కరోనా కష్టకాలం…టిటిడి కార్మికుల్లో అలజడి..!

  • 1400 మందిని తొలగించారంటూ ఆందోళన
  • ప్రభుత్వానికి చెడ్డపేరు…రాజకీయంగా నష్టం

తిరుపతిలోని టిటిడి భక్తుల విశ్రాంతి గృహాల్లో, ఎఫ్ఎంఎస్ సర్వీసు కింద పని చేస్తున్న కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. శ్రీనివాసం, విష్ణునివాసం, మాధవం వసతి సముదాయాల్లో పని చెస్తున్న దాదాపు‌1400 మందిని‌ రేపటి నుండి (మే 1 నుండి) విధులకు రావాల్సిన పని లేదని టిటిడి అధికారులు చెప్పినట్లు కార్మికులు‌ చెబుతున్నారు. దీంతో గురువారం పొద్దుపోయాక పెద్ద సంఖ్యలో కార్మికులు విష్ణు నివాసం వద్ద ఆందోళనకు‌ దిగారు. తమను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు.

టిటిడి విశ్రాంతి సముదాయాల్లో పారిశుద్ధ్యం నిర్వహణ బాధ్యతను కాంట్రాక్టుకు ఇస్తున్నారు. దీన్ని ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఎఫ్ఎంఎస్) అంటున్నారు.‌ ఈ ఎఫ్ఎంఎస్ సర్వీసుల కింద తిరుపతిలోనే 1400 మంది‌ పని‌ చేస్తున్నారు. ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టర్ గడువు నేటితో (ఏప్రిల్ 30) ముగిసింది. కొత్త కాంట్రాక్టర్ నియామకం ఇంకా జరగలేదు. కరోనా కారణంగా నెల రోజులుగా విశ్రాంతి సముదాయాలను ఎవరికీ కేటాయించడం లేదు. భక్తులు వచ్చే పరిస్థితి లేనందు వల్ల గదుల కేటాయింపూ లేదు. కరోనా ఎప్పుడు ముగుస్తుందో, దర్శనాలు ఎప్పుడు మొదలవుతాయో, గదుల కేటాయింపు ఎలావుంటుందో టిటిడి అధికారులు అంచనాకు రాలేకున్నారు.

ఈ పరిస్థితుల్లో ఎఫ్ఎంఎస్ కాంట్రాక్ట టెండర్లను వెంటనే నిర్వహించాల్సిన అవసరం లేదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పని లేనందు వల్ల కార్మికులకు తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే 1400 మందిని విధులకు రావొద్దని చెప్పినట్లు చెబుతున్నారు. ఇది కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోంది.

అయితే…కరోనా కష్టకాలంలో కార్మికుల పట్ల ఇటువంటి నిర్ణయం తీసుకోవడం… ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తుందనడంలో సందేహం లేదు. కరోనా వేళ కార్మికులను మానవతా దృక్పథంతో ఆదుకుంటామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదట్లోనే చెప్పారు. అదే విధంగా తమ ప్రభుత్వం కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఉద్యొగ భద్రత కల్పిస్తుందని సిఎం అనేక సార్లు చెప్పారు. కాంట్రాక్టర్ వ్యవస్థ వద్దు చేసి కార్మికులకే కాంట్రాక్టు ఇస్తామని కూడా చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయిలో అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. టిటిడి కార్మికులనూ అందులో చేర్చాలని పాలక మండలి తీర్మానించింది. దీనివల్ల ఉద్యోగ భద్రత ఏర్పడుతుందని ఛైర్మన్ చెప్పారు.

ఇప్పడు…వీటన్నింటికీ భిన్నంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కొన్ని నెలలు పని‌ ఉండదనో, కాంట్రాక్టర్ నియామకం జరగలేదనో కారణం చూపి… కరోనా కష్టకాలంలో 1400 మందిని విధులకు రావొద్దనడం కార్మికులను‌ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయంలో ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి జోక్యం చేసుకుని యథావిధిగా తమను కొనసాగించాలని కార్మికులు కోరుతున్నారు. స్థానిక ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి, బోర్డు సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కల్పించుకుని సమస్య పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*