ఏడుకొండలవాడా, ఇదేమి ధర్మం….సంగం మంది కార్మికులకు అన్యాయం..!

తమ వేతనాలు పెరుగుతాయని కొండంత ఆశతో ఎదురుచూస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు తీవ్ర నిరాశను మిగిల్చింది టిటిడి. ఊరించి ఊరించి పెంచిన వేతనం అరాకొరే అయినా…అందులోనూ సగం మంది కార్మికులకు అన్యాయం చేసింది. ప్రధానంగా అట్టడుగుస్థాయిలో ఉన్న సులభ్‌ కార్మికులకూ కడుపుమంటనే మిల్చింది.

టిటిడిలో 14 వేల మందికిపైగా అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులున్నారు. కార్మికుల సరాసరి వేతనం 7,500 మించడం లేదు. ఈ వేతనంతో కుటుంబాలను పోషించలేక సతమతమవుతున్నారు. కాస్తయినా వేతనాలు పెంచండి మొర్రో అని ఏళ్ల తరబడి అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇదిగో అదిగో అంటూ వస్తున్న టిటిడి…ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. వేతనాలు పెంచాలని నిర్ణయించింది. అందరినీ అన్‌ స్కిల్డ్‌, సెమీ స్కిల్డ్‌, అన్‌ స్కిల్డ్‌ అనే మూడు కేటరిగీల కింది విభజించారు. అన్‌ స్కిల్డ్‌ కార్మికులకు రూ.7,500 నుంచి గ్రేడ్ల వారీగా రూ.10,000, 10,500, రూ.11,000 చేశారు. స్కిల్డ్‌ ఉద్యోగులకు రూ.9,500 నుండి రూ.11,000, రూ.11,500, రూ.12,000 చేశారు. ఇక నైపుణ్యత అవసరమైన సిల్డ్‌ ఉద్యోగులకు రూ.11,000 నుండి రూ.12,000, రూ.12,500, రూ.13,000 చేశారు.

ఇది అరాకొరా పెంపుదలే అయినప్పటికీ….ఇది కూడా అందరికీ వర్తింపజేయలేదు. సొసైటీల్లో ఉన్నవారికి, టిటిడితో నేరుగా కాంట్రాక్టులో ఉన్నవారికి మాత్రమే వర్తింపజేశారు. ఇక పారిశుధ్య పనుల్లో ఉన్న సులభ్‌ కార్మికులకు, కాటేజీలు నిర్వహణలో ఉన్న ఎఫ్‌ఎంఎస్‌ సిబ్బందికి ఈ పెంపుదల వర్తించదని తేల్చాశారు. ఆ కార్మికులంతా వర్క్‌ కాంట్రాక్టు కింద ఉన్నారు కాబట్టి…వేతనాలు పెంచలేదని ఈవో చెప్పారు.

కాంట్ట్రారు కింద పని చేస్తున్నా, నేరుగా టిటిడితో అగ్రిమెంట్‌ చేసుకుని పని చేస్తున్నా…ఎవరైనా బతకాలంటే కనీస వేతనం ఉండాలి. ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు సరిపోవడం లేదనే పెంచాలని నిర్ణయించారు. సులభ్‌, ఎఫ్‌ఎంఎస్‌లో పని చేస్తున్న వారికి వేతనాల పెంపుదల వర్తించదని చెప్పడంలో ఎలాంటి ఔచిత్యమూ లేదు. వీళ్లు మాత్రం కార్మికులు కాదా? ఆ కాంట్ట్రారు ఇచ్చే వేతనాలు ఎలా సరిపోతాయి? అని అధికారులుగానీ, బోర్డు సభ్యులుగానీ ఆలోచించినట్లు లేదు. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే…అత్యంత దిగువస్థాయిలో పని చేస్తున్న సులభ్‌, ఎంఎంఎస్‌ ఉద్యోగులకు వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి….టెక్నికల్‌ కారణాలు చూపుతూ వేతనాలు పెంచలేదు. టిటిడిలో అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు కార్మికులు 14 వేలకుపైగా ఉంటే…ప్రస్తుత పెంపుదల 7,400 మందికి మాత్రమే వర్తిస్తుంది. అంటే సగం మందికి ఈ పెంపుదల వర్తించదన్నమాట. ఇదెక్కడి ధర్మం అని ఆ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలావుండగా ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు పద్దతిలో పని చేస్తున్న ఉద్యోగులకు టైం స్కేల్‌ వర్తింపజేయాలని నిర్ణయించింది. ఈ పద్ధతిలో కనీసం రూ.17,500 వేతనం అందుతుంది. సాధారణంగా ప్రభుత్వ జీవోలన్నీ టిటిడికి వర్తిస్తాయి. ఆ విధంగా చూసినపుడు…ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం కార్మికులందరికీ టైం స్కేల్‌ వర్తింపజేయాలి. అయినా పట్టించుకోకుండా….కాస్త వేతనం పెంచారు. ఏ జీవో ప్రకారం వేతనాలు ఇస్తున్నారని ఈవోను అడిగితే….వేతనం గతంలో ఇస్తున్నట్లే ఇస్తున్నామని, అయితే ఇప్పుడు పెంచింది ఇన్‌సెన్‌టివ్‌ మాత్రమే అని చెప్పారు. టైం స్కేల్‌ ఇవ్వమని ప్రభుత్వం జీవోలు ఇస్తే…వాటిని వర్తింపజేస్తామన్నారు. వాస్తవంగా ఇప్పటికే ఉన్న జీవో 3ని అమలు చేసివుంటే…అత్యంత కింది స్థాయిలోని స్వీపర్‌ వేతనం కూడా రూ.12,000 ఉండేది. ఉన్న జీవోనే అమలు చేయని టిటిడి…ఎప్పుడో వచ్చే జీవోను అమలు చేస్తుందా అనేది ప్రశ్న.

ఏమైనా టిటిడి తీసుకున్న నిర్ణయం ఏమాత్రం సమంజసంగా లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొందరికి వేతనాలు పెంచి, కొందరికి నిరాకరించడం ధర్మం కాదని అంటున్నారు. వేతనాల పెంపును అందరికీ వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ మళ్లీ ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే ఎన్నికల వేళ ప్రభుత్వానికి నిరసన సెగ తప్పేలా లేదు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని అందరికీ వేతనాలు పెంచేలా నిర్ణయం తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*