ఏ మతానికో కట్టుబడటం తప్పుకాదు…దేశ ద్రోహం చాలా తప్పు!

రాజకీయ పార్టీ స్థాపించి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికీ సిద్ధమై రాజకీయంగానూ బిజీగా ఉన్న విశ్వనటుడు కమల్‌ హాసన్‌ నటించిన విశ్వరూపం-2 ట్రైలర్‌ విడుదలయింది. సీమాంతర ఉగ్రవాదాన్ని కథావస్తువుగా తీసుకుని రూపొందించిన విశ్వరూపం-1 ప్రేక్షకులను కట్టిపడేసింది. అద్భుతమైన చిత్రీకరణ, కమల్‌హాసన్‌ యాక్షన్‌ దృశ్యాలు, సున్నితమైన భావోద్వేగాలు కలిపి విశ్వరూపం-1 సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. దానికి కొనసాగింపుగా విశ్వరూపం-2 తీయనున్నట్లు అప్పుడే కమల్‌ ప్రకటించారు. విశ్వరూపం-2 చాలా ఏళ్లుగా రూపుదిద్దుకుంటోంది. ఆగస్టు -10న ప్రేక్షకుల ముందకు తీసుకురావడానికి సిద్ధమై….ముందుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. తమిళ ట్రైలర్‌ను శృతిహాసన్‌, తెలుగు ట్రైలర్‌ను జూనియర్‌ ఎన్‌టిఆర్‌, హిందీ ట్రైలర్‌ను అమీర్‌ఖాన్‌ చేతుల మీదుగా విడదుల చేశారు. ‘ఏ మతానికో కట్టుబడట తప్పుకాదు బ్రదర్‌….కానీ దేశ ద్రోహం చాలా తప్పు’ అంటూ కమల్‌ చెప్పే డైలాగులో కూడిన ఈ ట్రైలర్‌లో యాక్షన్‌, ఎమోషన్‌, రొమాంటిక్‌ సీన్స్‌ కలగలసి ఉన్నాయి. ట్రైలర్‌లోని దృశ్యాలు సినిమా భారీతనాన్ని, నిర్మాణ నాణ్యతను వెల్లడిస్తున్నాయి. విశ్వరూపం-1లో నటవిశ్వరూపం ప్రదర్శించిన కమల్‌ విశ్వరూపం-2లోనూ అంతకు మించిన నటన ప్రదర్శించివుంటారడంలో సందేహం లేదు. విశ్వరూపం-1 చూసిన వాళ్లు రెండో సినిమా కోసం మొదట్లో ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే సినిమా ఆలస్యం కావడంతో దాన్ని మరచిపోయారు. ఇప్పుడు ట్రైలర్‌ విడుదలవడంతో ప్రేక్షకుల్లో మళ్లీ ఉత్కంఠ మొదలయింది. విడుదల తేదీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*