కరోనాలో కారుణ్యం చూపండి…! తిండిపెట్టండి..!కాపాడండి..!

కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం రాష్ట్రమంతటా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మెడికల్ షాపులు, నిత్యవసర సరుకుల దుకాణాలు తప్ప అన్నీ మూతపడ్డాయి. హోటళ్లు కూడా మూతపడ్డాయి. జనం రోడ్లలోకి రావడం లేదు. తిరుపతిలో అర్బన్ పోలీసులు పకడ్బందీగా కర్ఫ్యూ అమలు‌ చేస్తున్నారు.

ఇదంతా బాగానేవుంది. కరోనా మహమ్మారిని అంతమొందించాలంటే ఇవన్నీ చేయాల్సిందే. అయితే…ఈ యుద్ధంలో నిలువ నీడలేని నిరుపేదలు, అనాథలు పక్షులు సమిధలు కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపైన, అధికార యంత్రాంగంపైన ఉంది. తిరుపతి నగరంలోనే భిక్షాటన చేసుకుంటూ…ఎవరో అంత పెడితే తిని, ఎవరూ పెట్టకుంటే ఏ బండివద్దకో వెళ్లి అతి తక్కువ ఖర్చుతో కడుపు నింపుకునేవారు చాలామందే ఉన్నారు. కర్ఫ్యూలో ఇటువంటి అభాగ్యులు కడుపు మాడ్చుకోవాల్సిన దుస్థితి. దీన్ని ఎవరూ ఆలోచించడం లేదు.

ఇటీవల తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి….ఇటువంటి వారిని గుర్తించి, వాళ్లను‌ ఆదరించారు. చిరిగిన బట్టలతో, మాసిన గడ్డంతో ఉన్న వారికి…క్షురకర్మ చేయించి, స్నానం చేయించి, కొత్త దుస్తులు ఇప్పించారు. ఎస్పీ దయార్థ హృదయాన్ని చూసి అందరూ అభినందించారు. అయితే…నిజంగా అటువంటి అభాగ్యలను, అనాథలను ఆదుకోవాల్సిన సమయం‌ ఇప్పుడొచ్చింది. అటువంటి వారికి కర్ఫ్యూ ముగిసేదాకా నోటికి నాలుగు ముద్దలు అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ చొరవను ఎస్పీ తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఇప్పటికే 64 మందిని గుర్తించి అమ్మ ఒడి సంస్థకు తరలించారు.‌ అయినా ఇంకా అటువంటి వారు కనిపిస్తున్నారు. అలాంటివారందరినీ తీసుకెళ్లి సంరక్షించాల్సిన అవసరం ఉంది.

వీధి కుక్కలు, పక్షులకూ
నగరాల్లోనూ, పల్లెల్లోనూ వీధి కుక్కలు తిరుగుతుంటాయి. వీటికి ఏ హోటల్ నిర్వాహకులో, జంతు ప్రేమికులో ఆహారం‌ పెడుతుంటారు. కర్ఫ్యూతో హోటళ్లు మూతపడిన పరిస్థితుల్లో వాటికి తిండి దొరక్క అలమటించే ప్రమాదం ఉంది. దీన్ని గమనంలో ఉంచుకుని వీధి కుక్కలకు అయా ప్రాంతాల్లోని వారు అంత తిండి పెట్టాలి. పక్షులకు గింజలు వేసి‌‌ నీళ్లు పెట్టేవారూ ఉన్నారు. కర్ఫ్యూలో బయటకు వెళ్లడమే ఇబ్బందిగా ఉంటే వాటికి గింజలు‌ ఎక్కడ పెడతాంలే అని ఉదాశీనంగా ఉండిపోతే ఆ పక్షులు ప్రాణాలు విడిచే ప్రమాదం ఉంది. వీధి జంతువులకు, పక్షులకు ఆహారం అందించడానికి కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా భారత అనిమల్ వెల్ఫేర్ బోర్డు అన్ని రాష్ట్రాలకు ఒక సూచన చేసింది. కుక్కలు, పక్షుల విషయంలో ప్రభుత్వాలు ఏమి చేసినా చేయకపోయినా ప్రజలు కారుణ్యం చూపితే అవి బతికిపోతాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*