకటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వాదనకు దీటైన కౌంటర్ ఇవ్వ నున్నారు. ఇదే జరిగితే మోదీ జగన్ ఒకటనే ముఖ్యమంత్రి వాదన అంతగా పనిచేయక పోవచ్చు.

ఇదిలా వుండగా కేంద్రంలో ఏదైనా ఒక పార్టీ పూర్తి మెజారిటీ సంపాదించి అధికారం చేపట్టిన తర్వాత ఆ ప్రభుత్వం ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని భావించితే తప్ప సంకీర్ణ ప్రభుత్వాలు కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ హోదా దక్కే అవకాశాలు లేవు. సంకీర్ణంలో వుండే పార్టీలు రాహుల్ గాంధీ లాగా ఆలోచించే అవకాశం వుండదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి గాని ప్రతి పక్ష నేత గాని ఎన్ని కబుర్లు చెప్పినా కేవలం ఎన్నికల తాయిలాలు తప్ప వేరు కాదు. ఒకవేళ కెసిఆర్ ఊహించు తున్న ప్రకారం ఫెడరల్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినా అసాధ్యమే.ఒక వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు వాదన పరిగణనలోకి తీసుకున్నా కేంద్రంలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించే అవకాశాలు లేవు. జగన్ చెబుతున్నటు మూడవ ఫ్రంట్ అధికారంలోనికి వస్తే గీస్తే సంకీర్ణంలోని భాగ స్వామ్య పక్షాలు ఏకంగా ఎపికి హోదా ఇచ్చేందుకు అంగీకరించవు.

జరగాల్సి నష్టం ఎప్పుడో జరిగి పోయింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని పార్టీల నేతల స్వార్థ ప్రయోజనాలు అవశేష ఎపి ప్రజల పాలిట శాపంగా మారింది. రేపు ఎన్నికల తర్వాత కూడా ప్రత్యేక హోదా దక్కే అవకాశాలు ఏ మాత్రం లేవు. తుదకది నేతలు గెలుపు గుర్రం ఎక్కేందుకు ఒక ఉపకరణంగా మిగిలి పోయింది.

ఎన్నికల తర్వాత తాము అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని వీరతాళ్లు వేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఆ నాడు దుర్భుద్దితో ఎపిలో ఏలాగు లాభపడే అవకాశాలు లేవని తెలంగాణలో లబ్ది పొందే విధంగా విభజన బిల్లు తయారు చేసింది. ఈ కర్మకాండ రూపొందించిన కాంగ్రెస్ నేత జై రామ్ రమేశ్
ఎపికి తొలుత తీరని ద్రోహం చేశారు. ఈ సందర్భంలో పార్లమెంటులో గలాటాలు సృష్టించిన కాంగ్రెస్ యంపిలు పెప్పర్లు స్ప్రే చేయడం లాంటి పిల్ల చేష్టలతో వ్యవహరించారు. గాని విభజన ఖాయమని తెలిసి అవశేష ఎపికి అన్యాయం జరగకుండా తగు అంశాలను చట్టంలో పొందుపరిచే ప్రతిపాదనలు చేయలేదు. అందుకు ఎట్టి కృషి చేయలేదు.

మరో వేపు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న టిడిపి అథినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా తన పార్టీకి అపకారం జరగ కూడదని రెండు కళ్ల సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చినందున ఎపికి న్యాయ బద్దంగా విభజన బిల్లులో నిబంధనలు వుండాలని ఒక్క ప్రతి పాదన ఆనాటి కేంద్ర ప్రభుత్వం ముందు పెట్ట లేదు. మరో వైసిపి నేత జగన్ కూడా అంతకు మించి వ్యవహరించ లేదు.జగన్ కూడా తెలంగాణలో పార్టీని కాపాడుకొనేందుకు రోప్ డాన్స్ చేశారు.

ఆ మాటకు వస్తే రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ గాని రాజకీయేతర నేతలు గాని తుదకు ఉద్యోగ సంఘాల నేతలు ఈ అంశంలో ఏ ఒక్క ప్రతి పాదన చేయలేదు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ అని గావు కేకలు పెడుతూ సభలు సమావేశాలు నిర్వహించారు. రాజధాని కూడా లేకుండా ఏర్పడే రాష్ట్రానికి అవసరమైన చట్ట బద్ద మైన రక్షణ ఏర్పాట్లు గురించి ఒక్కరు నోరు విప్ప లేదు. ఎందుకంటే సీమాంధ్ర ప్రజలు విభజనకు వ్యతిరేకంగా వున్నందున ఏం మాట్లాడినా వేర్పాటు ముద్ర పడుతుందనే భయ పడ్డారు. . ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. ఈ మధ్యలో బిల్లు రూపకల్పన చేసిన జైరామ్ రమేష్ పని సులువు అయింది. ఎపికి ఎంత అపకారం జరగాలనో అంత చేశారు. ఈ సమయంలో ఎపి కాంగ్రెస్ నేతలు గాని టిడిపి అథినేత చంద్రబాబు గాని వైసిపి నేత జగన్ గాని ఎపికి అన్యాయం జరగకుండా విభజన బిల్లు వుండాలని ఏవైనా ప్రతి పాదనలు చేస్తే తాము రాష్ట్ర విభజనకు అనుకూలురనే ముద్ర వస్తుందని విభజనను వ్యతిరేకించే ప్రజలకు దూర మౌతామనిభావించి దీర్ఘకాలికంగా ఎపి ప్రజలకు జరిగే ద్రోహం పట్టించు కోలేదు. ప్రధానంగా హైదరాబాద్ తెలంగాణకు పోతున్నందున అందుకు తగిన ఆదాయం బిల్లులో చట్ట బద్దంగా పొందు పర్చ లేదు.

మరో వేపు రాష్ట్రం విభజించిన కాంగ్రెస్ దానికి సహకరించిన బిజెపి రెండు పార్టీలు తెలంగాణ పైననే ఆశలు పెంచు కున్నందున జరగాల్సిన నష్టం జరిగి పోయింది.
అయితే లోక్ సభ సమావేశాల సందర్భంగా నోరు విప్ప లేని వెంకయ్యనాయుడు రాజ్యసభ సమావేశంలో దింపుడు కళ్లం ఆశగా కృషి చేసి నందున ప్రత్యేక హోదా తెర మీదకు వచ్చింది.

అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో ఆమోదించి ప్లానింగ్ కమిషన్ కు పంపగా అక్కడ పది నెలల కాలం పెండింగ్ లో వుండి పోయింది. పది నెలలు కాలం గడిపిన ప్రధాని మోదీ కమిషన్ ను రద్దు చేసినపుడే హోదా కు మంగళం పాడటం జరిగింది. . ఈ సమయంలోనే ప్రత్యేక హోదా ఇక అసాధ్యమనే విషయం ముఖ్యమంత్రి కి బోధ పడలేదని ఏలా నమ్మగలం? అందుకే ముఖ్యమంత్రి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు.ఈ దుర్మార్గంలో ఎపికి జరిగిన అన్యాయంలో ప్రధాని
మోదీకి ఎంత బాధ్యత వుందో ముఖ్యమంత్రికి సమాన బాధ్యత వుంది.

ఇదిలా వుండగా రాహుల్ గాంధీ తను అధికారంలోనికి వస్తే తొలి సంతకం ఇదే నని చెబుతున్నారు. కాంగ్రెసు పూర్తి మెజారిటీ సంపాదించితే తప్ప సంకీర్ణ ప్రభుత్వంలో ఇచ్చే అవకాశం లేదు. సంకీర్ణంలో ఎవరి దారి వారిది గా వుంటుంది. కర్నాటక లో ముఖ్యమంత్రి కుమారస్వామి అవస్థలు చూస్తే ఎవరికైనా జాలి కలుగు తుంది. ఒకవేళ కేంద్రంలో రాహుల్ గాంధీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి తొలి సంతకం చేసినా మన ముఖ్యమంత్రి బెల్టు షాపులు రద్దు పై చేసినతొలి సంతకానికి మించి ఫలితం వుండదు. అసలు ఈ సంకీర్ణ ప్రభుత్వాలు ఎంత కాలం వుంటాయో చెప్ప లేము. ప్రస్తుత పరిణామాలు పరిశీలించితే కాంగ్రెస్ పూర్తి మెజారిటీ మరచిపోదాం. తుదకు రాహుల్ గాంధీ ప్రధాని గా ప్రభుత్వం ఏర్పాటు జరిగే అవకాశాలు ఏమాత్రం లేవు.

కర్నాటక లాగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ వచ్చు. ఆలాంటి ప్రభుత్వంలో హోదా మరచి పోవలసినదే. ఒకవేళ బిజెపి కూటమి అధికారంలోకి వస్తే ఇక ఇంతే సంగతులు.

ఒకవేళ వైసిపి రాష్ట్రంలో అధికారంలోనికి వచ్చి పార్లమెంటు స్థానాలు ఎక్కువ గెలుచు కొన్నా కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడినా లేక సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా వున్నా ఎపికి ప్రత్యేక హోదా సాధించే అవకాశాలు లేవు.

ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ బాగు కోసం పోటిపడతాయి. ఎన్నికల ముందు మాత్రం అందరూ తియ్యగా మాట్లాడుతారు. అటు టీడీపీ ఇటు వైసిపి కేంద్రంలో ఏర్పడే ఏ సంకీర్ణ ప్రభుత్వంలో చేరినా మిగిలిన ఏఏ రాష్ట్రాలు అందులో వుంటాయో ఇపుడే చెప్ప లేము. ఆ రాష్ట్రాల వైఖరి ఏలా వుంటుందో. గతంలోనే బాగా అభివృద్ధి చెందిన తమిళ నాడు ఎపి కి హోదా ఇస్తే తమ రాష్ట్రంనుండి పరిశ్రమలు తరలి వెళ్ల తాయని అభ్యంతరం పెట్టిన సందర్భం వుంది. తమిళ నాడు అభ్యంతరం పెట్టి నపుడు అంత కన్నా వెనుకబడిన బీహార్ లాంటి రాష్ట్రాలు మిన్న కుంటాయా? ఎపికి హోదా వచ్చి వుంటే రాష్ట్రం ఏర్పాటు జరిగిన రోజుల్లోనే వచ్చి వుండాలి. ఇక వచ్చే అవకాశాలు అంతగా లేవు – లేవు. కాకుంటే ప్రజలను బుట్టలో వేసుకొనేందుకు నేతలు దీనిని సజీవంగా వుంచు తున్నారు. విచాకర మైన అంశమేమంటే రాజకీయాలకు సంబంధం లేని కొందరు మేధావులు కూడా రాజకీయ పార్టీల జూదంలో పావుగా మిగిలిన హోదా పై ఇంకా ఆశలు పెంచు కోవడమే.

– వి. శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*