కాపుల ఓట్లపై జగన్‌ ఆశ వదులుకున్నారా..?

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేయలేనంటూ వైసిపి అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డి కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. అన్ని రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం….కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదని తేల్చేశారు. ఇది తెలిసినా చంద్రబాబు నాయుడు….రిజర్వేషన్ల ఆశ చూపి కాపులను మోసం చేశారని విమర్శించారు. తాను అలా చేయలేని, కాపు కార్పొరేషన్‌కు రెట్టింపు నిధులు ఇస్తానని ప్రకటించారు. జగన్‌ చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది.

జగన్‌ ప్రకటన చూస్తే ఓ విషయం స్పష్టమవుతుంది. ఆయన కాపు ఓట్లపై ఆశ వదులుకున్నట్లు కనిపిస్తోంది. తనకు కులంలో సంబంధం లేదని, ఒక కులంతో పార్టీని నిర్మించలేమని జనసేన అధినేత పవన్‌ చెబుతున్నప్పటికీ…కాపులంతా పవన్‌పైన కోటి ఆశలుపెట్టుకున్నారు. ఇప్పటిదాకా రెడ్డి, కమ్మ సామాజికవర్గాలు అధికారం కోసం తమను మెట్లుగా వాడుకున్నారని, తమకు అధికార పీఠం దక్కకుండా చేస్తున్నారని ఆక్రోశంతో ఉన్న కాపులు….పవన్‌ ద్వారానైనా తమ కల నెరవేరుతుందన్న ఆశతో ఉన్నారు. అందుకే పవన్‌ ఎంతగా కులం లేదని చెబుతున్నా…ఆ కులానికి చెందిన వారు మాత్రం పవన్‌ వెనుక నడుస్తున్నారు.

ఇది స్పష్టంగా అర్థమైన జగన్‌ మోహన్‌ రెడ్డి…కాపు రిజర్వేషన్లు సాధ్యంకాదంటూ ప్రకటన చేశారు. ఇది కాపుల్లో వ్యతిరేకత తీసుకొచ్చినా…బిసిల్లో జగన్‌ పట్ల సానుకూలత ఏర్పడటానికి దోహదపడుతుంది. కాపులకు బిసి రిజర్వేషన్లు కల్పించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఇప్పటికే బిసిల జాబితాలో ఉన్న కులాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తెలుగుదేశం పారీతో ఉన్న బిసిలు కూడా కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ చేసిన ప్రకటన బిసిల్లో అనుకూలత ఏర్పడటానికి ఉపయోగ పడుతుంది. రాని ఓట్ల కోసం రిజర్వేషన్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం కంటే…వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా బిసిలను ఆకట్టుకోవచ్చన్న వ్యూహం కూడా జగన్‌ నిర్ణయంలో కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*