ఓహో…జగన్‌ జైలుకు వెళ్లారు కాబట్టి… అందర్నీ జైలుకు పంపిస్తున్నారా…! లాజిక్కు మిస్సయ్యారు బాబూ…!

Nara Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, జెసి ప్రభాకర్‌ రెడ్డి, జెసి అస్మిత్‌ రెడ్డి అరెస్టుకు నిరసనగా చంద్రబాబు నాయుడు కాగడాల ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. గతంలో జగన్‌ మోహన్‌ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు కాబట్టి….అందర్నీ జైుళుకు పంపాలని అనుకుంటున్నారు. అందుకే టిడిపి నేతలపై కేసులు పెట్టిన జైలుకు పంపుతున్నారు… అని చెప్పుకొచ్చారు.

ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక లాజిక్కు మిస్సయ్యారు. జగన్‌పైన కేసు పెట్టింది కాంగ్రెస్‌ నేతలు. వైఎస్‌ఆర్‌ మరణానంతరం జగన్‌ మోహన్‌ రెడ్డి కాంగ్రెస్‌తో విభేదించి, సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. దీంతో కక్షగట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఆయనపై కేసు బనాయించింది. ఇది బహిరంగ సత్యం.

జగన్‌ కక్ష తీర్చుకోవాలంటే ముందుగా కేసు పెట్టాల్సింది, జైలుకు పంపాల్సింది కాంగ్రెస్‌ నేతలను కదా…! తెలుగుదేశం నేతలపైన ఎందుకు కేసులు పెడుతున్నట్లు? ఈ మాట చెప్పడం ద్వారా జగన్‌ను జైలుకు పంపడంలో తెలుగుదేశం పార్టీ నేత ప్రమేయం కూడా ఉందని చంద్రబాబు అంగీకరిస్తున్నట్లా..?

ప్రజల‌ దృష్టిని మరల్చడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. తన అనుకూల మీడియా ద్వారా నందిని పందిని, పందిని నందిని చేయగల సమర్ధులు. ఇప్పుడు జరుగుతున్నది అదే. అక్రమాలు, కుంభకోణాల్లో తెలుగుదేశం నేతలు అరెస్టవుతుంటే…. అవేవో అక్రమ కేసున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఏమీ లేకపోయినా కక్షగట్టి అరెస్టు చేయిస్తున్నారని జనాన్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు హయాంలో ఈఎస్‌ఐ ఆస్పత్రులకు మందు, వైద్య పరికరాలు కొనుగోలులో రూ.150 కోట్ల అవినీతి జరిగినట్లు స్పష్టమైన ఆధారాలతో ఏసిబి కేసు నమోదు చేసింది. ఇది అక్రమ కేసు అవుతుందా? మరో విచిత్ర వాదన కూడా చేస్తున్నారు. మందు కొనుగోలుతో మంత్రికి సంబంధం ఉండదంట. అధికారులే అన్నీ చేస్తారట. ఇక ఆ శాఖకు మంత్రి ఎందుకో?

ఇక జెసి దివాకర్‌ రెడ్డి వ్యవహారం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. కాలం చెల్లిన బిఎస్‌ 3 లారీలు కొనడం అసత్యమా, లారీలను బస్సుగా మార్చడం అసత్యమా, దివాకర్‌ బస్సులతో ప్రమాదాలు జరిగిన ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోవడం అబద్ధమా….ఇంత బహిరంగంగా కనిపిస్తున్న నేరాలపై కేసు నమోదు చేసినా…అక్రమ కేసులుగా ఫోకస్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు.

తమపైన కక్షతో కేసు బనాయిస్తున్నారని చంద్రబాబు చెప్పుకోవచ్చు. అయితే… నిజంగా జగన్‌ ఆ విధంగా చేస్తే ప్రజలు హర్షించరు. ఇదే సమయంలో కళ్లకు కనబడే నేరాలనూ కప్పిపుచ్చి, కళ్లకు గంతలు కట్టాలని చంద్రబాబు చూసినా జనం ఆమోదించరు. ఈ విషయాన్ని చంద్రబాబు అండ్‌ కో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. – ధర్మచక్రం ప్రతినిధి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*