కాంగ్రెస్‌ 982….భాజపా 929! ఎక్క‌డ? ఏమిటి?

కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యం ప్రదర్శించింది. సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో 982 వార్డుల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ ఎన్నికల్లో 929 స్థానాలతో భాజపా రెండో స్థానంలో నిలిచింది.

29 నగర పురపాలక సంస్థలు, 53 పట్టణ పురపాలక సంస్థలు, 23 నగర పంచాయతీల్లోని 2,527 వార్డులు, మైసూరు, తుమకూరు, శివమొగ్గ నగరపాలికల్లోని 135 డివిజన్లకు ఆగస్టు 31న ఎన్నికలు జరిగాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 982 స్థానాల్లో విజయం సాధించింది. ఇక భాజపా 929, జేడీఎస్‌ 375, బీఎస్పీ 13 వార్డుల్లో గెలుపొందింది.

శివమొగ్గ నగరపాలక సంస్థను భాజపా కైవసం చేసుకుంది. అక్కడ మొత్తం 35 డివిజన్లు ఉండగా.. 20 స్థానాల్లో భాజపా విజయం సాధించింది. 7చోట్ల కాంగ్రెస్‌, 2 చోట్ల బీఎస్పీ, 6 స్థానాల్లో స్వతంత్రులు గెలుపొందారు. మైసూరులోని 65 డివిజన్లలో భాజపా 22, కాంగ్రెస్‌ 19, జేడీఎస్‌ 18, బీఎస్పీ 1, స్వతంత్రులు 5 స్థానాల్లో విజయం సాధించారు. తుమకూరులో 35 స్థానాలకు గానూ.. భాజపా 12, కాంగ్రెస్‌ 10, జేడీఎస్‌ 10, స్వతంత్రులు 3 స్థానాలు దక్కించుకున్నాయి. శివమొగ్గ భాజపా నేత యడ్యూరప్ప సొంత జిల్లా కావడం విశేషం. మరో వైపు మైసూరు దక్షిణ కర్ణాటకలోని కీలక నగరం. ఇక్కడ జేడీఎస్‌బలంగా ఉంది. అయితే తాజా ఎన్నికల్లో భాజపా 22 స్థానాలు గెలుచుకొని ఎక్కువ సీట్లు సాధించిన ఏకైక పక్షంగా నిలిచింది. అయితే కాంగ్రెస్‌, జేడీఎస్‌లు కూటమిగా మారితే మేయర్‌పీఠం వారికే దక్కనుంది.

స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ కలిసి పోటీ చేయలేదు. కానీ.. తాజా ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఈ రెండు పార్టీలు మళ్లీ కూటమిగా ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*