కందకు లేని దురద కత్తిపీటకు..! టిడిపి కంటే మీడియా అపసోపాలు..!

రాష్ట్రంలోఎన్నికలు ముగిశాయి. ప్రజల తీర్పు ఇవియంలలో ఇమిడి వుంది. కౌటింగు ప్రారంభమైన కొన్ని గంటలలో కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తెలిసి పోతుంది. అంత వరకు ఎవరు ఎన్ని విన్యాసాలుచేసినా తిప్పించి మళ్ళించి వార్తలు ఇచ్చినాకలిగే ఫలితంగా వుండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నానా తంటాలు పడటం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక వేళ ఓటమి ఎదురైతే పార్టీ పరంగా అందుకు అనువైన గ్రౌండ్ ఇప్పటినుండే తయారు చేసుకోవాలి. ఈ సూత్రం రాష్ట్రంలోని అన్ని పార్టీల అథినేతలకు వర్తిస్తుంది.

అయితే ఇన్నాళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పోటీ కాళ్ళుగా వ్యవహరించిన ఒక రక మైన మీడియా పోలింగ్ ముగిసినప్పటి నుండి పోలింగ్ బూతుల వద్ద మహిళలు పోటెట్టారని తెలుగు దేశం పార్టీ విజయం సాధిస్తుందనే ధోరణిలో వార్తలు ఇస్తున్నారు.

అందులో భాగంగా ఒక పత్రిక ఆదివారం సంచికలో “అతివలు జే కొట్టారని 2014 కన్నా అధికంగా 1.36 శాతం ఓట్లు వేశారని” ఒక కథనం ప్రచురించింది. ఆ పత్రిక ప్రచురించిన కథనం వివరంగా పరిశీలించితే దాని డొల్ల తనం బహిర్గతమౌతుంది. జిల్లాలవారీగా వారు ఇచ్చిన గణాంకాలు పరిశీలించితే 2014 ఎన్నికల్లో టిడిపి బలంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో – 0.46(మైనస్)శాతం మాత్రమే మహిళలు ఓట్లు వేశారు. రాజధాని నిర్మించుతున్న గుంటూరు జిల్లాలో 0.56 శాతం కృష్ణ జిల్లాలో 1.09 శాతం విశాఖ జిల్లాలో 0.12 శాతం తూర్పు గోదావరి జిల్లాలో 1.04 శాతం శ్రీ కాకులం జిల్లాలో 0.12 విజయ నగరం జిల్లాలో 1.11 శాతం ఎక్కువగా మహిళలు ఓట్లు వేశారు.

అదే 2014 లోవైసిపికి ఎక్కువ స్థానాలు వచ్చిన జిల్లాలు లేదా ప్రస్తుతం వైసిపి పార్టీ బలంగా వున్న జిల్లాలో మాత్రమే 2019 ఎన్నికల్లో మహిళలు అత్యధికంగా ఓట్లు వేశారు. కర్నూలు జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద ఎక్కువగా 4.34 శాతం మహిళలు ఓట్లు వేశారు. ప్రకాశం జిల్లాలో 2.23 శాతం నెల్లూరు జిల్లాలో 1.97 శాతం చిత్తూరు జిల్లాలో 2.10 శాతం అనంతపురం జిల్లాలో 2.10 శాతం ఎక్కువగా మహిళలు ఓట్లు వేశారు. టిడిపి వైసిపి పార్టీలు నువ్వా నేనా అని గట్టి పోటి పడిన జిల్లాలలో మహిళలు ఎక్కువగా వచ్చి ఓట్లు వేశారు.

ఈ కీలకాంశాలన్నీ వీరికి పట్ట లేదు. రాజు గారి ఆవులు 99 నా ఆవు ఒకటి మొత్తం వంద ఆవుల కథ చందంగా ఈ మీడియా వ్యవహరిస్తున్నది.

వాస్తవం చెప్పాలంటే ఏ నాడు లేని విధంగా రాష్ట్రంలో రాజకీయ విభజన గ్రామాల స్థాయివరకు విస్తరించింది. ఈ లాంటి విభజన గతంలో లేదు. రెండు ప్రధాన పార్టీలు చావో రేవో తేల్చుకొనేందుకు సర్వ శక్తులు ఒడ్డాయి. ఫలితంగా ఇవియంలు మైరాయించినా రెండు పార్టీలకు చెందిన ఓటర్లు అన్ని జిల్లాల్లో కూడా బూతుల వద్ద కాపు కాచారు. రేపు ఓట్లు లెకించితే గెలుపు ఎవరిదో తెలుస్తుంది..

రాజకీయ పార్టీలు తమ గెలుపు గురించి అంచనాలు వేసుకోవడం సహజమే. అది తప్పు కాదు కూడా. కాని ఎపిలో ప్రత్యేకత ఏమంటే కందకు లేని దురద పీటకు వచ్చినట్లు ఒక రకమైన మీడియా లేని పోని అపసోపాలు పడుతోంది.
ఇదిలా వుండగా ఆదివారం నాడే మరో సంఘటన సంభవించింది.ఈ వార్త ముఖ్యమంత్రి కన్నా ఈ మీడియాకే ముచ్చెమటలు పోశాయి. అందువలన ఈ వార్త తమ గంప కింద పెట్టి దాచాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మాట్లాడుతూ తమ పార్టీ నూటికి వెయ్యి రెట్లు అధికంగా తప్ప కుండా గెలుపొందుతుందని ప్రకటించారు. తీరా అదే రోజు మీడియాలో ఇన్నాళ్లు టిడిపి ప్రభుత్వానికి స్థంభాలుగా వుండిన ఐఎఎస్ ఐపియస్అధికారులు కేంద్రానికి వెళ్లేందుకు లేఖలు రాశారనే వార్తలు వెలువడటం గమనార్హం. అయితే ఈ వార్తను పాపులర్ మీడియా గంప కింద పెట్టింది. ఈ పాపులర్ మీడియా పాట్లు చూస్తోంటే టిడిపి కన్నా వీరే తెగ బాధ పడి పోతున్నారు.

– వి.శంకరయ్య, 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*