ఓట్ల కోసం ఉద్రేకాలు, విద్వేషాలు రెచ్చగొట్టొద్దు

– ప్రజా సమస్యల ప్రాతిపదికనే ఎన్నికలు జరగాలి

– ధర్మచక్రం చర్చా వేదికలో జర్నలిస్టులు, మేధావులు

ఓట్లు కోసం, సీట్లు కోసం ప్రజల మధ్య విభేదాలు, ఉద్రేకాలు రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని, ఎన్నికల్లో ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా మారాల్సిన అవసరం ఉందని పలువురు జర్నలిస్టులు, మేధావులు, సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం తీరు, రాజకీయ పార్టీల ధోరణులపై ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు.
తిరుపతిలో బుధవారం ధర్మచక్రం వారపత్రిక ఆధ్వర్యంలో, ఆ పత్రిక ఎడిటర్‌ ఆదిమూలం శేఖర్‌ అధ్యక్షతన ‘ఎన్నికలు – ప్రజల అజెండా’ అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు.
ఈ సందర్భంగా విశ్రాంత పాత్రికేయులు వి.శంకరయ్య మాట్లాడుతూ….ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో లబ్ధికోసం తెలంగాణకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టేలా అధికార పార్టీ సాగిస్తున్న ప్రచారం ప్రమాదకరమన్నారు. దీనివల్ల పక్కరాష్ట్రంలోని తెలుగువారికి కీడు జరుగుతుందన్నారు. తెలంగాణ వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ టిడిపి నాయకులు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మబోరని, సీమకు ద్రోహం చేస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు.
విశ్రాంత న్యాయమూర్తి డి.గుర్రప్ప మాట్లాడుతూ….ప్రజలకు ఏమాత్రం సబంధం లేని అంశాలతో ఎన్నికల ప్రచారంగా సాగుతోందని అన్నారు. వివేకానందరెడ్డి హత్య దోషులవెరూ విచారణ అధికారులు తేల్చాల్సివుండగా… ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పెద్దలే నిర్ధారణలు చేస్తూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇంట్లో మనిషిని కోల్పోయి వివేకానందరెడ్డి కుటుంబం రోదిస్తుంటే….ఆ అంశాన్నే ఎన్నికల ప్రచారంగా చేసుకోవడం దురదృష్టకరమన్నారు.
సీనియర్‌ జర్నలిస్టు రాఘవ శర్మ మాట్లాడుతూ…హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులు ప్రశాంతంగా, క్షేమంగా జీవిస్తుండగా…..అక్కడి వారికి ఏదో జరిగిపోతున్నట్లు ప్రచారం చేయడం; ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం అవాంఛనీయమన్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా… రాయలసీమ గూండాలు వచ్చారని, పులివెందుల రౌడీలు వచ్చారని మాట్లాడటం….రాయలసీమను కించపరచడమే అన్నారు.
రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షులు భూమన్‌ మాట్లాడుతూ….విభజన తరువాత రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయని, రాయలసీమ ప్రాంతమైతే ఇంకా తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటోందని ఇటువంటి వాటిపైన చర్చ జరగడం లేదన్నారు. డబ్బుతో ఓట్లు కొనుక్కోవచ్చు అనే భావన రాజకీయ పార్టీలకు ఉందని, అందుకే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఎన్నికల వల్ల ప్రజలకు మేలు జరగుతుందన్న ఆశ లేకుండాపోయిందన్నారు.
రాయలసీమ మేధావులు ఫోరం నాయకులు ఎం.పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ…రాయలసీమ నీటి ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వమే ఆటంకం అనే విధంగా టిడిపి నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అయితే… సీమకు నిజంగా ద్రోహం చేస్తున్నది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమే అన్నారు.   తెలంగాణతో ఘర్షణ పడటం వల్ల నష్టపోయేది రాయలసీమ ప్రాంతమేనని అన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మించాలంటే….తెలంగాణ సహకారం అనివార్యమని అన్నారు. అటువంటిది ఓట్ల కోసం తెలంగాణతో గొడవలు పెంచేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో సీనియర్‌ జర్నలిస్టు రవికుమార్‌ మాట్లాడుతూ….రాష్ట్ర ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు ఏమిటనే విషయంలో జనాన్ని గందరగోళ పరుస్తున్నారని అన్నారు. ఇటువంటి పరిస్థితి గత 50 – 60 ఏళ్లలో ఎన్నడూ లేదన్నారు. ఈ పరిస్థితుల్లో వాస్తవాలను ప్రజలు తెలియజేయాల్సిన బాధ్యత ఉన్న మీడియా లేకపోవడం విచారకరమన్నారు.
ఆంధ్రనాడు పత్రిక సంపాదకులు హరిబాబు మాట్లాడుతూ….తాత్కాలిక అంశాలు తప్ప శాశ్వత అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన రాజకీయ పార్టీలు దృష్టి పెట్టడం లేదన్నారు. హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టుల గురించి 30 ఏళ్ల నుంచి చెబుతున్నారుగానీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇటీవల హంద్రీ-నీవాకు నీళ్లు ఇచ్చినా అది ఎన్నికల స్టంటు తప్ప ఇంకొకటి కాదన్నారు. ప్రభుత్వాలు రాయలసీమకు చేస్తున్న అన్యాయం అంతాఇంతా కాదన్నారు.
ఉద్యోగ సంఘాల నాయకుడు గిరి మాట్లాడుతూ….ఉద్యోగుల ప్రధాన సమస్యగా ఉన్న సిపిఎస్‌కు వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పోరాడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదుగానీ….ఎన్నికలొచ్చే సరికి సిపిఎస్‌ రద్దు చేస్తామంటూ హామీ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాయావి పత్రిక ఎడిటర్‌ లక్ష్మీపతి మాట్లాడుతూ…చంద్రబాబు నాయుడు తాను చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రచారం చేసి ఓట్లు అడిగితే తప్పులేదుగానీ….వైసిపి గెలిస్తే గూండాయిజం పెరిగిపోతుందని, ఆడవాళ్లు వీధుల్లో తిరగలేరు వంటి రెచ్చగొట్టేలా మాట్లాడటం సమర్థనీయం కాదన్నారు.
దళిత ఉద్యమ నాయకుడు, ధర్మచక్రం పత్రిక అసిస్టెంట్‌ ఎడిటర్‌ ఎం.నాగరాజ మాట్లాడుతూ….రాజకీయాలు దారితప్పిన పరిస్థితుల్లో ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు మేధావులు, జర్నలిస్టులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విస్తృతం చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*