కరగని శ్రీవారి వెండికొండ..! కోట్లాది రూపాయల వడ్డీ నష్టం!

తిరుమల శ్రీవారికి కానుకల రూపంలో వచ్చిపడుతున్న వెండి…కొండలా పేరుకుపోయింది. దాన్ని కరిగించడం టిటిడికి పెద్ద సవాలుగా మారింది. ఆ వెండికొండను కరిగించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. మరోవైపు వెండిని కరిగించడం ఆలస్యమయ్యే కొద్దీ శ్రీవారికి భారీ నష్టం వాటిల్లుతోంది.

భక్తులు వెంకటేశ్వర స్వామికి హుండీ ద్వారా వెండి ఆభరణాలు, వస్తువులు సమర్పిస్తుంటారు. ఈ విధంగా ఏడాదికి రెండు టన్నులకుపైగా వెండి పోగవుతుంది. గతంలో (2010కి మునుపు) ఈ వెండి ఆభరణాలను ప్రభుత్వ టంకశాలలో (మింట్‌లో) కరిగించి, నాణ్యమైన వెండిగా శుద్ధిచేసి, వాటితో శ్రీవారి డాలర్లు (3 గ్రాములు, 5 గ్రాములు, 10 గ్రాములు) తయారు చేసేవారు. కరిగించడం, శుద్ధిచేయడంలో 32 శాతం వెండి తరుగురూపంలో పోతోంది. దీనిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో వెండిని కరిగించి, డాలర్లు తయారుచేసే పద్ధతికి స్వస్థి చెప్పారు.

నిపుణుల సలహాతో వెండి ఆభరణాలనే నేరుగా వేలం వేయాలని నిర్ణయించారు. 2013లో 3 టన్నుల ఆభరణాలను రెండు పర్యాయాలు వేలం వేసినా కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అప్పటి టెండర్లు రద్దు చేశారు. వెండిని కరిగించి బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బ్యాంకులు బంగారాన్ని తప్ప వెండిని డిపాజిట్‌ చేసుకోవు. ఇందుకు ఆర్‌బిఐ నిబంధనలు అంగీకరించవని తేల్చేశారు.

ఈ పరిణామాలు, తర్జనభర్జనల నేపథ్యంలో 2010 నుంచి వెండి అమ్మకాలు జరగడం లేదు. 2016లో సాంబశివరావు ఈవోగా వచ్చిన తరువాత వెండి విక్రయాల కోసం మరో ప్రయత్నం చేశారు. వెండిని ఇండియన్‌ మింట్‌కు అప్పగించి, అక్కడే కరిగించి, శుద్ధిచేయించాలని, అలా వచ్చిన నాణ్యమైన వెండికి (ధరకు) సమానమైన బంగారును టిటిడికి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటికి ( 2016 జనవరి నాటికి) టిటిడి వద్ద 28 టన్నుల వెండి ఆభరణాలున్నాయి. రెండు విడతల్లో 17,775 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులను హైదరాబాద్‌లోని మింట్‌కు అప్పగించారు.

ఈ మొత్తం ఆభరణాలను కరిగించడం పూర్తయిందిగానీ….శుద్ధి (రీఫైనింగ్‌) చేసే పని ఇంకా జరుగుతోంది. మొదటి దశలో 7,775 కిలోలను శుద్ధి చేస్తున్నారు. మిగతా 10 టన్నుల జోలికి ఇంకా వెళ్లలేదు. ఏడాదికిపైగా అవుతున్నా 17,775 కిలలను కరిగించి, శుద్ధిచేసే పని ఇప్పటికీ పూర్తికాలేదు. ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ. అందుకే అంత జాప్యం జరుగుతోంది.

మరోవైపు టిటిడి ఖజానాలోకి మళ్లీ వెండి వచ్చి చేరుతోంది. ఏడాదికి రెండున్నర టన్నులకుపైగా వెండి జమవుతుంది. ఈ లెక్కన 2016 జనవరి నుంచి ఇప్పటిదాకా ఏడు టన్నుల దాకా అదనంగా వచ్చి చేరింది. అంటే మింట్‌కు అప్పగించిన 17 టన్నులు పోగా…ఇంకా 18 టన్నుల వెండి ఆభరణాలు ఉన్నాయన్నమాట.

వెండి ఆభరణాలను కరిగించి, శుద్ధిచేసి, ఆ వెండి విలువకు సమానమైన బంగారు బిస్కెట్లను ఇవ్వడానికి మింట్‌ అంగీకరించి, 17,775 కిలోల వెండి ఆభరణాలను మింట్‌కు తరలించి, కరిగించిన తరువాత….మళ్లీ టిటిడి డైలమాలో పడింది. ఎందుకుంటే…ఇందుకయ్యే ఖర్చు తడిసిమోపెడవుతోంది. కిలో వెండి ఆభరణాలను కరిగించడానికి రూ.1000, శుద్ధి చేయడానికి రూ.2,400 చెల్లించాలి. అంటే కిలో ఆభరణాలపై రూ.3,500 చెల్లించాల్సిన పరిస్థితి. ఈ లెక్కన టిటిడి వద్ద ప్రస్తుతం ఉన్న మొత్తం వెండిని కరిగించి, శుద్ధి చేయించడానికి రూ.12.25 కోట్లు ఖర్చవుతుంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న టిటిడి….వెండి ఆభరణాలను కరిగించడం వరకే పరిమితమై (శుద్ధి చేయకుండా) దాన్ని వేలంలో విక్రయించాలని నిర్ణయించింది. కరిగించిన వెండిని వేలం వేయడానికి ప్రభుత్వరంగ వేలం సంస్థ అయిన ఎంఎంటిసితో ఒప్పందం కుదుర్చుకుంది. విక్రయించగా వచ్చిన మొత్తంలో 0.75 శాతం ఎం.ఎం.టి.సి.కి కమీషన్‌గా చెల్లించాల్సివుంటుంది.

దాదాపు పదేళ్లుగా వెండి విక్రయించకపోవడం వల్ల టిటిడి వడ్డీ రూపంలో కోట్లాది రూపాయలు నష్టపోయింది. ఇంకా చెప్పాలంటే వెండి ధర కూడా అంతకంతకూ తగ్గిపోతూ వచ్చింది. ఏదో ఒక పద్ధతిలో సాధ్యమైనంత త్వరగా వెండి ఆభరణాలను మొత్తం కరిగించి, అమ్మేసి, ఆ నగదును బంగారు రూపంలోకి మార్చి బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాల్సిన అవసరం ఉంది. ఇటీవలే శ్రీకాళహస్తి దేవస్థానం 14,000 కిలోల వెండి నాగపడగలను కరిగించి వేలం వేసింది. ఈ డబ్బులో 150 కిలోల బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి శ్రీకాళహస్తీశ్వరుని పేరుతో బ్యాంకులో జమ చేశారు. ఈ లెక్కన టిటిడి వద్ద ఉన్న మొత్తం ఆభరణాలను అమ్మేసి బంగారంగా మార్చితే….375 కిలోలకుపైగా బంగారం శ్రీవారి ఖాతాలో జమవుతాయి. సమస్యంతా వెండి కొండను ఎంత త్వరగా కరిస్తారనేదే..!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*