కెసిఆర్‌తో గొడవలొద్దట…తెలంగాణలో టిడిపి బతకాలట…బాగుంది…బాగుంది..బాబుగారి చాణక్యం!

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ వెళ్లారు. టి-టిడిపి నేతలతో విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఒక్కరోజు ముందే…చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ వస్తున్నారని, నేతలో సమావేశమై కాంగ్రెస్‌తో పొత్తు సంగతి తేల్చేస్తారని మీడియా కథనాలు రాసింది. తీరా చంద్రబాబు హైదరాబాద్‌ రానూ వచ్చారు…వెళ్లనూ వెళ్లారు. పొత్తుల సంగతి తేల్చలేదు. ఇక టి-టిడిపి నేతల సమావేశంలో బాబు మాట్లాడిన తీరు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

తెలంగాణ ఎన్నికల్లో నిజంగా టిడిపి గెలవాలనుకుంటే….పార్టీ శ్రేణుల్లో కసి, ఉత్సాహం నింపేలా మాట్లాడివుండాల్సింది. కానీ…కెసిఆర్‌తో గొడవలే వొద్దు…పొత్తులు మీరు నిర్ణయించుకోండి…నేను మీకు అండగా ఉంటాను…ఇలా పెద్ద మనిషి మాటలు చెప్పి వచ్చేశారు. బాబులో ఈ మార్పునకు కారణం ఏమిటి? ఆయన ఎందుకలా మాట్లాడారు? పొత్తుల సంగతి తేల్చకుండా…మీరే తేల్చుకోండి అని ఎందుకు చెప్పారు? ఇంతకీ కాంగ్రెస్‌తో టిడిపికి పొత్తువుంటుందా? పొత్తు పెట్టుకోవాలనుకున్నా పెట్టుకునే ధైర్యం ఉందా?

మోడీ మా ఇద్దరి మధ్య (తనకు, కెసిఆర్‌కు మధ్య) గొడవలు పెట్టడానికి ప్రయత్నించారట. ఆ మధ్య పార్లమెంటులో మాట్లాడిన మోడీ…చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడుతూ…పక్కరాష్ట్ర సిఎం పరిణతితో వ్యవహరిస్తున్నారు. మీరు గొడవలు పెట్టుకుంటున్నారు అని అన్నారు. దీనిర్థం గొడవలు పెట్టడమా? నిజంగా చెప్పాలంటే చంద్రబాబును తక్కువచేసి మాట్లాడారు. ఆ మాటే చెప్పొచ్చు. అంతేగానీ…ఇద్దరి మధ్య గొడవలు పెట్టేలా మాట్లాడారు అని అనడంలో అర్థమేముంది. అయినా….ఇన్ని రోజుల్లో ఏ రోజూ ‘మా ఇద్దరి మధ్య గొడవలు పెట్టేలా మాట్లాడుతున్నారు’ అని అనలేదు. కెసిఆర్‌ కంటే నాకు పరిణతి లేదంటావా…అని ఆక్రోశం వెల్లగక్కారు తప్ప ఈ రోజు చెప్పిన మాట చెప్పలేదు.

మోడీ మా మధ్య గొడవ పెడుతున్నారు అని బాబు అనడం వెనుక కారణాలు లేకపోలేదు. తనకు కెసిఆర్‌తో గొడవ పెట్టుకోవాలని లేదు అని చెప్పడమే ఈ మాటల అర్థం. గొడవ, ఘర్షణ లేకుండా రాజకీయాలు నడుస్తున్నాయా? టి-శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం కోసం నిర్వహించిన సమావేశంలో ఒక్కమాటంటే ఒక్క మాట కూడా కెసిఆర్‌ ప్రభుత్వాన్ని చంద్రబాబు విమర్శించలేదు. ఆచితూచి మాట్లాడారు. ఇక్కడ ‘ముందస్తు ఎన్నికలు ఎందుకొచ్చాయో మీకు తెలుసు….తెలంగాణలో తెలుగుదేశం బతకడం చారిత్రక అవసరం. ఇక్కడ నేను ముఖ్యమంత్రి కాలేను. మీరే పార్టీని నిలబెట్టారు. పొత్తులపై మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తా. మీకు అండగా ఉంటా’ అని ఎవరో బయటి వ్యక్తి మాట్లాడినట్లు మాట్లాడి తంతు ముగించారు.

కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి ఉవ్విళ్లూరిన టిడిపి ఇప్పుడు వెనుకంజవేస్తోంది. పొత్తు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుకోవచ్చుగానీ…కెసిఆర్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో పెట్టుకోవాల్సిన అవసరం లేదన్న ఆలోచనలో టిడిపి అగ్రనాయకత్వంలో బయలుదేరింది. ఇది తెలియని టి-టిడిపి శ్రేణులు అమాయకంగా పొత్తుపై ఆశలు పెట్టుకున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమంటే….కెసిఆర్‌తో శత్రుత్వం పెంచుకోవడమే. అదే జరిగితే….ఓటుకు నోటు కేసు వంటివి బయటికొస్తాయి. ఎటూ గెలవనిదానికి కెసిఆర్‌తో విరోధం ఎందుకు? ఆ పొత్తులేవో ఆంధ్రప్రదేశ్‌లో చూసుకుందాం…అనేలావుంది బాబు వైఖరి. అందుకే కెసిఆర్‌ను పొల్లెత్తి మాట్లాడకుండా…పొత్తుల విషయంలో తెలంగాణ నాయకులకే అధికారం ఇస్తున్నట్లు చెప్పేసి…హైదరాబాద్‌ సమావేశం తంతు ముగించారు. ఇలాగైతే తెలంగాణలో టిడిపి బతికినట్లే!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*