కష్టకాలంలో ప్రజలకు శ్రీకాళహస్తి ఎంఎల్ఏ అండదండ… కరోనాపై అలుపెరగని పోరు..!

ధర్మచక్రం ప్రతినిధి – శ్రీకాళహస్తి

ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న కరోనా వైరస్ శ్రీకాళహస్తిలోనూ అధికారులు, నాయకులు, ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. జిల్లాలోనే శ్రీకాళహస్తిలో మొదటి కేసు నమోదవడంతో నాటి నుంచి నేటి వరకు అందరికంటే ఎక్కువగా, అలుపెరగని‌ శ్రామికునిలా పని చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. కష్టకాలంలో పేదలను ఆదుకోడానికి రోజుకో సేవా కార్యక్రమం చేపడుతున్నారు.

కోడిగుడ్లు పంపిణీ చేస్తున్న ఎంఎల్ఏ

కరోనాపై పోరులో ఎమ్మెల్యే చొరవ….
గతనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా విధించిన జనతా కర్ఫ్యూ మొదలుకొని నేటి వరకు కరోనా నివారణ కోసం, పేదలను ఆదుకోవడంకోసం ఎమ్మెల్యే చేస్తున్న కృషి, చొరవ అంతాఇంతా కాదు. జనతా కర్ఫ్యూ సందర్భంగా స్వయంగా ఎమ్మెల్యేనే రోడ్ల మీదకు వచ్చి పర్యవేక్షించారు. తదుపరి శ్రీకాళహస్తిలో జిల్లాలోనే మొదటి పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులతో కలిసి ఎక్కువగా చొరవ తీసుకున్నారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. జిల్లాలోనే మరెక్కడా లేని విధంగా పట్టణంలో డ్రోన్ ల ద్వారా మందు చల్లించి స్వయంగా పర్యవేక్షించారు.

లాక్ డౌన్ నుంచి నేటి వరకు నిత్యం సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణంలోని ఇంటింటికి మాస్కులు, శానిటైజ్ పంపిణీ చేశారు. కూరగాయలు మార్కెట్ ఒకేప్రాంతంలో ఉండటంతో జనాభా రద్దీ అధికంగా ఉండేది. దీనిని దృష్టిలో పెట్టుకొని పట్టణంలో వేర్వేరు ప్రాంతాల్లో కూరగాయల విక్రయానికి ఏర్పాటు చేసి రద్దీ అరికట్టగలిగారు. రెండు లోడ్ల కూరగాయలు తెప్పించి పట్టణంలోని పేదలకు పంపిణీ చేశారు. రోగనిరోధక శక్తి పెంపొందించేందుకుగాను సి విటమిన్, నిమ్మకాయలు ఇంటింటికి పంపిణీ చేశారు. పేదలను ఆదుకోవాలని ఉద్దేశ్యంతో ఏర్పేడు మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు గున్నేరి కిషోర్ రెడ్డితో కలిసి పేదలకు చికెన్, కోడిగుడ్లు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి మండలంలోని తొండమనాడులో ట్రాక్టర్ పై తిరుగుతూ ఇంటింటికి నిత్యావసర సరుకులు అమనదజేశారు. ఎమ్మెల్యే సూచనలతో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో పార్టీ నాయకులు పేదలకు తమవంతు చేయూత అందిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో పేదలపై ఎమ్మెల్యే చూపుతున్న చొరవపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*