కాంగ్రెస్‌ నేతలు యమ హ్యాపీ..! ఎందుకో తెలుసా…?

రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంతో కాంగ్రెస్‌కు ఎటువంటి పొత్తూ ఉండదని తేలిపోవడంతో హస్తం పార్టీ కార్యకర్తలు, దిగువ స్థాయి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశంతో సంబంధాలు పెట్టుకున్నప్పటి నుంచి తీవ్ర ఆవేదనకు గురవుతూ వస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

బిజెపిని ఓడించే పేరుతో చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ – టిడిపి పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ పొత్తు నామమాత్రంగానూ ఫలించకపోగా, టిఆర్‌ఎస్‌కు లబ్ధి చేకూర్చింది. తెలుగుదేశంతో పొత్తును జీర్ణించుకోలేని కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు టిఆర్‌ఎస్‌కు ఓట్లేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ పొత్తుపెట్టుకుంటే ఇటువంటి చేదు అనుభవం తప్పకపో వచ్చునని అంచనా వేశారు. పొత్తును వ్యతిరేకించే కాంగ్రెస్‌ కార్యకర్తలు తమ ఓట్లును వైసిపికి వేసే అవకాశాలుంటాయి. ఒంటరిగా పోటీ చేస్తే కాంగ్రెస్‌ ఓట్లు టిడిపికి రాకున్నా కనీసం వైసిపికి వెళ్లకుండావుంటాయి.

ఈ వ్యూహాత్మక ఆలోచనతోనే కాంగ్రెస్‌, టిడిపి పొత్తు లేకుండా విడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. కారణాలు ఏవైనా ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు స్వాతిస్తున్నారు. స్వతంత్రంగా పోటీ చేయడం వల్ల ఈరోజు కాకున్నా రేపటికైనా పుంజుకోడానికి అవకాశముంటుందని, అలాకాకుండా టిడిపితో పొత్తుపెట్టుకుని 10 – 15 స్థానాలకు పరిమితమైతే అది భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన చెందారు. ఒకసారి పొత్తుపెట్టుకుని పరిమిత సీట్లలో పోటీచేస్తే మళ్లీ రాష్ట్రంలో పార్టీ పుంజుకునే అవకాశం ఉండదన్నది అటువంటివారి ఆవేదన. పొత్తు కటీఫ్‌ అవడంతో అటాంటివారంతా ఊపిరి పీల్చుకున్నారు.

తాజా నిర్ణయం వల్ల కాంగ్రెస్‌లోని నియోజకవర్గ స్థాయి నేతలు చాలా హ్యాపీగా ఉన్నారు. పొత్తులేకుంటే 175 స్థానాల్లోనూ పార్టీ పోటీ చేస్తుంది. అప్పుడు వారికీ పోటీ చేసే అవకాశం లభిస్తుంది. అదే పొత్తువుంటే 10-15 స్థానాల్లోని నేతలకు పోటీకి అవకాశం ఉంటుంది. మిగిలిన నియోజకవర్గాలోని నాయకులంతా టిడిపి కోసం పని చేయాల్సిన పరిస్థితి వచ్చేది. వాస్తవంగా 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందన్న ఆశతో చాలామంది నాయకులున్నారు. అగ్ర నాయకులు పార్టీని విడిచి ఇతర పార్టీలకు వెళ్లిపోయినా….రెండోశ్రేణి నాయకులు కాంగ్రెస్‌లో ఎదిగివచ్చారు. పొత్తు అనేసరికి అలాంటి వారంతా డీలాపడ్డారు. ఇప్పుడు పొత్తువుండదని తేలడంతో ఉత్సాహంగా ఉన్నారు.

ఒంటరి పోరు అనేసరికి డీలాపడిన నేతలూ కాంగ్రెస్‌లో ఉన్నారు. సొంతంగా కొంత ఓట్ల బలం కలిగిన కాంగ్రెస్‌ నేతలు….తెలుగుదేశంతో పొత్తువల్ల టిడిపి ఓట్లు కూడా కలిస్తే సునాయాసంగా గెలిచిపోతామని సంబరపడ్డారు. ఇటువంటి వారు ఈ కొన్నినెలల కాలంలోనే చంద్రబాబును, తెలుగుదేశంను భుజానికి ఎత్తుకున్నారు. ఇటువంటి నేతలు చాలాపరిమితంగానే ఉన్నా….వారంతా తాజా నిర్ణయంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*