కర్నాటకలో వాట్సాప్ యుద్ధం జరిగిందట!

కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 38 స్థానాలు గెలుచుకున్నాయి.
రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు అసలు కర్ణాటక ఎన్నికలు మొత్తం వాట్సాప్‌లోనే జరిగాయని విదేశీ మీడియా చెబుతోంది. కోట్లాది మంది సమాచారాన్ని షేర్ చేసుకునేందుకు వాట్సాప్‌ను ఉపయోగించుకున్నారని, కాల్స్ చేస్తూ, చాట్ చేస్తూ సమాచార మార్పిడి చేసుకున్నారని పేర్కొంది. చాలామంది తప్పుడు, మత విద్వేషాలను రెచ్చగొట్టే సమాచారాన్ని పోస్టు చేశారని పరిశీలకులు చెబుతున్నారు.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని రెండు ప్రధాన పార్టీలు ఒక్కోటీ 20వేలకు పైగా వాట్సాప్ గ్రూపులను నిర్వహించాలని నిర్ణయించుకున్నాయని, ఫలితంగా నిమిషాల్లోనే లక్షలాదిమంది మద్దతుదారులను చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నాయని పేర్కొంది. అయితే, ఇలా గ్రూపుల్లో వచ్చి చేరే సమాచారంలో చాలా వరకు తప్పుడిదే అవుతోందని విదేశీ మీడియా పేర్కొంది. చాలామంది ప్రత్యర్థులను దూషించడానికి, రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలు పెంచే సమాచారాన్ని వైరల్ చేస్తున్నారని నిపుణులు సైతం చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ల మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. ‘‘అది చేతులు దాటిపోయింది. ఈ విషయంలో ఏం చేయాలో వాట్సాప్‌కే అర్థం కావడం లేదు’’ అని డిజిటల్ హక్కుల కార్యకర్త నిఖిల్ పహ్వా వ్యాఖ్యానించారు. పూర్తిగా ఎన్‌క్రిప్ట్ కావడంతో అందులోని సమాచారాన్ని ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో తెలుసుకోవడం చాలా కష్టమని, దీనిని రాజకీయ పార్టీలు అనుకూలంగా మార్చుకుంటున్నాయని పేర్కొన్నారు. తమను ఎవరూ ట్రేస్ చేయలేరనే ధీమాతో చాలామంది తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారని వివరించారు. ఫలితంగా బ్యాలెట్ ఎన్నికలకు బదులు వాట్సాప్‌లోనే ఎన్నికలు జరుగుతున్నాయని, ప్రత్యర్థులు ఈ మాధ్యమంలోనే పోటీ పడుతున్నారని విదేశీ మీడియా పేర్కొంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*