ఏనుగుల దాడిలో ఇద్దరి మృతి..!

ఆంధ్రా సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం మాలూరు సమీపంలో ఏనుగుల స్వైరవిహారం చేశాయి. ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఏనుగుల దాడిలో మరణించిన వారిలో అటవీశాఖ ఉద్యోగి మునియప్ప ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఏనుగుల గుంపు చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం బి.సానత్తం అడవిలో మాటువేసినట్లు గుర్తించిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.

ఆంధ్ర-కర్నాటక సరిహద్దులో గత నెల రోజులుగా తిష్టవేసిన ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించాయి. కుప్పం-కోలార్ అటవీ ప్రాంతంలోని కర్నాటక రాష్ట్రం మాలూరు తాలుకా జి.గొల్లహల్లి సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి వచ్చిన 25 ఏనుగుల గుంపు జి.గొల్లహల్లి గ్రామానికి చేరుకుంది. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది, స్థానిక గ్రామస్తులు ఈ ఏనుగుల గుంపును అడవిలోకి మళ్ళించేందుకు ప్రయత్నించారు. ఏనుగులు గ్రామాలవైపు రాకుండా పెద్దఎత్తున బాణసంచా పేల్చుతూ అటవీ సిబ్బంది వాటిని వెంబడించారు. ఏనుగుల గుంపు తిరగబడి అటవీ సిబ్బంది, గ్రామస్తులపై దాడి చేశాయి. ఈ దాడిలో అటవీశాఖ ఉద్యోగి మునియప్ప, రైతు కొమ్మనహళ్లి ఆనంద్ అక్కడిక్కడే మరణించారు. ఏనుగులు వీరిద్దరినీ విచక్షణా రహితంగా గాయపరిచాయి. ఈ ఏనుగుల గుప్పం కుప్పం అడవుల మీదుగా చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం బి.సానత్తం సమీపంలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇక్కడి ప్రజలను అప్రమత్తం చేశారు. ఏనుగుల పట్ల గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని, అవి కోపంతో ఉన్నందున ఎవ్వరూ అటువైపు వెళ్ళవద్దని జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు.

ఏనుగుల దాడిలో మృతి చెందిన అటవీ ఉద్యోగి మునియప్ప కుటుంబానికి రూ.7 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, చనిపోయిన రైతు ఆనంద్ కుటుంబానికి రూ 5 లక్షలు నష్టపరిహారం కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. నాలుగు రోజులుగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నా అటవీ సిబ్బంది స్పందించలేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం 30కిపైగా ఏనుగులు గుడిపల్లి మండలం బి.సానత్తం వద్ద తిష్టవేయడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*