కర్నాటక ఎన్నికల్లో తెలుగు పార్టీల హడావుడి

కర్నాటక ఎన్నికల్లో ఆంధ్రపార్టీలు హడావుడి చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా తెలుగు పార్టీలో కన్నడ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు వంటి జాతీయ పార్టీలు ఏ రాష్ట్ర ఎన్నికల్లోనైనా పోటీ చేస్తుంటాయి. ప్రచారం చేస్తుంటాయి. అయితే…ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రాంతీయ పార్టీలు కర్నాటకలో పోటీ చేయకున్నా….అక్కడి రాజకీయాల్లో చెయ్యిపెడుతున్నాయి. బిజెపితో తెలుగుదేశం పార్టీకి స్నేహం చెడిపోయిన తరువాత టిడిపి నేతలు, కార్యకర్తలు కర్నాటకలో ప్రచారం చేస్తున్నారు. చిత్తూరు నుంచి ఓ బృందం పాదయాత్రగా బెంగళూరు దాకా వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వని బిజెపిక ఓటు వేయవద్దని ప్రచారం చేస్తారట. మరి కర్నాటకకు రూ.17 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించినపుడు చంద్రబాబు సహా చాలా మంది నాయకులు విమర్శ చేశారు. అలాంటప్పుడు కర్నాటకకు నిధులిస్తే తప్పుబట్టిన తెలుగు పార్టీల వ్యవహారాన్ని కన్నడ ప్రజలు ప్రశ్నించరా? కర్నాటక ఎన్నికల్లో ఎవరు గెలవాలని టిడిపి ఆశిస్తున్నదో బహిరంగంగా చెప్పడం లేదు. కాంగ్రెస్‌ గెలవాలా…జెడిఎస్‌ గెలవాలా అనేది…ఎవరు గెలవాలని టిడిపి కోరుకుంటుందో వెల్లడించడం లేదు. మరోవైపు మూడో ఫ్రంట్‌ ప్రయత్నాల్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇటీవల మాజీ ప్రధాని దేవెగౌడను కలిశారు. తమ పార్టీ మద్దతు జెడిఎస్‌కే ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్‌లో ప్రభావంతంగా ఉన్న ఎంఐఎం అధినేత ఒవైసీ కూడా జెడిఎస్‌కు మద్దతు ప్రకటించారు. ఇవన్నీ ఎందుకంటే కర్నాకటలోని 40 నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు గణనీయంగా ఉన్నారు అందుకే వారిని ప్రభావితం చేయడం ద్వారా బిజెపిని ఓడించాలని భావిస్తున్నారు. మరి కర్నాటకలోని తెలుగు ప్రజలు తెలుగు పార్టీలు చెప్పినట్లు ఓట్లేస్తారా…లేక స్థానికంగా ఉండే అంశాల ఆధారంగా ఓట్లేస్తారా అనేది కొంతకాలం ఆగితే తెలిసిపోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*