ఒళ్ళు దగ్గర పెట్టుకున్న వైసిపి… అతికిపోయి భంగపడిన టిడిపి..!

– ఎన్నికల్లో వ్యూహం వందశాతం విజయవంతంగా అమలు చేసిన అధికారపక్షం

ఇటీవల కాలంలో అజాగ్రత్త, అతి విశ్వాసం, అలసత్వం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న వైసిపి…ఈ రోజు జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మాత్రం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చిన్నపొరపాటు కూడా జరగకుండా తన వ్యూహాన్ని అమలు చేసింది. వైసిపి నిలబెట్టిన నలుగురు అభ్యర్థులూ గెలవడమే కాకుండా…ఎవరికి‌ ఎన్ని ఓట్లు రావాలని నిర్దేశించుకున్నారో అన్ని ఓట్లు వచ్చేలా చూసుకుంది. ఇదే సమయంలో చంద్రబాబును పరాభవంపాలు చేసింది.

రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ స్థానాలకు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానీలను తన అభ్యర్థులుగా నిలబెట్టింది. ఒకొక్కరికి 38 ఓట్లు వచ్చాయి. అంటే వైసిపికి 152 ఓట్లు వచ్చినట్లు లెక్క. వాస్తవంగా వైసిపికి మొత్తం 151 ఓట్లు మాత్రమే ఉన్నాయి. వైసిపికి వచ్చిన అదనపు ఓటు ఎవరిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జనసేన ఎంఎల్ఏ రాపాక తన ఓటును వైసిపికి వేశారు. వైసిపి‌ అభ్యర్థులందరికీ సమంగా ఓట్లు రావడాన్ని బట్టి చూస్తే…రాపాక ఓటు తమ అభ్యర్థుల్లో ఎవరికి వేయాలో ముందే నిర్ణయించినట్లు అర్థమవుతుంది. అదేవిధంగా ఓట్లు చెల్లకుండాపోవడం వంటి ఘటనలూ లేవు. మొత్తంమ్మీద వైసిపి పక్కా ప్రణాళికతో ఓటింగ్ కు వెళ్లిందనేది స్పష్టం.

ఇదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశంను అభాసుపాలు చేయడంలోనూ వైసిపి చక్రం తిప్పింది. 23 ఓట్లు మాత్రమే ఉన్న తమ పార్టీ ఈ ఎన్నికల్లో గెలవదని తెలిసినా చంద్రబాబు నాయుడు ఏదో వ్యూహంతో వర్ల రామయ్యను‌ అభ్యర్థిగా నిలబెట్టారు. అయినా తమ పార్టీ ఓట్లను కూడా వేసుకోలేకపోయారు. టిడిపికి దూరమై, వైసిపికి దగ్గరైన….వంశి, బలరాం, గిరిలకు‌ విప్ జారీ చేసినా ఫలితం లేకపోయింది. విప్ అందుకున్న ఆ ముగ్గురూ వ్యూహాత్మకంగా ఓటు వేశారు. ఓటి వర్ల రామయ్యకే వేసినా చెల్లని విధంగా వేశారు. ఇది కచ్చితంగా వైసిపి వ్యూహమే.

ఇక రాజమండ్రి తెలుగుదేశం‌ ఎంఎల్ఏ, కీర్తిశేషులు ఎర్రన్నాయుడి కుమార్తె అయిన ఆదిరెడ్డి భవానీ ఓటు చెల్లకపోవడం సంచలనంగా మారింది. ఉన్నత విద్యావంతురాలైన ఆమె‌ ఓటు చెల్లకపోవడం ఏమిటన్న చర్చ సర్వత్రా‌సాగుతోంది. అచ్చెన్నాయుడు (అమె చిన్నాన్న) అరెస్టు వ్యవహారంలో తెలుగుదేశం అనుసరించిన తీరుపట్ల అసంతృప్తితో ఉన్నారా అనే అనుమానమం కలుగుతోంది. భవానీ ఓటు చెల్లకపోవడం వెనుక వైసిపి వ్యూహం ఏదైనా ఉందా‌ అనేది కూడా త్వతలోనే తేలుతుంది.

తెలుగుదేశం అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు మాత్రమే లభించాయి. ముందే చెప్పిన వంశీ, బలరాం, గిరి, భవానీ ఓట్లు చెల్లలేదు. క్వారంటైన్ పేరుతో ఎంఎల్ఏ అనగాని ఓటింగ్ కు రాలేదు. అచ్చెన్నాయుడు అరెస్టయి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయన్నూ రప్పించే ప్రయత్నం చేయలేదు. ఇలా ఆరు ఓట్లుపోతే 17 ఓట్లు మాత్రమే టిడిపికి దక్కాయి. పార్టీకి దూరంగా జరిగిన ఎంఎల్ఏలను ఇబ్బంది పెట్డడానికి, తెలివిగా అభ్యర్థిని పెట్టానని చంద్రబాబు ‌అనుకుని ఉండొచ్చుగానీ…వైసిపి వ్యూహం ముందు బాబు చిత్తయిపోయారు. పైగా ఓడిపోతారని తెలిసీ దళితుడైన వర్ల రామయ్యను పోటీకి పెట్టారన్న విమర్శలనూ మూటగట్టుకున్నారు. ఇంతకంటే పోటీకి దూరంగా ఉంటే పరుగా ఉండేది.

-ఆదిమూలం శేఖర్, ఎడిటర్, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*