కర్నూలులో హైకోర్టుపై బాబుగారి విన్యాసం…!

Nara Chandrababu Naidu

నన్ను రాయలసీమ ద్రోహి అని ప్రచారం చేస్తున్నారు. కర్నూలులో హైకోర్టుకు మేము వ్యతిరేకం కాదు. మేం హైకోర్టు బెంచ్‌ ఇచ్చాం. వాళ్లు హైకోర్టు అంటున్నారు. ఏవేవో ప్రచారం చేన్నారు….ఇవీ 03.02.2020 విలేకరుల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు.

అమరావతిలో రాజధాని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కర్నూలులో హైకోర్టు పెట్టాలంటూ అనేక పర్యాయాలు సీమ ఉద్యమకారులు డిమాండ్‌ చేశారు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ సానుకూలంగా స్పందించలేదు. న్యాయ నగరం సహా నవ నగరాలు అమరావతిలోనే ఉంటాయని చెప్పారు. అంతేకాదు అక్కడే కొత్త భవనాలు నిర్మించి హైకోర్టు ఏర్పాటు చేశారు.

రాజధాని వికేంద్రీకరణలో భాగంగా జగన్‌ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మూడు రాజధానులు వొద్దు…ఒకటే రాజధాని ముద్దు అంటూ తెలుగుదేశం పార్టీ గత 48 రోజులుగా అమరావతి కేంద్రంగా ఆందోళనలు చేస్తోంది. ఈ క్రమంలోనూ మాటమాత్రంగానైనా…కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసుకుంటే తమ పార్టీకి అభ్యంతరం లేదు అనే మాటను చెప్పలేదు. అమరావతిలోనే రాజధాని ఉండాలని కోరుకుంటున్న సిపిఎం, సిపిఐ, బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటును స్వాగతించాయి. తెలుగుదేశం మాత్రం హైకోర్టుకూ అడ్డుపడుతూ వస్తోంది.

ఈ పరిస్థితుల్లో, శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు రాజయలసీమ ప్రజల హక్కుగా ఉన్న హైకోర్టు ఏర్పాటునూ చంద్రబాబు అడ్డుకుంటున్నార ఆగ్రహం సీమ ప్రాంతంలో వ్యక్తమయింది. దీంతో టిడిపికి సీమలో రాజకీయంగా నష్టం జరుగుతోందన్న వాస్తవాన్ని ఆలస్యంగా గ్రహించిన చంద్రబాబు నాయుడు….ర్నూలులో హైకోర్టుకు తాము వ్యతిరేకం కాదంటూ సన్నాయి నొక్కలు నొక్కుతున్నారు. అంతటితో ఆగలేదు. కర్నూలులో తాము బెంచ్‌ ఏర్పాటు చేశామంటూ ఒక అసత్యాన్ని కూడా నిస్సంకోశంగా మాట్లేడేశారు. బాబు చెబుతున్నదే నిజమైతే….ఇప్పటిదాకా కర్నూలులో బెంచ్‌ ఎందుకు ఏర్పాటు కాలేదు. కనీసం సీమలో బెంచ్‌ ఏర్పాటు చేయమని సుప్రీం కోర్టుకు, కేంద్రానికి లేఖ రాశారా? అందుకు అవసరమైన కనీసమైన ప్రక్రియ మొదలుపెట్టారా? ఇటువంటి మౌలికమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సివస్తుందన్న సంశయం కూడా బాబుగారికి కలగలేదు.

తాను చెప్పింది మారు మాట్లాడకుండా రాసుకుపోయే మీడియా ఉందన్న ధైర్యం కావచ్చు…..కర్నూలులో హైకోర్టు చెంచ్‌ పెట్టినట్లు సునాయాసంగా అబద్ధం చెప్పేశారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తాము అనుకూలమే అనే అంశాన్ని చంద్రబాబు విస్పష్టంగా ప్రకటించాలి. కర్నూలులో హైకోర్టును సమర్ధిస్తే….వైసిపి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని పాక్షికంగానైనా అంగీకరించినట్లు అవుతుందనే భావనతో చంద్రబాబు ఇంకా తటపటాయిస్తే….సీమలో టిడిపి భారీ మూల్యమే చెల్లించాల్సివస్తుంది.

….ఆదిమూలం శేఖర్‌, సంపాదకులు, ధర్మచక్రం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*