కడప ఉక్కు కర్మాగారం….ఏది సత్యం? ఏది అసత్యం. ఓ మహాత్మా?

తుదకు కడప ఉక్కు కర్మాగారం కూడా రాజకీయ సుడిగుండంలో చిక్కుకున్నది. ముసలితనంలో ముదిమి ఎక్కువ అన్నట్టు అయిదు ఏళ్లు గడిపేసి గురువారం ముఖ్యమంత్రి ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు పునాది రాయి వేశారు. ఎన్నికల మూడు నాలుగు నెలల్లో వున్నందున ఈ ఉక్కు కర్మాగారం ఏర్పాటు జరిగేది లేదు. అయితే ఒక పని మాత్రం ముగుస్తుంది. దీక్ష తర్వాత గడ్డంపెంచి ఇబ్బంది పడుతున్న సి. యం. రమేష్ గడ్డంతీసి వేసి ఆ చెర వదిలించు కుంటారు.

ఇక అసలు అంశానికి వద్దాం. ముఖ్యమంత్రి పునాది రాయి వేసిన ఉక్కు కర్మాగారం 3 వేల ఎకరాల్లో నిర్మాణం జరుగుతుంది. 20 వేల కోట్లు పెట్టుబడి పెడతారు. 10 వేల మందికి ఉపాధి లభిస్తుంది. అయితే ఈ ప్యాక్టరీ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే అవకాశం లేదు. ఆ స్థోమత ఏ మాత్రం లేదు. నిధులు ఏలా సేకరణ జరుగుతుందో లేక ప్రైవేటు సంస్థలకు అప్పగించు తారో రాష్ట్ర ప్రభుత్వం నుండి వివరణ లేదు. పునాది రాయి వేసి బయ స్కోపు చూపించి ఓట్లు దండుకొనే పథకం కాబట్టి ఈ వివరణ ఎవరికి అక్కర లేదు.

మరో వేపు కేంద్రంకూడా ఉక్కు కర్మాగారం అంశంలో కుటిల నీతి అమలు జరుపు తోంది. అయితే ముఖ్యమంత్రి ప్రకటనలకు కేంద్రం గురువారం విడుదల చేసిన ప్రకటనకు సంబంధమే లేదు. గతంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రంకు రెండు నెలలు గడువు ఇస్తున్నానని ఆలోపు కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కాని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ఇందుకు భిన్నంగా ఉంది.

అందులో ముఖ్యమైనవి. 1)కడప ఉక్కు కర్మాగారం లాభ దాయకం కాదని సెయిల్ నివేదిక ఇచ్చింది. 2)ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాము. ఈ నెల 17 వతేది టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. టాస్క్ ఫోర్స్ ఎంత ప్రయత్నం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుండి సమాచారం రాలేదు. 3)ముడి ఇనుము నిల్వల గురించి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వడం లేదు. అటవీ పర్యావరణకు చెందిన అంశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి రాలేదు. 4)తాము మాత్రం రాష్ట్ర ప్రజల కోసం శతథా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము

ఇందులో ఎవరి మాటలను నమ్మాలి? పోనీ కేంద్ర విడుదల చేసిన ప్రకటనకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలి. ఒక్కటి మాత్రం నిజం. ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరి కొకరు పంతాలకు పోయి అంతిమంగా సీమ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. కడప ఉక్కు కర్మాగారం అంశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్నాళ్లు చెబుతున్న అంశాలకు ఈ రోజు కేంద్రం విడుదల చేసిన అంశాలు పరస్పర విరుద్ధంగా వున్నాయి. అంతే కాదు. కేంద్రంకూడా ముఖ్యమంత్రి పునాది రాయి వేసే వరకు ఎందుకు నిమ్మళంగా వుంది? ఈ అంశాలు ఇదివరకే ఎందుకు ప్రకటించలేదు? కోడెలు పోట్లాడుతూ వుంటే లేగ దూడల కాళ్లు విరిగి నట్లు ఈ ఇద్దరు నేతల మధ్య రాష్ట్ర ప్రజలు మునిగి పోతున్నారు. ఈ ఆరు నెలలు గడిచితే కేంద్రంలో రాష్ట్రంలో ఎవరికి ఎవరో తెలియదు                                                                                                                         –  వి. శంకరయ్య 9848394013

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*