ఏకగ్రీవాలతో వైసిపి శ్రేణుల్లో నిరుత్సాహం..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపికి పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలయ్యాయి. ఇది అగ్ర నాయకులకు, ఏకగ్రీవం అయినవారికి సంతోషం కలిగించవచ్చుగానీ…కింది స్థాయి కార్యకర్తల్లో మాత్రం తీవ్ర నిరుత్సాహం నెలకొంటోంది.

ఏకగ్రీవంగా గెలిచినా కార్యకర్తలకు నిరుత్సాహం ఎందుకన్న ప్రశ్న రావచ్చు…! ఎన్నికల్లో టిడిపిని ఎదుర్కోడానికి వైసిపి కార్తకర్తలు ఎంతో ఉత్సాహంగా సిద్ధమయ్యారు. ఆస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. అధికారంలో ఉండటంతో మరింత ఉత్సాహంగా కదనరంగంలోకి దిగడానికి రెడీ అయ్యారు.

అయితే…వైసిపి నాయకులు‌ అయా ప్రాంతాల్లోని‌ తెలుగుదేశం నేతలతో మంతనాలు జరిపి, లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుని, పోటీలో ఉన్న టిడిపి అభ్యర్థులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చి పోటీ నుంచి విరమింపజేశారు. ఇది కింది స్థాయి కార్యకర్తల ఆభీష్టానికి వ్యతిరేకంగా జరిగింది. తాము ప్రత్యర్థులుగా భావించి పోరాటానికి సిద్ధమైతే…వారితోనే ఒప్పందం కుదుర్చుకోవటం ఏమిటని వైసిపి కార్యకర్తలు‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోటీ చేసి సునాయాసంగా గెలవగలిగిన చోట కూడా ప్రత్యర్థితో రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

రాజకీయాలంటే పోరాటం. కార్యకర్తలు సైనికుల్లాంటి వారు. వారిలో పోరాట స్ఫూర్తి ఉంటేనే పోరాడగలరు. సైనికులు యుద్ధానికి సై అంటున్న సమయంలో….రాజు శత్రువుతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటే…. సైనికులు నీరుగారిపోతారు. ఇంకోసారి యుద్ధమంటే నిర్లిప్తంగా ఉండిపోతారు. ఇప్పుడు ‌వైసిపి కార్యకర్తల విషయంలో జరుగుతున్నది ఇదే.

ఈ పరిస్థితిని వైసిపి నాయకత్వం ఎలా విశ్లేషించుకుంటుందో గానీ…ఏకగ్రీవాలతో లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని చెప్పక తప్పదు. దౌర్జన్యంతో ఏకగ్రీవం చేసుకున్నారన్న చెడ్డ పేరుకంటే…సొంత పార్టీ శ్రేణుల్లో చోటుచేసుకున్న నైరాశ్యం వైసిపికి నష్టం కలిగించబోతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*