కరోనా విజృంభిస్తున్నా … తిరుమల దర్శనాలపై ప్రతిష్టకు పోతున్నారా…!

తిరుపతిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నగరంలో కేసుల సంఖ్య వెయ్యి దాటింది. అన్ లాక్ ముందు వందల్లో ఉన్న కేసులు…ఈ నెలలోనే ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇది నగరవాసులను కలవరపెడుతోంది. మళ్లీ లాక్ డౌన్ విధించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో స్థానికంగా కంటైన్మెంమెంట్ జోన్లలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయడానికి‌ పోలీసులు, జిల్లా అధికారులు‌ సిద్ధమవుతున్నారు. వాస్తవంగా తిరుపతి అంతటా లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఉంది.‌ అయితే తిరుమల శ్రీవారి దర్శనాలను దృష్టిలో ఉంచుకుని వెనకంజ చేస్తున్నారు.

లాక్ డౌన్ సమయంలో దాదాపు 80 రోజుల పాటు దర్శనాలు ఆపేశారు. అన్ లాక్ ప్రకటించాక జూన్ 11 నుంచి మళ్లీ దర్శనాలు ప్రారంభించారు. మొదట కొన్ని రోజులు రోజుకు‌ ఆరు వేల మందిని‌ అనుమతించారు. తరువాత ఈ‌ సంఖ్యను‌ 12,000కు పెంచారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక నుంచి భక్తులు వస్తున్నారు.

ఇదిలావుండగా దర్శనాలు ప్రారింభించాక 90 మంది దాకా టిటిడి ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. అయితే…ఉద్యోగులకు భక్తుల వల్ల సోకలేదని, వారు నివాసం ఉంటున్న ప్రాంతాల వల్లే వ్యాధి కోకిందని టిటిడి అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ఉద్యోగుల వల్ల ఒక్క భక్తునికీ కరోనా సోకలేదని చెబుతున్నారు.

టిటిడిలో కేసులు పెరగడాన్ని గమనించిన కలెక్టర్ తిరుమలను కంటోన్మెంట్ జోన్ ప్రకటించారు. అంతలోనే ఆ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. దీనికి టిటిడి అధికారుల ఒత్తిడే కారణమన్న వార్తలొచ్చాయి.

ఇదిలావుండగా….ప్రాంతాల లాక్ డౌన్ నిర్ణయంలో భాగంగా తిరుచానూరులో లాక్ డౌన్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తిరుచానూరు‌‌ అమ్మవారి ఆలయంలో దర్శనాలు నిపులుదల చేయడానికి టిటిడి అధికారులు‌ అంగీకరించలేదన్న వార్తలు వచ్చాయి.

తిరుపతిలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడానికి కారణం….వేలాది మంది యాత్రికులు ఇక్కడికి రావడమేనన్న భావన సర్వత్రావుంది. ఈ పరిస్థితుల్లో పని చేయడానికి టిటిడి ఉద్యోగులూ ఆందోళన చెందుతున్నారు. దర్శనాలను కొంతకాలం‌ ఆపేసి, సంప్రదాయంగా జరగాల్సిన కైంకర్యాలను లాక్ డౌన్ లో మాదిరిగా ఏకాంతంగా నిర్వహించాలని సూచిస్తున్నారు.

ఇదిలావుండగా…ఈ అంశం ప్రభుత్వం దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ముఖ్యమంత్రితో జరిగే సమీక్షలో తిరుమలతో పాటు ఇతర ప్రార్థనా మందిరాల్లో దర్శనాల అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‌టిటిడి అధికారులు ఆలోచన చేయాల్సిన‌ అవసరం ఉంది. తిరుపతిలో కరోనా పెరగడానికి దర్శనాలే కారణమన్న భావన స్థానికుల్లో పెరగడం మంచిది కాదు. – ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*