ఎవ‌రు ఎక్కుపెట్టిన తుపాకీ రమణ దీక్షతులు?

ఒక వైపు దేశ ప్రజలంతా కర్నాకట ఫలితాల ఉత్కంఠలో ఉండగా, మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్‌ రమణ దీక్షితులు చెన్నైలో మీడియా సమావేశం నిర్విహించి చేసిన విమర్శలు, ఆరోపణలు డైనమైట్లులా పేలుతున్నాయి. ఎన్నికల ఫలితాల హడావుడిలో రమణ దీక్షతులు వార్తకు మీడియా పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదుగానీ… రేపటి నుంచి ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారబోతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామివారికి జరగాల్సిన కైంకర్యాల విషయంలోనూ అధికారులు పెత్తనం చేస్తున్నారు, తుతుమంత్రంగా ముగింపజేస్తున్నారన విమర్శించారు. శ్రీవారికి శాతాబ్దాల తరబడి భక్తులు సమర్పించిన ఆభరణాలకు లెక్కలు ఉన్నాయా అని ప్రశ్నించారు. వాటి భద్రతపైన అనుమానాలు వ్యక్తం చేశారు. అవి ఉన్నాయో లేవో ప్రధాన అర్చకుడినైన తనకే తెలియదని వ్యాఖ్యానించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు సౌకర్యాల పేరుతో పురాత కట్టడాలను కూల్చేస్తున్నారని చెప్పారు. ఆలయం లోపల ధ్వసం చేస్తున్నారని అన్నారు. ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు పరిశీలించాలనుకుంటే రాజకీయ రాద్ధాంతంతో అడ్డుకున్నారని అన్నారు. పురావస్తు శాఖ అధికారులు పరిశీలించివుంటే రహస్యాలు బయటపడేవని చెప్పారు. తిరుమల ఆలయ కట్టడాల సంరక్షణ బాధ్యతను పురావస్తు శాఖకు అప్పగించాలని కోరారు. తిరుమల ఆలయ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వమే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఆయన డిమాండ్‌ చేశారు. టిటిడి వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు చేయించాలని కూడా ఆయన కోరారు.

రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలు సాదాసీదా అంశాలు కావు. ఇందులో రాష్ట్రాన్ని కుదిపేసే అంశాలూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పడేసే విషయాలూ దాగివున్నాయి. ఇక్కడే…కొద్దరోజుల వెనక్కివెళ్లి జరిగిన పరిణామాలను విశ్లేషించాలి. తిరుమల సహా టిటిడి ఆధ్వర్యంలోని ఆలయాలను పరిశీలించడానికి తమ అధికారులకు అనుమతి ఇవ్వాలని పురావస్తు శాఖ ఉన్నతాధికారుల నుంచి టిటిడికి ఓ లేఖ అందింది. పురాతన ఆభరణాల విషయంలోనూ భక్తుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే…దీనిపై ప్రభుత్వ అనుకూల మీడియా పెద్ద దుమారం రేపింది. టిటిడి ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చూస్తోందని ప్రచారం చేసింది. దీనిపైన అలజడి మొదలయింది. ఇదంతా బిజెపికి ప్రతికూలంగా మారుతుండటంతో హడావుడిగా ఆ లేఖను వెనక్కి తీసుకుంటున్నట్లు పురావస్తు శాఖ అధికాలు ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ రమణదీక్షితులు ప్రెస్‌మీట్‌ విషయానికొస్తే….అప్పుడే పురావస్తు శాఖ అధికారి లేఖలో పేర్కొన్న అంశాలనే రమణ దీక్షితులు మాట్లాడారు. తిరుమల ఆలయానికి ఎలాంటి ముప్పూలేదని, అక్కడి పురాతన కట్టడానికి ఎలాంటి హానీ కలించగడం లేదని మీడియా ద్వారా చెప్పించారు అధికారులు. తీరా ఇప్పుడు ఆయల ప్రధాన అర్చకుడే వెయ్యేళ్లనాటి నిర్మాణాలనూ తొలగించారని ఆరోపిస్తున్నారు. శ్రీవారి ఆలయం భద్రంగా భావితరాలకు అందాలంటే…పురావస్తు శాఖ ఆధీనంలోనే ఉండాలని అభిప్రాయపడ్డారు. లేదంటే ‘గతంలో ఇక్కడ శ్రీవారి ఆలయం ఉండేది…అని చెప్పుకోవాల్సివస్తుంది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఆ లేఖలో లేవనెత్తినట్లు శ్రీవారి ఆభరణాల భద్రతపైనా దీక్షితులు అనుమనాలు వ్యక్తం చేస్తున్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వ అధికారుల సమక్షంలో, భక్తుల సమక్షంలో బహిరంగంగా లెక్కించాలని కోరారు. ఇది అసాధారణ డిమాండ్‌. ఇదే జరిగితే అనేక రహస్యాలు బట్టబయలవుతాయి.

రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలు ప్రభుత్వాన్ని కుదిపేసేవిగానూ ఉన్నాయి. దీక్షితులు వెనుక బిజెపి ఉందా అనే అనుమానాలూ వస్తున్నాయి. స్వయంగా ఆలయ ప్రధాన అర్చుకుని ద్వారా ఆరోపణలు, విమర్శలు చేయించడం ద్వారా దేశ వ్యాపితంగా ఈ అంశాన్ని చర్చనీయాంశం చేసే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకో ముఖ్య విషయం ఏమంటే… చెన్నై మీడియా సమావేశం సందర్భంగా ‘ ఈ సమావేశం మీరు నిర్వహించినట్లు రాయాలా…బిజెపి వాళ్లు ఏర్పాటు చేసినట్లు రాయాలా’ అని విలేకరులు ప్రశ్నించారు. అంటే అక్కడికి బిజెపి నాయకులు వచ్చారన్నమాట. ఇదంతా చూస్తుంటే రమణ దీక్షితులు వెనుక బలమైన శక్తులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తిరుమలలో, టిటిడిలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రధాన మంత్రికి, రాష్ట్రపతికి, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. అవసరమైతే నేరుగా వెళ్లి కలుస్తామని కూడా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సిబిఐ విచారణ వంటిది వేస్తే టిటిడిలో జరుగుతున్న, జరిగిన అనేక వ్యవహారాలు బట్టబయలవుతాయి. చాలామంది ప్రభుత్వ పెద్దలు కూడా దోషులుగా నిలబడాల్సివస్తుందేమో. ఇవన్నీ గమనించాక…’రాష్ట్ర ప్రభుత్వంపైకి బిజెపి ఎక్కుపెట్టిన తుపాకి రమణ దీక్షితులు’ అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకటిమాత్రం వాస్తవం…ఏదో ఒకటి తేల్చుకోవాలన్న తెగింపుతోనే రమణ దీక్షితులు మీడియా ముందుకు వచ్చారు. సమీప భవిష్యత్తులో తిరుపతిలో ఏమి జరగబోతోందో చూడాల్సిందే.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*