ఏప్రిల్‌ 20 నుండి వారాంతంలో బ్రేక్‌ దర్శనం ప్రోటోకాల్‌ ప్రముఖులకు పరిమితం

వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్‌ 20 నుండి జులై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో విఐపి బ్రేక్‌ దర్శనాలను ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేశామని టిటిడి తిరుమల జెఈవో శ్రీనివాసరాజు తెలిపారు. సిఫార్సు లేఖలు అనుమతించబడవని, ఈ విషయాన్ని భక్తులు దృష్టిలో ఉంచుకుని టిటిడికి సహకరించాలని కోరారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం వేసవి ఏర్పాట్లపై అధికారులతో జెఈవో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జెఈవో మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు పరీక్షలు ముగియనుండడం, పరీక్షా ఫలితాలు విడుదల కావడం వల్ల భక్తులు అధికసంఖ్యలో తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తారని, టిటిడి ఈవో ఆదేశాల మేరకు ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. వారాంతంలో భక్తుల ఏర్పాట్లను సీనియర్‌ అధికారులు పర్యవేక్షించేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, అల్పాహారంతోపాటు చట్నీ అందిస్తున్నట్టు వివరించారు. వేసవిలో రోజుకు 3 లక్షల నుండి 3.50 లక్షల వరకు లడ్డూలు తయారుచేసి భక్తులకు ఎలాంటి కొరత లేకుండా అందిస్తామని తెలిపారు. సర్వదర్శనం భక్తులు ప్రవేశించే మార్గాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుని పోలీసుల సహకారంతో క్యూలైన్లను క్రమబద్ధీకరిస్తామని జెఈవో తెలిపారు. భక్తులు పారదర్శకంగా దర్శన సమయాన్ని తెలియజేస్తామని, సంతృప్తికరంగా శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేపట్టామని తెలియజేశారు. వారానికి ఒక లక్షా 27 వేల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కేటాయిస్తామన్నారు. అన్నమయ్య భవనంలో జరిగిన సమావేశంలో టిటిడి ఎస్‌ఇ-2 రామచంద్రారెడ్డి, ఎస్‌ఇ(ఎలక్ట్రికల్‌) వేంకటేశ్వర్లు, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, విజివో రవీంద్రారెడ్డి, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి వేణుగోపాల్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*