ఒకరు నమ్మకం…ఇంకొకరు విశ్వాసం… ఎంఎల్ఎతోనే ఆ ఇద్దరు…!

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

సాధారణంగా బెల్లం ఉన్నచోటే ఈగలు వాలుతుంటాయి అంటుంటారు పెద్దలు. అలాగే పదవి, పరపతి ఉన్నచోటనే మంది మార్బలం చేరడం సహజం. అయితే నాయకుడు కాదు కదా…సాధారణ కార్యకర్తగా ఉన్న రోజుల నుంచి ఎంఎల్ఎ అయిన నేటి వరకు ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా ఓ నేతను అంటిపెట్టుకుని ఉండటం కొందరికే సాధ్యమవుతోంది. ఎంబీఏ చేసి బ్యాంకు మేనేజర్ స్థాయిని వదలుకుని ఇరవై ఏళ్లుగా ఎంఎల్ఎ వెంటే ఉంటున్నారొక యువ నాయకుడు. గత పదకొండేళ్లుగా ఎంఎల్ఎ మాటే వేదంగా భావిస్తూ పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు మరో యువ నాయకుడు. శ్రీకాళహస్తి ఎంఎల్ఎ బియ్యపు మధుసూధన్ రెడ్డికి కుడి ఎడమలుగా, నమ్మిన బంటులా ఉంటున్న ఆ యువ నాయకులు బుల్లెట్ జయశ్యామ్, సలీమ్.

బ్యాంకు ఉద్యోగం వదలుకుని…
ఎంఎల్ఎ మధుసూధన్ రెడ్డి కి నమ్మినబంటులా ఉంటున్న వారిలో బుల్లెట్ జయశ్యామ్ ఒకరు. 2001లో వైఎస్ రాజశేఖరరెడ్డి నాయుడుపేట మీదుగా వెళుతున్న సమయంలో మొదటిసారి ప్రస్తుత ఎంఎల్ఎ మధుసూధన్ రెడ్డికి పరిచయం అయ్యారు. ఆరోజు మధుసూదన్ రెడ్డితో కలిసి నాయుడుపేట వెళ్లిన జయశ్యామ్ అప్పటి నుంచి ఆయన అనుచరుడిగా ఉంటున్నారు. ఎంబీఏ చేసిన బుల్లెట్ 2004లో ఆళ్లగడ్డ మైక్రోఫైనాన్స్ లిమిటెడ్ బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహించారు. కొంతకాలం తర్వాత శ్రీకాళహస్తి విచ్చేసిన జయశ్యామ్ తర్వాత ఉద్యోగానికి వెళ్లలేదు. అప్పటి నుంచి పూర్తిగా మధుసూదన్ రెడ్డి అనుచరుడిగా ఉంటూ వస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు నమ్ముకున్న నాయకుని వెంటే ఉంటూ నాయకుని అడుగు జాడలే తన గమ్యంగా పనిచేస్తున్నారు. పార్టీ పట్టణ యువత ఉపాధ్యక్షుడుగా పనిచేసిన జయశ్యామ్ ప్రస్తుతం పార్టీ యువత పట్టణ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. మధుసూదన్ రెడ్డి అంటే తనకు వీరాభిమానం అని, జీవితాంతం ఆయన వెంటే ఉంటానని బుల్లెట్ జయశ్యామ్ చెబుతుంటారు.

విశ్వసనీయత సలీమ్ నైజం…
ఎంఎల్ఎ మధుసూదన్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉంటున్న మరో యువ నాయకుడు సలీమ్. పట్టణంలోని మైనార్టీ వర్గానికి చెందిన సలీమ్ డిగ్రీ వరకు చదువుకున్నారు. 2009లో మొదటిసారి ప్రస్తుత ఎంఎల్ఎ మధుసూదన్ రెడ్డి అనుచరుడిగా చేరిన సలీమ్ నాటి నుంచి నేటి వరకు ఆయనకు పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఎంఎల్ఎ అడుగు జాడల్లో నడుస్తూ నమ్మిన బంటులా ఉంటున్నారు. ప్రస్తుతం ఎంఎల్ఎను ఏ పనిమీద వెళ్లి కలిసినా సలీమ్ ను కలవండి అని చెబుతున్నారంటే ఎంఎల్ఎ దృష్టిలో సలీమ్ పాత్ర, నమ్మకం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

కష్టకాలం నుంచి అధికారందాకా..
వైకాపా పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కొందరు నేతలు అంటీముట్టనట్లు వ్యవహరించారనే విమర్శలున్నాయి. అయితే అప్పట్లోనే మధుసూదన్ రెడ్డికి కుడీ ‌ఎడమలుగా ఉంటూ వచ్చారు బుల్లెట్ జయశ్యామ్, సలీమ్. ఆపదలోనూ, కష్టకాలంలోనూ వెంటే ఉంటూ వచ్చిన ఆ ఇద్దరు పార్టీ విజయంలోనూ తమపాత్ర పోషించారు. ఎంఎల్ఎ నిద్ర లేచిన మొదలు తిరిగి పడుకునే వరకు ఆ ఇద్దరూ వెంటే ఉంటారనేది అందరికీ తెలిసిందే. ఏ నాయకునికి అయినా విశ్వసనీయతగా ఉండే అనుచరులు ఉంటే విజయం వెంటే ఉంటుంది అనేది వారిని చూస్తే అర్థమవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*