ఎపి ప్రజల తీర్పు భవిష్యత్తుకు గుణపాఠం అవుతుందా?

ఎన్నికలు జరిగి రోజులు గడిచే కొద్ది వైసిపి మౌన ముద్ర వహిస్తోంది. కారణం గెలుపొందుతామనే ధీమా కావచ్చు. లేదా ఓటమి ముందు విర్ర వీగడమెందుకని మౌనం వహించుతుండ వచ్చు. కానీ టిడిపి నేతలు మొన్నటి వరకు మౌనం పాటించుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో మాత్రం పొట్రుపాటు కనిపిస్తోంది. భవిష్యత్తు మీద ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో టిడిపి గెలుపొందుతుందని చెప్పేందుకు నానా తంటాలు పడుతున్నారు. సమీక్షలు మీద సమీక్షలు నిర్వహించుతున్నారు.

ఇది కూడా అంత వరకైతే ఫర్వా లేదు. సమీక్షా సమావేశాల అనంతరం ముఖ్యమంత్రి గానీ టిడిపి నేతలు గానీ గెలుపుకు ఇస్తున్న వివరణ వింటుంటే ఎవరికైనా ఆశ్చర్యం వేయక మానదు. 2014 నుండి అయిదు ఏళ్ల కాలంలో టిడిపి ప్రభుత్వం అమలు జరిపిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఏవీ టిడిపి గెలుపుకు కారణంగా ఎవ్వరూ పేర్కొనడం లేదు. అద్భుతమైన అమరావతి ఎపి జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఇవేవీ ఓట్లు రాల్చు తాయని ఒక్కరూ చెప్పడం లేదు. వాటి ఊసే ప్రకటనలో ప్రస్తావించడం లేదు.

ముఖ్యమంత్రి పాద యాత్ర సందర్భంగానూ 2014 ఎన్నికల్లోనూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో సంతకాలు చేసిన ముఖ్యమైన అంశాలు సోదెలోనికే తీసుకు రావడం లేదు.
కేవలం ఎన్నికల ముందు అమలు చేసిన పసుపు కుంకుమ ప్రముఖంగా ప్రస్తావించుతున్నారు. పాదయాత్ర సందర్భంగా డ్వాక్రా రుణాలు అన్ని రద్దు చేస్తానని చేసిన వాగ్దానం ఎపిలోని మహిళలు మరచి పోయారని వడ్డీ లేని రుణాలు ఎగ్గొట్టడం కూడా గుర్తులో లేదని కేవలం ఎన్నికల ముందు ఇచ్చిన పసుపు కుంకుమ చెక్కులు మాత్రం మహిళలు గుర్తు వుంచు కొని తమను గెలిపించుతారని టిడిపి నేతలే కాదు- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా భావిస్తున్నారు.

అదే విధంగా తాను అధికారంలోకి వస్తే బ్యాంకుల్లో వుండే తాకట్టు నగలు ఇంటి పెద్ద కొడుకుగా వుండి విడిపించుతానని చేసిన వాగ్దానం గాలికి పోయిన అంశం మహిళలు మరచి పోయారని ముఖ్య మంత్రి భావిస్తున్నారు. రైతులు చెల్లించాలసిన మొత్తం రుణాలు రద్దు చేస్తామని చేసిన వాగ్దానం శంకరగిరి మాన్యాలు పట్టిన అంశం రైతు కుటుంబాల్లోని మహిళలు మరచి పోయి కేవలం అతి కొద్ది మందికి అందిన పసుపు కుంకుమతోనే గెలుపొందు తాయని దివాకర్ రెడ్డి లాంటి వారే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నమ్మి హైలైట్ చేస్తున్నారంటే పెట్టుబడిదారీ సమాజంలో బూర్జువా రాజకీయ నేతల తీరు ఇంత కన్నా వేరుగా వుండక పోవచ్చు.

కాని అసలు సమస్య ఏమంటే అయిదు సంవత్సరాల పరిపాలన గురించి కించిత్ ఆలోచించ కుండా అంతకాలం చేసిన భారీ వాగ్దానాలు పక్కన పెట్టి అదీ ఎన్నికల నెల రోజుల ముందు అమలు చేసిన పథకాలతోనే ఈ రోజు టిడిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలుపొందితే ఎంత చెడ్డా ఈ వ్యవస్థలో అదొక రికార్డుగానే వుండ బోతోంది.

ఒక వేళ రేపు ఎపిలో టిడిపి గెలుపొంది తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోనికి వస్తే భవిష్యత్తులో భారత దేశంలో ఏ రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ అధికారం చేపట్టిన పార్టీలు అయిదు ఏళ్లు తమ ఇష్టారాజ్యంగా పరి పాలన చేసు కోవచ్చు. ఎన్నికల వున్నాయనగా నాలుగు సంక్షేమ పథకాలు అమలు జరిపి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసి అధికారానికి రావచ్చు. మన కళ్ల ముందే ఎపిలో ఇంత నగ్నంగా అనుభవం వుండగా రెండవ అభిప్రాయానికే చోటు లేదు.

మరీ ఇంత పచ్చిగా ఏలా చెబుతున్నానంటే గత కొద్ది రోజులుగా టిడిపి నేతలే కాదు
తుదకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తను పసుపు కుంకుమ ఇచ్చిన 90 వేల మంది తనను గెలిపించు తారని అన్నీ ప్రజాస్వామ్య విలువలు వదలి పెట్టి చెబుతుంటే మనం నమ్మ లేదంటే ఎవరు పిచ్చి వాళ్ళు?
అద్భుత రాజధాని పోలవరం ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క ముక్క చెబుతున్నారా?

ఎంత సేపు పసుపు కుంకుమ తీసుకున్న మహిళల గురించి మాత్రమే ముఖ్యమంత్రి చెబుతున్నందున ఎవరైనా సరే అంతే కచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిట్కాలు భవిష్యత్తుకు మార్గ దర్శకంగా వుంటాయని చెప్పవచ్చు.

ఒక వేళ రేపు ఎపిలో ఎన్నికల ఫలితాలు టిడిపి కి వ్యతిరేకంగా వస్తే మాత్రం ఇలాంటి పయోముఖ విష కుంభాలకు భవిష్యత్తులో భారత దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చోటు లభించిందని కూడా కచ్చితంగా చెప్ప వచ్చు. చూద్దాం. ప్రజాతీర్పు ఏలా వుంటుందో.

– వి. శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*