కాకి లెక్కలతో కలెక్టర్‌ను మాయచేసిన పలమనేరు అధికారులు!

– పలమనేరులో ఓడిఎఫ్‌ హుళక్కే..!
– నేటికీ అసంపూర్తిగా మరుగుదొడ్లు
– బిల్లులు మాత్రం మంజూరైపోయాయి

జిల్లాను ఓడిఎఫ్‌గా(బహిరంగ మల విసర్జన రహితంగా) మార్చడానికి కలెక్టర్‌ ప్రద్యుమ్న నిర్విరామంగా కృషి చేశారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు నిర్మించడానికి అధికారులను పరుగులుపెట్టించారు. ఎట్టకేలకు జిల్లాను ఓడిఎఫ్‌ జిల్లాగా ప్రకటించారు. అయితే….కింది స్థాయి అధికారులు కలెక్టర్‌ను మాయ చేశారనేది వాస్తవం. మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికాకుండానే పూర్తయినట్లు కాకిలెక్కలు చెప్పేశారు. ఇందుకు పలమనేరు నియోజకవర్గంలోనే అనేక ఉదాహరణలున్నాయి. నాలుగు గోడలు నిర్మించి, పైన రెండు రేకులు వేసేసి అదే మరుగుదొడ్డిగా చెప్పేశారు. దీంతో ఇప్పటికీ వినియోగానికి పనికిరరాని ఇటువంటి మరుగుదొడ్లు వందల సంఖ్యలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు.

పలమనేరు నియోజకవర్గంలోని వి.కోట, బైరెడ్డిపల్లి, పలమనేరు రూరల్‌, గంగవరం, పెద్దపంజాణి మండలాల్లో 36,160 మరుగుదొడ్లు నిర్మించినట్లు అధికారులు ప్రకటించారు. అన్నింటికీ బిల్లులు కూడా మంజూరు చేయించుకున్నారు. అయితే…ఇందులో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన చేసినా అక్రమాలు బయటపడుతాయి. ఒక మరుగుదొడ్డికి పైన రేకులుండవు, ఇంకోదానికి లెట్రిన్‌ బేసిన్‌ ఉండదు, మరో దానికి సెప్టిక్‌ ట్యాంకుపై మూత కనిపించదు, మరికొన్నింటికి అసలు తలుపే ఉండదు, అన్నీవుంటే నీటి కనెక్షన్‌ లేదు. ఇటువంటివి ఏ గ్రామానికి వెళ్లినా కనిపిస్తాయి. అయినా బిల్లులు మాత్రం మంజూరైపోయాయి. అసంపూర్తిగా ఉన్నవాటికి బిల్లులు ఏ విధంగా మంజూరు చేసుకున్నారంటే సమాధానం చెప్పేవాళ్లు ఉండరు. వాస్తవంగా లబ్ధిదారులే మరుగుదొడ్లు నిర్మించుకోవాలి. కానీ కలెక్టర్‌ ఒత్తిడి చేస్తుండటంతో…కాంట్రాక్టర్లకు అప్పగించి పనులు చేయించారు. ఆ కాంట్రాక్టర్లు అరాకొర పనులు చేసి బిల్లులు స్వాహా చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిర్మాణం పూర్తయిన మరుగుదొడ్లనూ వినియోగిస్తున్న దాఖలాలు లేవు.

సాక్ష్యాత్తు మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి నియోజకవర్గంలోనే అధికారులు మాయ చేశారు. నియోజక వర్గంలో మరుగుదొడ్ల నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపించాలని, అసంపూర్తిగా ఉన్న వాటిని వెంటనే పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*