కాణిపాకం వినాయకా…ఆ లడ్డూలతోనే సర్దుకో స్వామీ!

– బ్రాహ్మణేతరులతోనే లడ్డూల తయారీ
– ఇది సంప్రదాయాలకు, టెండరు నిబంధనలకు విరుద్ధం
– భక్తుల నుంచి విమర్శలు

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు శ్రీకాళహస్తి తరువాత కాణిపాకం ఆలయాన్ని దర్శించుకోడానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. రానురానూ కాణిపాకాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆలయమంటే సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు కేంద్రం. ఆ విశ్వాసాలకు భగం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే….కాణిపాకంలో లడ్డూ ప్రసాదాల తయారీ సంప్రదాయాలకు భిన్నంగా జరుగుతోంది. తిరుమలలో లాగా బ్రాహ్మణులతోనే ప్రసాదాలు తయారు చేయించాలన్న నిబంధన ఉన్నా…. కాంట్రాక్టరు దాన్ని పాటించడం లేదు. దీంతో భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

కాంట్రాక్టరుకు చెల్లించే ధర ఇలా..
స్వామికి నైవేథ్యంగా సమర్పించే అన్నప్రసాదాలను ఆలయం లోపలే ఉన్న పోటులో బ్రాహ్మణులు తయారు చేస్తున్నారు. భక్తులకు విక్రయించే లడ్డూలు, వడ, పులిహోరా మాత్రం బయట పోలీస్‌ స్టేషన్‌ పక్కన ఉన్న పోటులో తయారవుతున్నాయి. లడ్డూ, వడ, పులిహోరా తయారీకి అవసరమైన సరుకులను దేవస్థానం అందజేస్తుంది. పనివాళ్లను కాంట్రాక్టరు సమకూర్చుకుని లడ్డూలు తయారు చేయాలి. 80 గ్రాముల లడ్డూ తయారీకి ఒక బ్యాచ్‌కు (1300 లడ్డూలు) రూ.347 చెల్లిస్తారు. 400 గ్రాముల లడ్డూలకు ఒక బ్యాచ్‌కు (260 లడ్డూలు) రూ.347 ఇస్తారు. ఇక 800 గ్రాముల లడ్డూలకు బ్యాచ్‌ (130 లడ్డూలు)కు రూ.302 చెల్లిస్తారు. పులిహోరాకు రూ.430, వడకు రూ.238 ఇస్తున్నారు. రోజుకు సగటున 80 గ్రాముల లడ్డూలు 8 బ్యాచీలు; 400 గ్రాముల లడ్డూలు 10 బ్యాచీలు, పెద్ద లడ్డూలు 2 బ్యాచీలు తయారవుతాయి. నెలకు 400 – 500 బ్యాచీల లడ్డూలు తయారవుతాయి. పులిహోరా 120 బ్యాచీలు, వడ 10 బ్యాచీల దాకా తయారవుతాయి. నెలకు రెండు లక్షలు దాకా కాంట్రాక్టురుకు చెల్లిస్తుంటారు.

బ్రాహ్మణులేరీ…?
బ్రాహ్మణులతోనే ప్రసాదాలు తయారు చేయిస్తామని నిబంధనల్లో అంగీకరిచిన కాంట్రాక్టరు….ఒక్కరంటే ఒక్క బ్రాహ్మణుని కూడా పోటులో నియమించలేదు. చుట్టపక్కల పల్లెల నుంచి కూలీలను తీసుకొచ్చి లడ్డూలు తయారు చేయిస్తున్నారు. కనీసం బూందీ పట్టడానికో, లడ్డూపాకం తయారు చేయడానికి కూడా బ్రాహ్మణులు లేరు. బ్రాహ్మణేతరులు లడ్డూలను తయారు చేయలేరన్నది ధర్మచక్రం అభిమతం కాదు. అనుభవజ్ఞులు ఎవరైనా బాగానే చేయగలరు. అయితే…ఆలయ సంప్రదాయాలు, టెండరు నిబంధనల ప్రకారం బ్రాహ్మణులతోనే చేయించాలని ఉండగా….దాన్ని ఎందుకు పాటించడం లేదనే ధర్మచక్రం ప్రశ్నిస్తోంది. బ్రాహ్మణులు దొరకలేదని చెబుతున్నారుగానీ….వాస్తవం అది కాదని స్థానికులు అంటున్నారు. బ్రాహ్మణులకు రోజుకు రూ.1000 దాకా ఇవ్వాల్సివుంటుందని, అదే స్థానిక పల్లెవాసులకైతే రూ.100, రూ.150 ఇస్తే సరిపోతుందని, అందుకే వారితో పని చేయిస్తున్నారని చెబుతున్నారు. డబ్బులు మిగుల్చుకోడం కోసం ఆలయ సంప్రదాయాలను తుంగలో తొక్కుతున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా తనిఖీలకు వస్తే….అక్కడ పనిచేసే కార్మికులకే జంధ్యం వేసి బ్రాహ్మణులుగా చూపిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి.

దాదాపు 12 గంటల పని…
పోటులో ఎక్కువ మంది మహిళలు పని చేస్తున్నారు. లడ్డూలను కవర్లకు వేసే పనంతా మహిళలే చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు వస్తే సాయంత్రం 6 గంటల దాకా పని చేస్తున్నారు. అయినా వాళ్లకు గిట్టుబాటు కూలీ ఇవ్వడం లేదు. అయినా ఏదో నీడపాటున, అంతగా శ్రమలేని పని దొరుకుతుందన్న భావనతో పోటు పనికి వస్తున్నారు. పోటులో ఎంతమంది పని చేస్తున్నారని అక్కడి ఉద్యోగులను ఆరా తీయగా ఒకరు 30 మంది అని చెప్పగా, ఇంకొకరు 40 మంది అని చెప్పారు. అయితే ధర్మచక్రం ప్రతినిధులు సందర్శించినపుడు 20 మందికి మించి పోటులో కనిపించలేదు.

చేతికి గ్లౌజులు కూడా లేవు…
స్వామివారి ప్రసాదాలు తయారు చేయాల్సిన శుచిగా శుభ్రంగా ఉండాలి. కానీ కాణిపాకం పోటులో అది కనిపించలేదు. లడ్డూలను కవర్లో వేసే మహిళలు చేతులకు కనీసం గ్లౌజులు కూడా వేసుకోలేదు. లడ్డూలు పట్టే కూలీలు కూడా శుభ్రంగా కనిపించలేదు. లుంగీలు కట్టుకుని, నేలమీద కూర్చుని బెల్లంముద్దలు పట్టినట్లు లడ్డూలు తయారుచేస్తూ కనిపించారు. తల వెంట్రుకలు రాలకుండా అందరూ టోపీలు మాత్రం ధరించారు.

అధికారులు ఏమి చేయాలంటే…
ఆలయ ఉన్నతాధికారులు స్పందించి, వినాయకుని పోటు పరిసరాలను మరింత శుభ్రంగా ఉంచడంతో పాటు పనిచేసే వారిని మరింత శుచిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా టెండరు నిబంధనల ప్రకారం బ్రాహ్మణులతో పని చేయించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలి. అది సాధ్యంకానపుడు….పని చేస్తున్న వారికే బ్రాహ్మణులకు ఇచ్చే విధంగా కూలీ ఇప్పించడానికి చర్యలు తీసుకోవాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*