కర్నూలు రైతన్న రెక్కలు తెగాయా…రెక్కలు మొలిచాయా…!

*కర్నూలు జిల్లాలో రెక్కలు తెగి నేల రాలు తున్న రైతులు. కాదు – కాదు – కర్నూలు కు కొత్త రెక్కలు అంటున్న ప్రభుత్వ బాకాలు. *

ఏది నిజం? ఏది అసత్యం?

కర్నూలు జిల్లాలో గత మాసంలోపు రెండంకెలలో అప్పులు పాలైన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జిల్లాలో రోజూ ఏదో ఒక మారు మూల రైతుల ఇంట మరణ మృదంగాలు చావు డప్పులు మోగు తున్నాయి. పురుగుల మందుల డబ్బాలు ఖాళీ అవుతున్నాయి. ఎపిలో ఈ దుర్ఘటనలు పాపులర్ మీడియాకు వార్తలు కావు. సమయం సందర్భం లేకుండా ఏలిన వారు కోట్లాది రూపాయలు ప్రకటన రూపంలో ఇస్తారు కాబట్టి వారు చెప్పేదే అసలు సిసలైన వార్తలు.
అంతెందుకు? ఏలిన వారే మొన్న శెలవు ఇచ్చారు. కరువు కాటకాలతో ఉపాధి లభించకుండా రాయలసీమ నుండి వలసలు పోవడం లేదని ఎక్కువ సంపాదించ వచ్చని పైగా ఆలా వెళ్లడం సీమ వాసులకు అలవాటేనని మొన్న తేల్చేచిన నేపథ్యంలో ఏలిన వారి బాకాలు అంత కన్నా భిన్నంగా ఏలా రాస్తాయి.?

కర్నూలు సమీపం ఓర్వ కళ్లులో విమానాశ్రయం రెడీ అయిందని ఎట్టి అడ్డంకులు లేకుండా విమానం దిగిందని కర్నూలుకు కొత్తగా
రెక్కలు వచ్చాయని వార్తల వరదతో నింపారు.

ఇది వరలో ఒక మారు ఓర్వ కళ్లు విమానాశ్రయం త్వరలో రెడీ కానున్నదనే వార్త వెలువడిన సమయంలో “మాఇంట రోజూ శవాలు లేస్తుంటే అది పట్టించు కోకుండా విమానాశ్రయం గురించి మాట్లాడుతారా?” అని సీమ యువ కిశోరం రచయిత సొదుం శ్రీ కాంత్ ఒక గేయం రాశారు.అందులో…….
తలుచుకోగానే గాలిలో ఎగిరి పోయి అమరావతిలో అయ్య గారి కాళ్లు ఒత్తేందుకు నాయకులకు విమానాలు అవసరమైతే……..

సీమ ప్రజలకు కూడావలసల విమానాలు కావాలని ఆఖరి చూపుకు అవకాశముంటే దుబాయ్ లాంటి అరేబియా – దేశాలకు కూలి నాలికి పోయి కుళ్లని శవాలై ఇంటికి తిరిగి రావడానికి విమానాలు కావాలని వ్యంగ్యంగా రాసిన గేయం – కాదు – గాయ పడిన సీమ యువత హృదయం పూర్తి పాఠం పాఠకులకు సమర్పించు తున్నాను.

*పాత రేచాం దగాకోర్’*

———————

మాకు ప్రాజెక్టులు అక్కర్లేదు
మా కాంట్రాక్టర్లు, మా నాయకులు
రుయ్యున గాల్లో ఎగిరి పోయి
అమరావతిలో అయ్యగారి కాళ్లొత్తి
వాళ్ల అవసరాలు తీర్సుకోవాల గదా!

కట్టండి కట్టండి …
అర్జెంటుగా మాకో ఇమానాశ్రయం కట్టండి.
ఎన్ని కట్టెలు కాల్తే మీకేం
ఎన్ని పాడెలు ఊరి పొలిమేరలు దాటితే మీకేం?
ఎన్ని పసరాలు కబేళాల పాలైతే మీకేం?
మీ పాడెనుములు
బ్రాందీ షాపులు, అక్రమ కాంట్రాక్టులు,
శవ వ్యాపారాలు
అన్నీ సల్లగుండాల అంతే!

తరాలు మారినా
మా సేండ్లు తర్సినా తర్సకున్యా
పొలంలో పైరు తగలబడి బూడిదైనా పర్వాలేదు!
అడ్డగోలు ప్రభుత్వ విధానాలతో
నిధులు ‘పథకాల’ పంటకాలవలకెక్కి
మీ సేతల్ను మాత్రం తడుపుతానే ఉండాల, ఆరకుండా!

లెక్క లేదన్న సొడ్డుతో
ఏండ్లకు ఏండ్లుగా
తలగడ కింద శిలాఫలకాలేసుకుని
మా ప్రాజెక్టులన్నీ
పండుకున్యా పర్వాలేదు
గోసెల నెత్తిన రుమాలు
సచ్చిన శవాలపై కప్పిన తెల్ల గుడ్డలుగా మారినా దిగుల్లేదు
మీగ్గావాల్సిన సారా కాంట్రాక్టుల కోసమో
మరొకదాని కోసమో
వాడికి తొత్తులుగా మారండి

వాడు ‘ఉస్కో…’ అని ఈలెసి పిల్చీ పిల్సగానే
ఎడతెరక్కుండా మొరిగే కుక్కల్లారా
మీకు ఓట్లేసిన గడ్డ కోసం
నోరెండి గుక్క పట్టిన న్యాల కోసం
నిత్యం పల్లెల్లో ఇనిపించే శోకగీతం కోసం
ఏనాడైనా నోరెత్తి పల్లెత్తు మాటైనా మాట్లాన్నారా??
విశ్వాసం లేని జాతిరా మీది!

బస్సుల్లో పట్టనంతగా బల్సినారు గదా
కారులో ఏసీ ల్యాకుంటే కదల్లేరు గదా
అయినా ఐపోన్ల కాలం గదా
అన్నీ సిటెకెలో టచ్చై పోవాల
యాడికి పొవ్వాలన్యా
ఇప్పుడు మీకు ఇమానం గావాల ఇమానం
మానం లేని మనుసులు

మాగ్గూడా గావాల్లే ప్పా ఒక ఇమానం
వలసల ఇమానం
అదృష్టం బాగుంటే
ఆఖరి సూపుకు రాసుంటే
దుబాయ్ , మస్కట్ల
కూలీనాలికి పోయి కూలిపోయి
కుల్లని శవాలమై ఇంటికి తిరిగి రాడానికి

అభిమానం సావని పెండ్లాం పిల్లోల్లు
ఆ శవాలపై పడి
బతుకు గోడు ఎల్లబోసుకోడానికి!

అయ్యలారా….
కట్టండి కట్టండి
శరవేగంగా కట్టండి
అక్కర లేకున్యా కట్టండి
కాకపోతే మమ్మల్ని
రెన్నాల్లన్నా కూలికి పిల్చండి
మీకు పుణ్యముంటుంది
సందులో సందు
ఆన్నే…
ఆ గునాదుల కిందనే
మీకు గోరీలు కూడా కట్టి
దగాకోరు నాయకుల్ని పాతరేసి
చేబడతాం శరవేగంగా
తరతరాలుగా కదలక
పడకేసిన మా ప్రాజెక్టు పనుల్ని.

– వి. శంకరయ్య, 9848394013

మిత్రులు శ్రీ కాంత్ అనుమతి లేకుండా ఈ గేయం ఉపయోగించు తున్నందుకు మన్నించగలరు.
******************

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*