ఎర్ర కణాలు జాగృతమయ్యాయ్‌! ఇక ఆపడం ఎవరి తరం!!

– ఆదిమూలం శేఖర్‌, తిరుపతి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) – సిపిఎం అఖిల భారత మహాసభలు, ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణలో అత్యంత ఉత్తేజపూరిత వాతావరణంలో జరిగాయి. చివరి రోజు నిర్వహించిన బహిరంగ సభ అజరామరంగా జరిగింది. ఎర్ర సైనికుల కవాతు బహిరంగ సభకు హైలెట్‌గా నిలిచింది. సిపిఎం అనేక మహాసభలు నిర్వహించుకుంది. అయితే…హైదరాబాద్‌లో నిర్వహించిన 22వ మహాసభ చాలా చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. సిపిఎం శ్రేణులే కాదు…యావత్‌ భారత దేశ ప్రజలు ఆసక్తికరంగా మహాసభలను గమనించారు. ఆ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలుసుకునేందుకు ఆసక్తిచూపారు. తెలుగు ఛానళ్లు గతంలో ఎన్నడూ లేనంతగా సిపిఎంపై చర్చలు చేపట్టాయి. సిపిఎం గురించి మాత్రమే కాకుండా…వామపక్ష ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీల నిర్మాణం వంటి అంశాలపైన చర్చోపచర్చలు చేశాయి. సభలు ముగిసిన రెండో రోజు కూడా ప్రత్యేక కథనాలు రూపొందించాయి. ఇక మహాసభల వార్తలకు ఈనాడు వంటి పత్రిక గతంలో ఎన్నడూ ఇవ్వనంత ప్రాధాన్యత ఇచ్చి ప్రచురించింది. ఇవన్నీ సిపిఎం శ్రేణులకు, వామపక్ష అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. సిపిఎం కార్యకర్తల్లో, నేతల్లో నూతనోత్తేజాన్ని నింపాయి.

సిపిఎం, వామపక్ష పార్టీల గురించి జరిగిన చర్చల్లో…రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కమ్యూనిస్టు పార్టీలు క్రమంగా ప్రాభవం కోల్పోతున్నాయన్నది మొదటిదైతే….కమ్యూనిస్టు భావజాలం ఎప్పటికీ ప్రాధాన్యత కోల్పోదనేది రెండోది. వామపక్షాల్లో ఉన్నవారు కూడా స్థూలంగా ఈ రెండు అభిప్రాయాలతో ఏకీభవించాల్సిందే. ఒకప్పుడు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులే. ఒక దశలో అధికారంలోకి వస్తారన్నంత ఊపు వచ్చింది. ఆ తరువాత కమ్యూనిస్టు పార్టీ అనేక ముక్కలుగా విడిపోవడం; సిపిఎం, సిపిఐ మాత్రమే కాస్త బలమైన పార్టీలుగా ఆవిర్భవించడం తెలిసిన విషయాలే. మరీ ఇటీవల కాలంలో అంటే బెంగాల్‌లో, త్రిపురలో వామపక్ష ప్రభుత్వాలు అధికారం కోల్పోయిన తరువాత…వామపక్షాలు ప్రాభవం కోల్పోతున్నాయన్న భావన జనంలో పెరిగింది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారం కోల్పోడానికి అనేక కారణాలున్నాయి. వాటి జోలికి ఇప్పుడు వెళ్లడం లేదు. వాస్తవంగా అక్కడ జరిగిన లోటుపాట్లను వామపక్షాలు విశ్లేషించుకున్నాయి. సరిదిద్దుకుంటున్నాయి.

వామపక్షాలు ప్రాభవం కోల్పోతున్నాయని, ప్రజలకు దూరమవుతున్నాయని… ఇలా తీవ్రస్థాయిలో ఒక అభిప్రాయం ప్రబలుతున్న తరుణంలో జరిగిన సిపిఎం మహాసభ ఇంతగా విజయవంతమవడం కొందరికి ఆశ్చర్యం కలిగించొచ్చు. సిపిఎంలోనూ, వామపక్ష ఉద్యమాల్లోనూ పని చేస్తున్నవారికి, దగ్గరగా చూస్తున్నవారికి తెలుసు… మహాసభలు ఎందుకు ఇంత గొప్పగా విజయవంతమయ్యాయో. కమ్యూనిస్టు పార్టీలు నిర్మితమయ్యేది…ఏదో కులం ప్రాతిపదికనో, మతం ప్రాతిపదికనో, ప్రాంతం ప్రాతిపదికనో కాదు. డబ్బు బలంతో అంతకన్నా కాదు. సిద్ధాంత బలంతో. ఈ సిద్ధాంతబలం ఎంత పటిష్టమైనదో బయటివారికి అర్థంకాకపోవచ్చు. ఒక సిద్దాంతానికి ఉన్న విలువ, గొప్పదనం సాధారణ పరిస్థితుల్లో అంతగా అర్థంకాదు. సాపేక్షంగా చూడటానికి అవకాశాలు ఏర్పడినపుడు కచ్చితంగా…దాని బలం ఏమిటో, ప్రాధాన్యత ఏమిటో, గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే. బిజెపి అధికారంలోకి వచ్చాక…కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఉన్న బలం వెల్లడవుతోంది. పెద్దపెద్ద పార్టీలు దేశంలో ఉన్నా బిజెపిని వామపక్షాలు మాత్రమే ఎదుర్కోగలుగుతున్నాయంటే… దానికి సిద్ధాంత పునాదులేకారణం.

అత్యంత ప్రమాదకర సిద్ధాంతం (ఇది ఊరికే చెబుతున్న మాట కాదు. మనుషుల మధ్య చిచ్చుపెట్టే సిద్ధాంతం) పునాదిగా కలిగిన బిజెపి….తన మొదటి దాడిని కమ్యూనిస్టులపైనే మొదలుపెట్టింది. దళితులపైన దాడి చేస్తోంది. మైనారిటీలపైన దాడికి పూనుకుంటోంది. ఇప్పటి దాకా ఉన్న విలువలకు, ప్రజాస్వామ్య సంప్రదాయాలకు సవాలు విసురుతోంది. ఇవన్నీ…కమ్యూనిస్టులనే కాదు, ప్రజాతంత్ర లౌకిక శక్తుల్లో తీవ్రమైన కదలిక తెచ్చాయి. ఎప్పుడో కమ్యూనిస్టు పార్టీల్లో పనిచేసి, ఆ తరువాత ఏదో కారణాల వల్ల పార్టీలకు దూరమైన వారు కూడా, తమకు తాము మళ్లీ ఎర్రజెండా ఎత్తుకోడానికి దోహదం చేసింది. ఎర్ర కణాలు జాగృతమై….సమరశంఖం పూరించేందుకు పురిగొల్పింది. దళితులు, కమ్యూనిస్టులు, మైనారిటీలు, బహుజనలు ఐక్యమవ్వాల్సిన అవసరం ఏమిటో కూడా ఈ కాలంలోనే ఆచరణలో తెలియవచ్చింది.

గతంలో అనేక మహాసభల సందర్భంగానూ బహిరంగ సభలు, ప్రదర్శనలు జరిగినా….సిపిఎం కార్యకర్తల్లో ఎన్నడూ కనిపించనంత కసి, ఉద్వేగం హైదరాబాద్‌లో కనిపించాయి. ఇప్పుడు ఎక్కడ కమ్యూనిస్టు సభలు జరిగినా ఇటువంటి అరుణకాంతులే కార్యకర్తల ముఖాల్లో కనిపిస్తున్నాయి. ఈ ఉత్తేజం ఊరికేపోదు….హైదరాబాద్‌ బహిరంగ సభలో తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పినట్లు…ఎర్రచొక్కా వాలంటీర్ల కవాతులో….కనిపించిన యువత వంటి కార్యకర్తలు రానున్న రాజుల్లో కమ్యూనిస్టు పార్టీలకు విప్లవ సైనికుల్లా పరిణామం చెందునున్నారు. అప్పుడు ఎర్రజెండా ఢిల్లీలో ఎర్రకోటపైన రెపరెపలాడుతుంది. ఇదే హైదరాబాద్‌ మహాసభలు వామపక్ష కార్యకర్తలకు ఇచ్చిన ఉత్తేజం. ఉత్సాహం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*