ఏడాదికి ఒక్కసారే శ్రీవారి దర్శనం…. సాధ్యమా…ధర్మమా…!

తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి టిటిడి పూర్వ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావు ఒక పత్రికలో రాసిన వ్యాసంలో తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. టిటిడి ధర్మకర్తల మండలి సభ్యల సంఖ్యను పెంచడం, శ్రీవాణి ట్రస్టు పేరుతో బ్రేక్‌ దర్శనం టికెట్టును రూ.10 వేలు చేయడం, సాధారణ భక్తులు దర్శనం కల్పించడం తదితర అంశాలపై నిర్ధిష్టమైన అభిప్రాయాలను చెబుతూ పలు సూచనలు చేశారు.

తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శనాన్ని ఏడాదికి ఒక్కసారి మాత్రమే కల్పించేలా మార్పులు చేయాలన్నది ఆయన ప్రధానమైన సూచన. ఇప్పుడు రోజుకు 70 వేల మందికి దర్శనం చేయిస్తున్నారు. ఇందుకోసం ఆలయాన్ని రాత్రిపూట ఆలస్యంగా మూయడం, స్వామివారి కైంకర్యాల సమయం కుదించడం వంటివి చేస్తున్నారు. ఇవన్నీ నియమాల ప్రకారం నిర్వహించి….ఒక్కో భక్తునికి కనీసం మూడు సెకన్ల పాటైనా దర్శనం కల్పించాలంటే…..రోజుకు 20 వేల మందికి మాత్రమే అవకాశం కల్పించాలి. ఇలా చేయాలంటే విఐపిల నుంచి సాధారణ భక్తుల దాకా ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శన భాగ్యం కల్పించాలి. తిరుమలకు రోజుకు 20 వేల మందికి మించి అనుమతించకూడదు – ఇదీ ఆయన చేసిన సూచన.

ఇటువంటి ప్రతిపాదన గతంలోనూ వచ్చింది. దీనిపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. దేవుని దర్శనంపై ఆంక్షలు విధించడానికి మీరెవరు అంటూ టిటిడిపైన శ్రీవారి భక్తులు విరుచుకుపడిన సందర్భాలున్నాయి. ఇటువంటి ప్రతిపాదనే ఐవైఆర్‌ కృష్ణారావు మళ్లీ ముందుకు తెచ్చారు. దేశంలోని ఏ హిందూ ఆలయంలోనైనా ఇటువంటి ఆక్షలు ఉన్నాయా అనేది ప్రశ్న. ఓపిక ఉన్న భక్తులు ఎన్నిసార్లు స్వామిని దర్శించుకున్నా అభ్యంతర పెట్టడానికి వీల్లేదు. ఇంకా విఐపిల పేరుతో వచ్చి, దర్శనం చేసుకుంటున్న వారికి ఇటువంటి ఆంక్షలు పెట్టవచ్చునేమోగానీ…సాధారణ భక్తులకు ఆంక్షలు పెడితే టిటిడి, ప్రభుత్వం విమర్శపాలవడం ఖాయం.

ఇదే వ్యాసంలో ఆయన…ఇటీవల ప్రవేశపెట్టిన శ్రీవాణి ట్రస్టు గురించి నిర్మొహమాటంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీవారి ఆలయాల నిర్మాణం పేరుతో ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేసి, విరాళాలు వసూలు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే స్వామివారి ఆలయాల నిర్మాణానికి నిధులకు కొరత లేదని, అయితే ఆలయాల నిర్మాణానికి అవసరమైన ఇంజినీరింగ్‌ యంత్రాంగం టిటిడి వద్ద లేదని, అదేవిధంగా మొక్కుబడిగా ఆలయాలను నిర్మించడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఆదరణ ఉండదని చెప్పుకొచ్చారు. ఇవన్నీ వాస్తవమే. శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిధుకు కొరత లేదు. ప్రత్యేకంగా ట్రస్టు ఏర్పాటు చేయాల్సిన పని లేదు. ఇప్పటికే టిటిడి చేపట్టిన ఆలయ నిర్మాణ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తే సరిపోతుంది. శ్రీవారి ట్రస్టు పేరుతో రూ.10 వేలు విరాళాలు వసూలు చేయడం వల్ల చెడ్డపేరు తప్ప టిటిడికి ఒరిగిందేమీ లేదు.

వైవి సుబ్బారెడ్డి ఛైర్మన్‌ అయిన తరువాత ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 3 దర్శనాల పద్ధతిని రద్దు చేయడాన్ని ఐవైఆర్‌ అభినందించారు. అయితే…విఐపిలకు ఇస్తున్న బ్రేక్‌ దర్శనం టికెట్ల వివరాలను పారదర్శకత తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. టిటిడి బోర్డు సభ్యులుగా నియమితులవుతున్న వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు… దర్శనాలు చేయించి, తమ వ్యాపార లావాదేవాలను చక్కబెట్టుకుంటున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలో వాస్తవముంది. దళారుల్లాగా బోర్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు దర్శనం టికెట్లను అమ్ముకో పోవచ్చుగానీ….తమ పలుకుబడిని ఉపయోగించి దర్శనాలు చేయించి, వ్యాపారాలను చక్కబెట్టు కుంటున్నారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. దీన్ని ఎలాగూ ఆపలేం కాబట్టి…కనీసం కేటాయిస్తున్న టికెట్ల వివరాలను బహిర్గతం చేయగలిగితే…కొంతవరకైనా బ్రేక్‌పడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి, టిటిడి పాలక మండలి, ఉన్నతాధికారులు ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*