ఐవైఆర్‌కు నోటీసులుపై టిటిడి ఒక అడుగు వెనక్కి…!

ఇటీవల టిటిడిలో చోటుచేసుకున్న పరిణామాలపై కొందరికి నోటీసులు ఇవ్వాలని పాలక మండలి నిర్ణయించిన సంగతి తెలిసిందే. టిటిడి ప్రతష్టకు భంగం కలిగించేలా మాట్లాడిన వారికి నోటీసులు ఇస్తామని ఈవోనే స్వయంగా ప్రకటించారు. ఇందులో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుతో పాటు మాజీ ఈవో ఐవైఆర్‌ కృష్ణారావుకు నోటీసులు ఇవ్వవచ్చని ప్రచారం జరిగింది. అయితే…రమణ దీక్షితులుకు, వైసిపి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డికి టిటిడి నోటీసులు పంపింది. ఐవైర్‌కు ఇవ్వకపోవడానికి రాజకీయ కారణాలు కనిపిస్తున్నాయి. రమణ దీక్షితులు వ్యవహారంతో తెలుగుదేశం ప్రభుత్వం బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న ప్రచారం వేగంగా వెళ్లిపోయింది. దీంతో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టంది. రమణ దీక్షితులును రిటైర్డ్‌ చేసినప్పటికీ, చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రిటైర్‌మెంట్‌ ఉండబోదని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ క్రమంలోనే….ఐవైఆర్‌కు నోటీసులు ఇవ్వడానికి ప్రభుత్వమే వెనుకంజ వేసినట్లు తెలుస్తోంది. ఐవైఆర్‌కు బ్రాహ్మణ సమాజంలో పలుకుబడి ఉంది. ఆయనకు నోటీసులు ఇవ్వడం ద్వారా టిడిపికి నష్టమే తప్ప లాభం ఉండబోదు. దీన్ని గమనించిన ప్రభుత్వం ఆయన్ను వదిలేసి…విజయసాయి రెడ్డిపై దృష్టి పెట్టింది.

తిరుమల శ్రీవారి ఆలయంలో తవ్వకాలు జరిగాయని, గుప్తనిధులన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇంట్లో ఉన్నాయని, 13 గంటల్లో ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తే నిధులు దొరుకుతాయని, లేదంటే దేశం దాటి వెళ్లిపోతాయని సాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన టిడిపి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే…టిటిడి సాయిరెడ్డికి నోటీసులు పంపింది. వాస్తవంగా సాయిరెడ్డి టిటిడిపైన చేసిన విమర్శల కంటే ముఖ్యమంత్రినే టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. ఒక విధంగా ఇవి రాజకీయ విమర్శలు. అయినప్పటికీ టిటిడి ఆయనకు నోటీసు పంపింది. తనకు నోటీసు ఇచ్చే అవకాశం టిటిడికి లేదని సాయిరెడ్డి అంటున్నారు. దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని చెబుతున్నారు. అదేవిధంగా టిటిడిలో జరుగుతున్న అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని మరోసారి ఆయన సవాలు విసిరారు.

మళ్లీ ఐవైఆర్‌ విషయానికొస్తే…ఆయన చాలా తరచుగా టిటిడి వ్యవహారాలపైన మాట్లాడుతున్నప్పటికీ…ఎక్కడా అదుపు తప్పి మాట్లాడలేదు. శంపపారంపర్య అర్చకత్వాన్ని ఆయన సమర్థిస్తున్నారు. అదేవిధంగా సన్నిధి గొల్ల కూడా వంశపారంపర్యంగానే ఉండాలని చెబుతున్నారు. ఇక ఆభరణాల గల్లంతు, కైంకర్యాల్లో అపశృతులు వాటిపై విచారణ జరిపిస్తేనే సందేహాలు నివృత్తి అవుతాయని చెబుతున్నారు. ఆయన ఎక్కడా రమణ దీక్షితుల వ్యవహార శైలిని సమర్ధించడం లేదు. ఆయన లేవనెత్తిన అంశాలను మాత్రమే సమర్థిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*